ఇది కదా సక్సెస్ అంటే.. ఆ మహిళకు ఒకేసారి రెండు ఉద్యోగాలు
ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ మరేదానికి ఉండబోదు అనడటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం.
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న పోటీ మరేదానికి ఉండబోదు అనడటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన సమయంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకపోవడం కారణంగా ఒక్కో ఉద్యోగానికి వందల మంది పోటీ పడే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమంటే గొప్ప విషయమే. ఎంతో కృషి, పట్టుదల ఉంటే కానీ ఉద్యోగం సాధించడం సాధ్యం కాదు. అయితే, ఇంత టఫ్ కాంపిటీషన్‌లోనూ ఓ మహిళ సత్తా చాటింది. ఒక ఉద్యోగం సాధించడమే గగనం అనుకుంటున్న సమయంలో ఏకంగా రెండు ఉద్యోగాలు సాధించింది.
తెలంగాణ ప్రభుత్వం నిన్న సంక్షేమ గురుకుల డిగ్రీ లెక్చరర్, ఇవాళ జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల చేసింది. డిగ్రీ, జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే, ఈ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన రాసపల్లి జ్యోతి అనే మహిళ ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించింది. డిగ్రీ లెక్చరర్(మ్యాథ్స్), జూనియర్ లెక్చరర్(మ్యాథ్స్) ఉద్యోగాలు సాధించి సత్తా చాటింది. దీంతో ఆ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి చదివిన చదువుకు ఇన్నాళ్లకు ఫలితం దక్కిందని జ్యోతిని అభినందిస్తున్నారు.