CM Revanth: ఆ లక్ష్యాన్ని సాకారం చేయాలి
హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించే ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో శనివారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఫోర్త్ సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించే ప్రణాళికలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన నివాసంలో శనివారం సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీపై రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులతో సమీక్షించారు. ఇందుకు అవసరమైన రోడ్ మ్యాప్‌ను తయారు చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. డ్రాప్ట్ రోడ్ మ్యాప్‌ను పరిశీలించిన సీఎం... కొన్ని సూచనలు చేసి సవరించి ఫైనల్ కాపీని సమర్పించాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగు రోడ్డు నుంచి రీజనల్ రింగు రోడ్డు వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్ మ్యాప్ తయారు చేయాలని నొక్కిచెప్పారు. ఫ్యూచర్ సిటీలో కొన్ని రేడియల్ రోడ్ల అవసరం ఉన్నదని పేర్కొని వాటిని అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
రాజేంద్రనగర్‌లో కొత్తగా నిర్మించబోయే హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రోడ్డు, మెట్రో మార్గాలకు సంబంధించి భూసేకరణ, ఇతర అంశాలపై వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రణాళికలను, రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ తదితరులు హాజరయ్యారు.
యంగ్ ఇండియా స్పోర్ట్ యూనివర్శిటీ ఏర్పాటు :
ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీని నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నది. ప్రస్తుతం హకీంపేట్‌లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లేదా గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్సులను కూడా స్పోర్ట్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు ఏ మేరకు పనికొస్తాయో ఆలోచిస్తున్నది. దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అక్కడి స్పోర్ట్స్ యూనివర్శిటీని పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి బృందం ఆ వెలుగులోనే తెలంగాణలోనూ స్పోర్ట్స్ వర్శిటీని నెలకొల్పాలని నిర్ణయం తీసుకున్నది. ఆ దేశంలో 1976లో ఏర్పడిన స్పోర్ట్స్ యూనివర్శిటీ ప్రపంచంలోనే మొదటిదని సీఎం గుర్తుచేశారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలంపిక్స్ క్రీడల్లో దక్షిణ కొరియా 32 పతకాలను గెల్చుకున్నదని, ఇందులో 16 అక్కడి స్పోర్ట్స్ యూనివర్శిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవేనని సీఎం గుర్తుచేశారు. పారిస్ ఒలంపిక్స్ లో ఆర్చరీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించిన లిమ్ సి-హెయోన్‌ను కొరియా పర్యటన సందర్భంగా అభినందించారు. ఎంతోమంది అథ్లెట్లను తీర్చిదిద్దడానికి కొరియా స్పోర్ట్స్ యూనివర్శిటీ దోహదపడుతున్నదని, తెలంగాణ స్పోర్ట్స్ వర్శిటీ కూడా ఆ లక్ష్యాన్ని సాకారం చేయాలని ఆకాంక్షించారు.
సీఎంతో హడ్కో చైర్మన్ మర్యాదపూర్వక భేటీ :
హౌజింగ్ అండ్ అర్బన్ డెవప్‌మెంట్ కార్పొరేషన్ (హడ్కో) చైర్మన్ సంజయ్ కులక్షేత్ర తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో శనివారం సాయంత్రం కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ముఖ్యమంత్రి ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో హడ్కో చైర్మన్ కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నగర అభివృద్ధికి ప్రపంచబ్యాంకు నుంచి ఆర్థిక సాయాన్ని కోరినట్లు పురపాలక శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల వెల్లడించారు. ఇదే తరహాలో హడ్కో నుంచి కూడా సిటీ డెవలప్‌మెంట్ కోసం రుణాన్ని తీసుకునే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి సమయంలో హడ్కో చైర్మన్ సంజయ్ కులక్షేత్ర, సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం కావడం గమనార్హం.