అది 840 మంది జాగా.. తట్టి అన్నారంలో ల్యాండ్ లో కీలక మలుపు!
ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటూ ఖాస్రా పహాణీ చూడమంటారు.. అక్కడ ఏది ఉంటే అదే ఫైనల్ అని అధికారులు చెబుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎవరైనా భూమి కొనుగోలు చేయాలంటూ ఖాస్రా పహాణీ చూడమంటారు.. అక్కడ ఏది ఉంటే అదే ఫైనల్ అని అధికారులు చెబుతున్నారు. దానినే ఆధారంగా చేసుకొని ధరణి పోర్టల్‌లోనూ ల్యాండ్ క్లాసిఫికేషన్ మార్పు కోసం వేలాది మంది అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ మాత్రం ఖాస్రా పహాణీలో నమోదైన రికార్డులు తప్పంటున్నారు..! 'దిశ' పత్రికలో ఈ నెల 8న రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామంలో జరిగిన మ్యుటేషన్‌పై '84 ఎకరాలకు ఎగనామం. కోర్టు కేసులున్నా పట్టించుకోలేదు' అనే శీర్షికన కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధితులంతా ఒక్కటయ్యారు. తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. సదరు జాగా ప్లాట్లుగా మారి 40 ఏండ్ల అవుతున్నది. వ్యవసాయేతర ఆస్తిగా మారి వందలాది రిజిస్ట్రేషన్లు కనిపిస్తున్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన 840 మంది దగ్గర సేల్ డీడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటినీ పట్టించుకోకుండా ఓ కంపెనీ పేరిట ఎలా రాస్తారని ప్లాట్ల యజమానులు ప్రశ్నిస్తున్నారను. సర్వే నం.108 నుంచి 111 వరకు రెవెన్యూ రికార్డులు అప్ డేట్ చేసేటప్పుడు తమ విజ్ఞప్తిని పరిశీలించాలని రాతపూర్వకంగా తాసిల్దార్‌కు విజ్ఞప్తి చేసినట్టు వారు తెలిపారు. ఈ సర్వే నంబర్లలోని 70.39 ఎకరాల భూమి ఏనాడో సేల్ డీడ్స్ అయిపోయిందని స్పష్టం చేశాం. అయినా బడా కంపెనీల పేరిట రికార్డులను అప్ డేట్ చేయడం వెనుక పెద్ద మతలబే ఉన్నదంటున్నారు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లు చూసినా అప్ డేట్ చేసే సర్వే నంబర్లపైన ప్లాట్లు ఉన్నాయో, వ్యవసాయ భూమో తెలిసిపోతుంది. పెద్దవాళ్ల కోసం తమను ఎందుకు బలి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాపర్టీ విలువ రూ.300 కోట్లు కాదని, రూ.800 కోట్ల వరకు ఉంటుందన్నారు. గజం ధర రూ.40 వేల వరకు పలుకుతుందని, అందుకే దీనిపై పెద్దలు కన్నేశారని ప్లాట్ల యజమానులు అన్నారు.
ఏనాడో అమ్మేశారు
పట్టాదారు మద్ది సత్యనారాయణరెడ్డికి సర్వే నం.108, 109, 110, 111 లో మొత్తం 70.39 ఎకరాల భూమి ఉండేది. ఆయన పట్టాదారు అని ఖాస్రా పహాణీ నుంచి రికార్డుల్లో ఉన్నది. ఆయన, ఆయన సోదరుడు బాల్ రెడ్డి కలిసి 1980 లో ఎమ్వీ రంగాచారికి జీపీఏ చేశారు. 1978 లోనే లే అవుట్ చేసి గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకున్నారు. అప్పట్లో భాగ్యలక్ష్మీ నగర్కాలనీగా పేరు పెట్టారు. జీపీఏ ఇచ్చిన తర్వాత 1981 నుంచి ప్లాట్ల అమ్మకం మొదలు పెట్టారు. ఆ కాలంలోనే రాధాకృష్ణ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ పేరిట 160 ప్లాట్లు చేశారు. 1981లో డాక్యుమెంట్ నం.840 నుంచి 844, 1982 లో డాక్యుమెంట్ నం.631, 664 లతో అమ్మేశారు. జీపీఏ హోల్డర్ 840 ప్లాట్లను అమ్మేశారు. లే అవుట్లలోని పూర్తి ప్లాట్లను అమ్మేశారని కొనుగోలుదారులు చెబుతున్నారు. 2004 వరకు రెవెన్యూ రికార్డుల్లోని కబ్జా కాలమ్ లో ప్లాట్లు అని నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులను మద్ది భాగ్యమ్మ, మద్ది శ్రీకాంత్ రెడ్డి తదితరుల పేరిట మార్చారని చెప్పారు. ఈ ప్లాట్ల యజమానులంతా కలిసి మధురా నగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడ్డారు. అందుకే ఈ భూమి నేచర్ ఆఫ్ ల్యాండ్ ని నాన్ అగ్రికల్చర్, ప్లాట్లుగా రాయాలని మధురానగర్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రామిడి లక్ష్మారెడ్డి గత నెల 18న అబ్దుల్లాపూర్ మెట్ తాసిల్దార్ కు లిఖితపూర్వకంగా కోరారు.
20 ఏండ్లుగా వివాదం
రూ.వంద కోట్ల భూబాగోతంలో ఓ మంత్రి హస్తలాఘవం .. పట్టాదారు కన్నుగప్పి అడ్డగోలు రిజిస్ట్రేషన్లు అంటూ రెండు దశాబ్దాల క్రితమే పత్రికల్లో వచ్చింది. 2002 లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. ఆయన సీఎం అయిన తర్వాత కూడా అనేక ఫిర్యాదులు సమర్పించారు. ఆటోనగర్ డంపింగ్ యార్డు దగ్గరగా ఉండడంతో ప్లాట్ల యజమానులు పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడేమో భూముల ధరలు అమాంతంగా పెరగడంతో మరిన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ప్లాట్లు కొనుగోలు చేసిన వాళ్లలో రిటైర్డ్ న్యాయమూర్తులు, వారి సంబంధీకులు ఉన్నట్లు ప్లాట్ల యజమానులు చెప్పారు. ఎల్బీనగర్ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన ముద్దగోని రామ్మోహన్ గౌడ్, హైదరాబాద్జిల్లాలోని ఓ ఎమ్మెల్యే సోదరుడికి కూడా పెద్ద ఎత్తున ప్లాట్లు ఉన్నాయని సమాచారం.
14న ప్లాట్ల యజమానుల ధర్నా
తట్టిఅన్నారం సర్వే నం.108 నుంచి 111 లోని 70.39 ఎకరాల్లో వెలిసిన లే అవుట్లలోని ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులతో కలిసి ఈ నెల 14న ధర్నా చేయనున్నట్లు మధురానగర్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాగిడి లక్ష్మారెడ్డి 'దిశ'కు చెప్పారు. ధర్నాలో స్థానిక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు. 840 మంది ప్లాట్ల యజమానులు హాజరు కానున్నట్లు చెప్పారు. 40 ఏండ్ల క్రితమే లీగల్ గా స్టాంపు డ్యూటీ కట్టి సేల్ డీడ్స్ చేయించుకున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమ విజ్ఞప్తులను అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గజం ధర రూ.40 వేల వరకు ఉన్నదని, అందుకే దీనిపై ఇద్దరు మాజీ మంత్రులు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ, ఓ మంత్రి తెర వెనుక నడిపిస్తున్నారని ఆరోపించారు.
మేం కొనుగోలు చేశాం:
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టిఅన్నారంలో 84 ఎకరాల భూమిని తాము లీగల్ గా కొనుగోలు చేశామని, అందులో ఎలాంటి అవకతవకలు లేవని అమ్మోదా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పష్టం చేసింది. 'దిశ' దినపత్రికలో ఈ నెల 8న '84 ఎకరాలు ఎగనామం' పేరిట ప్రచురించిన కథనంలో వాస్తవాలు లేవన్నారు. సర్వే నం.90, 91, 94, 101, 108 నుంచి 111 వరకు 84 ఎకరాలను రెండు దశాబ్దాల క్రితమే కొనుగోలు చేసినట్లు వివరించారు. నవాబ్ సూర్యార్ జంగ్ కు సంబంధించిన భూములని, వారికి హైకోర్టు డిక్రీ పాస్ చేసిన తర్వాతే కొనుగోలు చేశామన్నారు. 2009 లోనే అమ్మోదా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట టైటిల్ డీడ్స్ ఇచ్చారన్నారు. అప్పటి వీఆర్వో కె.ప్రతాప్ రెడ్డి, అతని కుటుంబ సభ్యులు డాక్యుమెంట్లను మ్యానిపిలేట్ చేశారని ఆరోపించారు. తాసిల్దార్, ఆర్డీవోలు తమకు అనుకూలంగా ఏనాడో ఆర్డర్లు జారీ చేసినట్లు చెప్పారు. కుత్బుల్లాపూర్ మండలానికి సంబంధించిన పాసు పుస్తకాలను ఇక్కడివిగా సృష్టించినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురిపై సీసీఎస్ లో కేసులు నమోదయ్యాయన్నారు. రెవెన్యూ అధికారులు తమ పేర్లను నమోదు చేయడం చట్టబద్ధమని, అందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని వివరణ ఇచ్చారు. - అమ్మోదా డెవలపర్స్