కరోనా టైంలో ఫేమస్ అయిన సీనియర్ జర్నలిస్ట్ రాహుల్‌కు ప్రభుత్వంలో కీలక పోస్ట్?
సీఎం కేసీఆర్ ఫేవరెట్ జర్నలిస్టుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి రాబోతోందా?
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్ ఫేవరెట్ జర్నలిస్టుకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పదవి రాబోతోందా? సోషల్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతోంది. కరోనా టైమ్ నుంచి సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ల ద్వారా జర్నలిస్టు రాహుల్ బాగా పాపులర్ అయ్యారు. రాహుల్ తన స్నేహితుడు అని స్వయంగా కేసీఆర్ చెప్పుకోవడం నుంచి జర్నలిస్టుగా ఆయన వేసే ప్రశ్నల వరకు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. ఓ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికలో పని చేసే రాహుల్ తాజాగా పదవీ విరమణ పొందారు.
అయితే రిటైర్మెంట్ తీసుకున్న రాహుల్‌కు త్వరలో సీఎం సలహాదారు పదవి దక్కబోతోందనే చర్చ సామాజిక మాధ్యమాల్లో గుప్పుమంటోంది. ఆయన వార్తలు రాసేది ఇంగ్లీష్ పత్రికకే అయినా రాష్ట్రంలోని సమస్యల పట్ల చాలా అవగాహన ఉంది. గతంలో పలు సున్నితమైన అంశాల్లో సీఎం కేసీఆర్‌నే తన ప్రశ్నల ద్వారా ఇరుకున పెట్టిన చాతుర్యం ఆయన సొంతం. దాంతో ఆయనను తన సలహాదారుగా కేసీఆర్ నియమించుకోబోతున్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే మాజీ ఐఏఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్‌కు ప్రధాన సలహాదారుగా ప్రభుత్వం నియమించింది. ఇప్పటికే సీనియర్ జర్నలిస్టు, రచయిత, సాహిత్యకారుడైన టంకశాల అశోక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు. దీంతో అనేక అంశాల్లో విషయ పరిజ్ఞానం కలిగిన రాహుల్‌ను తన సలహాదారుగా నియమించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మరి రాహుల్ కు నిజంగానే కీలక పదవి దక్కబోతోందా లేదా ఇదంతా సోషల్ మీడియా సృష్టియేనా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.