కాళేశ్వరం విచారణలో కీలక పరిణామం.. త్వరలో వారికి పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు

కాళేశ్వరం విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కంటిన్యూ అవుతున్నది.

Update: 2024-07-08 09:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులోని అవకతవకలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతున్నది. సోమవారం కాళేశ్వరం కమిషన్‌కు తన అధ్యయన నివేదికను నిపుణుల కమిటీ సమర్పించింది. అలాగే కాగ్ నివేదిక సైతం కమిషన్ కు అందింది. ఇవాళ కమిషన్ ఎదుట 14 మంది పంప్ హౌస్ ఇంజినీర్లు, పంప్ హౌస్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెల 16 వరకు ఇంజినీర్లు అఫిడవిట్లు సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఇంజినీర్లు సమర్పించే అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం పలువురికి నోటీసులు ఇచ్చే యోచనలో కమిషన్ ఉన్నది.

కాగా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న అవకతవకలు, లోపాలపై విచారణ చేపటడుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో భాగంగా అనుబంధ అంశాలుగా పంప్ హౌస్ ల ను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నది. బ్యారేజీలతో పాటు పంప్ హౌస్ లపై కూడా ఎంక్వైరీ చేయాలని పలువురు కమిషన్ కు ఫిర్యాదు చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు లింక్-1 ప్యాకేజీలో జరిగిన పంప్ హౌస్ ల నిర్మాణంలో భాగస్వామ్యం అయిన అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులు ఇవాళ విచారణకు రావాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. దీంతో వారంతా నేడు కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు.

Tags:    

Similar News