ముంబై క్రైమ్ బ్రాంచ్​ పోలీసుల పేరిట ఫేక్ కాల్స్ చేస్తున్న సైబర్ క్రిమినల్స్

ముంబై క్రైం బ్రాంచ్​ పోలీసుల పేర పలువురిని బెదిరిస్తున్న సైబర్ క్రిమినల్స్​లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు.

Update: 2024-03-24 17:12 GMT

దిశ తెలంగాణ క్రైం బ్యూరో: ముంబై క్రైం బ్రాంచ్​ పోలీసుల పేర పలువురిని బెదిరిస్తున్న సైబర్ క్రిమినల్స్​లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. తాజాగా హైదరాబాద్​కు చెందిన ఓ ఐఐటీ పీహెచ్డీ స్కాలర్​ను బెదరగొట్టి 30 లక్షల రూపాయలను కొల్లగొట్టారు. ఇలాంటి ఫోన్​కాల్స్​పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్​వేదికగా సూచించారు. పోలీసులమంటూ ఎవరైనా ఫోన్​చేస్తే భయపడకుండా వెంటనే 1930 నెంబర్​కు ఫోన్​చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

కొరియర్​ ఫ్రాడ్స్..

ఐఐటీ పీహెచ్డీ స్కాలర్​కు కొన్ని రోజుల క్రితం అగంతకుని నుంచి ఫోన్​కాల్​వచ్చింది. ఫోన్​చేసిన వ్యక్తి తాను ముంబై క్రైమ్ బ్రాంచ్​నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత ఫెడెక్స్​లో మీ పేర ఓ పార్సిల్ ​బుక్​అయ్యింది, దాంట్లో నకిలీ పాస్​పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. దాంతోపాటు ఉగ్రవాద మాస్టర్​మైండ్ మహ్మద్​తో మీకు పలు బ్యాంకుల్లో జాయింట్ ​అకౌంట్లు ఉన్నట్టుగా తమ విచారణలో తేలిందన్నాడు. అనంతరం నకిలీ ఐడీ కార్డులు, ఎఫ్ఐఆర్ ​కాపీలు పంపించి బాధితున్ని పూర్తిగా నమ్మించిన సదరు వ్యక్తి మీకు స్లీపర్​ సెల్స్​ నుంచి ప్రాణహాని ఉందంటూ బెదరగొట్టాడు. హౌస్​ అరెస్ట్​ చేస్తున్నామంటూ ఆరు రోజుల పాటు బాధితుడు ఇంటి నుంచి బయటకు రాకుండా చేశారు.

తనకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పినా మా దగ్గర పక్కాగా ఆధారాలు ఉన్నాయని భయపెట్టాడు. ఆ తర్వాత ఎలాంటి కేసులు ఉండవద్దంటే బాధితుని కుటుంబ సభ్యులు పొదుపు చేసుకున్న 31 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. విచారణ జరిపి లావాదేవీల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని తేలితే డబ్బు వాపస్ చేస్తామని చెప్పి మరీ మోసానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా విషయాన్ని గ్రహించిన బాధితుడు ఈ మేరకు సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ తర్వాత బాధితుడు వ్యక్తిగతంగా తనను కలిసి జరిగిన మోసం గురించి చెప్పినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తెలిపారు. ఉన్నత విద్యావంతులు సైతం ఇలాంటి మోసాలకు గురి కావటం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అజ్ఞాత వ్యక్తుల నుంచి డ్రగ్​పార్సిళ్ల పేరుతో ఫోన్​కాల్స్​వస్తే వాటికి స్పందించ వద్దన్నారు. వెంటనే 1930 నెంబర్​కు లేదా స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయాలన్నారు. తప్పితే డబ్బులు వారు చెప్పిన అకౌంట్లలోకి బదిలీ చేయవద్దన్నారు.


Similar News