కాలగర్భంలోకి కలెక్టరేట్.. ఇక చెదరని జ్ఞాపకంగానే..
దశాబ్దాల పాటు పాలమూరు తలమానికంగా ఉన్న పాత కలెక్టరేట్ భవనం ఎట్టకేలకు నేలమట్టం అయ్యింది.
దశాబ్దాల పాటు పాలమూరు తలమానికంగా ఉన్న పాత కలెక్టరేట్ భవనం ఎట్టకేలకు నేలమట్టం అయ్యింది. దాదాపుగా ఎనిమిదిన్నర దశాబ్దాలపాటు ఉమ్మడి జిల్లాకు సేవలు అందించడంతోపాటు జిల్లాకే వన్నె తెచ్చేలా వెలుగొందింది. ఈ భవనం నేలమట్టం కావడంతో పాలమూరు జిల్లా ప్రజల మదిలో చెదరని జ్ఞాపకంగా మిగిలిపోనుంది. నిజాం ప్రభుత్వ కాలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రారంభమైంది.
1936వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చింది. 1948వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చింది. కలెక్టరేట్ వ్యవస్థ రూపొందిన తర్వాత ఈ భవనం పరిపాలన సౌలభ్యం కోసం పూర్తిస్థాయిలో కలెక్టరేట్ భవనంగా మార్చారు. అప్పటినుంచి ఉమ్మడి జిల్ల ప్రజల సమస్యలను తీర్చే కల్పతరువుగా వెలుగొందింది. ప్రస్తుతం ఆ స్థలంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాతభవనాన్ని పూర్తిగా కూల్చి వేశారు. - దిశ బ్యూరో, మహబూబ్ నగర్
దిశ బ్యూరో, మహబూబ్ నగర్ : నిజాం ప్రభుత్వ కాలంలో కలెక్టరేట్ భవన నిర్మాణం ప్రారంభమైంది. 1936వ సంవత్సరం నుంచి జిల్లా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చింది. మొదట్లో భూములు, సివిల్ సప్లై, రెవెన్యూ, సైన్యం వంటి విభాగాలు తదితరాల కోసం ఏర్పాటైన ఈ భవనం నుంచి జిల్లాకు పరిపాలన సంబంధమైన సేవలు అందేవి. 1948వ సంవత్సరంలో నిజాం ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో విలీనం కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రజాస్వామ్య వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
కలెక్టరేట్ వ్యవస్థ రూపొందిన తర్వాత ఈ భవనం పరిపాలన సౌలభ్యం కోసం పూర్తిస్థాయిలో కలెక్టరేట్ భవనంగా మార్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది కలెక్టర్లు.. అధికారులతో పాలనను సాగించడానికి ఉపయోగపడడంతో పాటు అవసరాల కోసం, సమస్యల పరిష్కారం కోసం వచ్చే వారితో సెలవు రోజులు తప్ప మిగిలిన అన్ని రోజుల్లో సందర్శకులతో కిటకిటలాడుతుండేది. కలెక్టరేట్ అనేది ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ప్రాధాన్యత ఉన్న నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు ఉంది.
నిజాంకాలంలో ప్రస్తుతం పాలమూరులో ఉన్న తహశీల్దార్ కార్యాలయం, బాలుర జూనియర్ కళాశాల, డీఈఓ కార్యాలయం, ఆర్ అండ్ బీ కార్యాలయాలతో పాటు మరెన్నో భవనాలు నిర్మాణమైనప్పటికీ కలెక్టరేట్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు నేరుగా కలెక్టరేట్ భవనానికి చేరుకునే విధంగా రోడ్డు, రైలు మార్గాలు ఉండడంతో ఎంతోమంది ప్రజలు అక్కడికి వచ్చి తమ సమస్యలను పరిష్కరించుకునే వారు. ఆ భవనంలోకి అడిగితే ప్రతి ఒక్కరికి చెప్పలేని అనుభూతి కలిగేది.
ఎన్నో ఆందోళనలు.. ఉద్యమాలకు నెలవు...
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుంటే ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళనలు చేయడం పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా సందడి సందడిగా ఉండేది. తెలంగాణ ఉద్యమ సమయంలో ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి చివరకు అక్కడికి చేరుకుని అధికారులకు వినతి పత్రాలు అందజేసి సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం వంటి అంశాలు ఆ ప్రాంతాన్ని మారుమోగించేవి.
కొత్త భవనం నిర్మాణంతో
జిల్లాల విభజన జరిగిన తర్వాత ఈ భవనం సమీపంలో ఉన్న ఇతర భవనాలు కలెక్టరేట్‌లోని కొన్ని భవనాలు దెబ్బతిన్న కారణంగా కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. కొత్తగా నిర్మాణమైన భవనాన్ని మూడు నెలల కింద సీఎం కేసీఆర్ ప్రారంభించారు. దీంతో కలెక్టరేట్‌లో ఉన్న పరిపాలన విభాగాలు అన్ని కొత్త భవనానికి చేరాయి. దీంతో ఎనిమిదిన్నర దశాబ్దాలపాటు కళకళలాడుతూ ఉన్న కలెక్టరేట్ భవనం ఒక్కసారిగా వెలవెల పోయింది.
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం..
దశాబ్దాలపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు సేవలు అందించిన పాత కలెక్టరేట్ భవనం స్థానంలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలకు సైతం ఉపయోగపడేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాత కలెక్టరేట్ భవనాన్ని కొన్ని రోజుల నుంచి కూల్చి వేస్తున్నారు. బుధవారం ప్రధాన భవనాలు అన్ని నేలమట్టం అయ్యాయి అన్న విషయం తెలియగానే.. జిల్లా ప్రజలు, స్థానికులు అయ్యో అంటూ ఒకింత బాధను వ్యక్తపరిచారు.