కాంగ్రెస్ తెచ్చిన "మార్పు" ఇదేనా? హరీష్ రావు, కేటీఆర్ ఆసక్తకర ట్వీట్

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత వాతవారణం చోటుచేసుకుంది.

Update: 2024-07-15 11:05 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ఖిల్లా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత వాతవారణం చోటుచేసుకుంది. ప్రభుత్వం పంపిణీ చేసే ఖిల్లా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీకి కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇంచార్జీ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రావడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తప్పుబట్టారు. అతనికి ప్రోటోకాల్ లేదని, వేదికపైకి ఎలా పిలుస్తారని సబితా ఇంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. అలా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలసి నేల బైఠాయించి.. నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె స్టేజ్ కింద కూర్చున్నారు. ఆందోళన కొనసాగిన అనంతరం అధికారులు, నేతలు బోనాల పండుగ చెక్కులను పంపిణీ చేశారు.

కాంగ్రెస్ తెచ్చిన "మార్పు" ఇదేనా? : కేటీఆర్

ఈ ఘటనపై బీఆర్ఎస్ నేతలు, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ‘అఫీషియల్ ప్రోగ్రాంలో ఓడిపోయిన అభ్యర్థులకు పని ఏంటి? ఓడిపోయిన అభ్యర్థులు స్టేజ్ పైన ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యే స్టేజ్ కింద. ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ?ఇదేనా ప్రజా పాలన’ అని కేటీఆర్ ప్రశ్నించారు.

మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా?: హరీష్ రావు

మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా? అని హరీష్ రావు ప్రశ్నించారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి? అని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కనీస చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ వెంటనే స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News