బీఆర్ఎస్ సర్కార్‌లో 88 వేల మంది రైతులు మృతి: Revanth Reddy
కేసీఆర్ సీఎం అయిన తర్వాత 88 వేల మంది రైతులు చనిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సీఎం అయిన తర్వాత 88 వేల మంది రైతులు చనిపోయారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అప్పులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని స్పష్టం చేశారు. వరి వేస్తే ఉరే అని చెప్పిన దుర్మార్గుడు కేసీఆర్ అని విమర్శించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయన్న కేసీఆర్.. రైతులు, పేదల సంక్షేమాన్ని మరిచారని మండిపడ్డారు. దళితులకు మూడెకరాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు అని ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు. దళితులకు భూములు పంచింది, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తు చేశారు. రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారన్నారు.
కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదించుకున్నదని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ పదివేల ఎకరాల భూములు ఆక్రమించడమే కాకుండా.. ప్రశ్నించిన వారిపైకి పోలీసులను పంపుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. పావలా వడ్డీ, బంగారు తల్లి పథకాలను అటకెక్కించారాని ఎద్దేవా చేశారు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చి.. రూ.4వేలు పెన్షన్ ఇచ్చి తీరుతామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ, రూ.500 లకే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు సాయం అందిస్తామని తెలిపారు.