చేరికలపై బీజేపీ ప్లాన్.. 60 మంది కమలం గూటికి..
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ
దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు విచ్చేయనున్నారు. వారి రాక సందర్భంగా హైకమాండ్‌కు మంచి గిఫ్ట్ ఇచ్చేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. పలు పార్టీలకు చెందిన దాదాపు 60 మంది కీలక నేతలను టార్గెట్‌గా పెట్టుకుంది. అమిత్‌షా, నడ్డా రాక సందర్భంగా వారిని పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తోంది. ఈ లిస్ట్‌లో అధికార పార్టీతో పాటు కాంగ్రెస్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి వరంగల్‌తో పాటు, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మహబూబ్‌నగర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన కీలక నేతలు కాషాయ తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాలో గెలుపు జోష్‌లో ఉన్న బీజేపీ తెలంగాణలోనూ జెండా పాతేందుకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం పావులు కదుపుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. శనివారం ముఖ్యమంత్రి తన ఫాం హౌజ్‌లో మంత్రులతో సమావేశం కావడంతో బీజేపీ మరింత అలర్ట్ అయింది. ఈ సమయంలోనే టీఆర్ఎస్కు గట్టి షాకిచ్చేందుకు కమలనాథులు రెడీ అవుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నేతలు బాహాటంగానే పలుమార్లు ప్రకటించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి తరుణ్చుగ్సైతం దాదాపు 24 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నట్లు మీడియా ఎదుట వెల్లడించిన విషయం తెలిసిందే. బీజేపీ లిస్ట్‌లో ఉన్న ఈ 60 మంది నేతలు కూడా కచ్చితంగా కాషాయ తీర్థం పుచ్చుకుంటారనే నమ్మకం ఏర్పడటంతోనే బీజేపీ శ్రేణులు అంత ధీమాగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం.
ఈనెల చివరిలో లేదా వచ్చే నెల మొదటివారంలో జనగామలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తున్నారు. ఆయన సమక్షంలో ఈ లిస్ట్‌లో ఉన్న కొందరు కీలక నేతలను చేర్చుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. అలాగే ఏప్రిల్ 14వ తేదీన బండి సంజయ్ చేపడుతున్న రెండో విడుత ప్రజా సంగ్రామ యాత్రకు అమిత్‌షా రాక సందర్భంగా ఇంకొందరు నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు బీజేపీలోకి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలోనే ఈ అంశంపై పూర్తిస్థాయి క్లారిటీ రానుంది. ఇరువురు జాతీయ స్థాయి నేతల పర్యటనలు ఖరారు కావడమే ఆలస్యం చేరికలకు బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ చేరికలతో టీఆర్ఎస్కు గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తోంది.