‘60 లక్షల ఓటర్లున్న ముదిరాజ్‌లకు ఒక్క సీటు ఇవ్వరా..?’

ముదిరాజ్‌లకు రాష్ట్రంలో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించకపోవడం దారుణమని నీలం మధు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2023-08-22 07:56 GMT

దిశ బ్యూరో, సంగారెడ్డి : రాష్ట్రంలో 60 లక్షల ముదిరాజ్ ఓటర్లు ఉన్నారని పలు సందర్భాల్లో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభల్లో అన్నారని, అంతమంది ఓటర్లున్న ముదిరాజ్‌లకు రాష్ట్రంలో కనీసం ఒక్క అసెంబ్లీ సీటు కేటాయించకపోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, హరీష్ రావులపై ఎంతో నమ్మకం పెట్టుకున్నామని, పటాన్ చెరు టికెట్ ముదిరాజ్ సామాజిక వర్గానికి కేటాయిస్తారనకుంటే నిరాశే మిగిలిందన్నారు.

నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్న తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధగా ఉన్నదని, పటాన్ చెరు టికెట్ పై సీఎం కేసీఆర్ పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇతర సామాజిక వర్గాలను స్థానం కల్పించిన సీఎం కేసీఆర్ ముదిరాజ్ సామాజిక వర్గం ఏం పాపం చేసిందని పక్కన పెట్టారన్నారు. అవసరమైతే ప్రత్యేక సిబ్బందిని పెట్టి సర్వేలు జరిపించాలని ఆ తరువాతే ముదిరాజ్ లకు సీటు కేటాయించాలని కోరారు. పటాన్ చెరు అభ్యర్థిత్వం విషయంలో సీఎం మరోసారి ఆలోచించాలని నీలం మధు కోరారు. లేదంటే తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పటాన్ చెరు మండలం చిట్కుల్ లో తనను కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులు, ముదిరాజ్ సామాజిక వర్గం నాయకులతో నీలం మధు మాట్లాడారు. కొంత సమయం ఇద్దామని, అప్పటి వరకు వేచి చూద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు.

Tags:    

Similar News