సమీకృత పాఠశాలలకు 20 ఎకరాల భూమిని కేటాయిస్తాం : స్పీకర్

మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యా బోధన చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు.

Update: 2024-09-05 14:31 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని విద్యా బోధన చేయాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 39 మంది ఉపాధ్యాయులకు శాలువా, మెమోంటో, ప్రశంస పత్రాలతో శాసనమండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, పరిగి, తాండూర్, చేవెళ్ల శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవిలతో కలిసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లు విద్యా ప్రాముఖ్యతను గుర్తించి ఎన్నో అద్భుతాలను సృష్టించారన్నారు. ఆ మహానీయులను స్మరించుకుంటూ విద్య పట్ల ఆసక్తిని పెంచాలని సభాపతి తెలిపారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అనే నానుడి ఉంది అంటే ఉపాధ్యాయుల పట్ల సమాజంలో ఎంత గౌరవం ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఏ దేశ భవిష్యత్తు అయిన తరగతి గదుల్లోనే ప్రారంభమవుతుందని, సమాజానికి ఉపయోగపడే గురువుకు మన సమాజంలో ఎంతో గుర్తింపు ఉంటుందని, జీవితాలను మలుపుతిప్పే శక్తి గురువులకే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మనకు విద్యాబోధనలు అందించి, మన ఎదుగుదలకు కారకులైన గురువులను స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ, తను చదువుకున్న రోజుల్లోనీ జోసెఫ్, లెక్కల మాస్టారును స్పీకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

పాఠశాల స్థాయి నుండి విద్యా బుద్ధులను నేర్పించి ఆర్థికంగా, రాజకీయంగా, ఉన్నత స్థాయి ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 26 వేల పాఠశాలల్లో 20 లక్షల మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని, ఇందులో ఎక్కువగా పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలు చదువుకుంటారని ఆయన తెలిపారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్లో రూ.21 వేల కోట్ల నిధులను కేటాయించినట్లు స్పీకర్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ పరిధిలో 20 ఎకరాలకు స్థలానికి తగ్గకుండా భూములను ఎంపిక చేసి సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని ఆయన అన్నారు. ప్రైవేటు రంగాలకు ధీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అన్ని విధాల మౌలిక సదుపాయాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం విద్య, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తూ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి దిశగా తీసుకు వెళ్లేందుకు త్రిసభ్య విద్యా కమిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో వికారాబాద్ ఆర్డీవో వాసు చంద్ర, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Similar News