BREAKING: తెలంగాణ రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2 లక్షల రుణమాఫీ గైడ్ లైన్స్ రిలీజ్
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీలో కీలక ముందడుగు పడింది. రూ.2 లక్షల రుణమాఫీకి కసరత్తు
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. రూ.2 లక్షల రుణమాఫీకి కసరత్తు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి సర్కార్.. తాజాగా రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ సోమవారం రుణమాఫీ ఉత్తర్వులను జారీ చేసింది. 12 డిసెంబర్ 2018 నుండి డిసెంబర్ 9, 2023 వరకు తీసుకున్న అన్ని రకాల పంటలకు రుణమాఫీ చేయనున్నట్లు కటాఫ్ డేట్ ఫిక్స్ చేసింది. 2023 డిసెంబర్ 9 నాటికి అసలు, వడ్డీ కలిపి రూ.2లక్షల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార భద్రత కార్డు ( రేషన్ కార్డు) ప్రామాణికంగా తెలంగాణలో భూమి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.2 లక్షలు మాఫీ చేస్తామని తెలిపింది. బ్యాంకులు, పీఏసీఎస్ నుండి తీసుకున్న పంట రుణాలకు మాఫీ వర్తిస్తుందని, రుణమాఫీ డబ్బులను నేరుగా రైతుల ఖాతాలకే జమ చేయన్నుట్లు వెల్లడించింది. ఎస్‌హెచ్‌జే, జేఎల్‌జే, ఎల్ఈసీఎస్ రుణాలతో పాటు రీషెడ్యూల్ చేసిన లోన్స్‌కు మాఫీ వర్తిందని ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఆరోహణ క్రమంలో (తక్కువ నుండి ఎక్కువ) విధానంలో రుణమాఫీ ప్రాసెస్ చేస్తామని పేర్కొంది. రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చేందుకు ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని.. వివరాల కోసం వెబ్ పోర్టల్, మండల సహయ కేంద్రాలను సంప్రదించవచ్చని రైతులకు సూచించారు. రైతుల సమస్యలను 30 రోజుల్లో పరిష్కారించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. రైతులకు ఇచ్చిన మేరకు రుణమాఫీకి కసరత్తు స్టార్ట్ చేసింది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల చివరి నుండి రుణమాఫీ ప్రాసెస్ మొదలుపెట్టి ఆగస్ట్ 15 నాటికి ఫినిష్ చేయనున్నట్లు టాక్.