ఎటూ తేలని ఎంవీ ట్యాక్స్ రద్దు !

దిశ, న్యూస్‌బ్యూరో: గడిచిన, ప్రస్తుతం నడుస్తున్న రెండు త్రైమాసికాల మోటార్ వెహికిల్ (ఎంవీ) పన్ను రద్దు అంశంపై తెలంగాణ రవాణాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. రద్దు అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉండడంతో శాఖమంత్రి , ఉన్నతాధికారుల పరిధిలో ఉన్నంత మేరకు పన్ను చెల్లింపు తేదీలను వరుసగా పొడిగిస్తూ ప్రైవేటు కమర్షియల్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు ఊరట కలిగిస్తోంది. నిజానికి జూన్ 31వ తేదీన సీసీ బస్సులు, మ్యాక్సీ క్యాబుల యజమానులతో జరిగిన చర్చల్లో రవాణా మంత్రి అజయ్ […]

Update: 2020-07-09 11:04 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: గడిచిన, ప్రస్తుతం నడుస్తున్న రెండు త్రైమాసికాల మోటార్ వెహికిల్ (ఎంవీ) పన్ను రద్దు అంశంపై తెలంగాణ రవాణాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. రద్దు అంశం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో ఉండడంతో శాఖమంత్రి , ఉన్నతాధికారుల పరిధిలో ఉన్నంత మేరకు పన్ను చెల్లింపు తేదీలను వరుసగా పొడిగిస్తూ ప్రైవేటు కమర్షియల్ ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు ఊరట కలిగిస్తోంది. నిజానికి జూన్ 31వ తేదీన సీసీ బస్సులు, మ్యాక్సీ క్యాబుల యజమానులతో జరిగిన చర్చల్లో రవాణా మంత్రి అజయ్ కుమార్ త్రైమాసిక పన్ను రద్దుపై వాహన యజమానులకు హామీ ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్‌లో మళ్లీ లాక్ డౌన్ విధించడంపై మరో రెండు రోజుల్లో క్యాబినెట్ ఉంటుందనుకొని, క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి వారికి మాటిచ్చారు. దీంతో జూన్ క్వార్టర్ పన్ను చెల్లింపు తేదీని వారం పాటు అంటే జూలై 7వ తేదీ దాకా పొడిగిస్తూ అప్పట్లో రవాణాశాఖ ఉత్తర్వులిచ్చింది. అయితే క్యాబినెట్ సమావేశం జరగలేదు.పన్నురద్దు అంశం సీఎం దృష్టికి వెళ్లలేదు. దీంతో ఏమి చేయాలో పాలుపోని శాఖ పన్ను చెల్లింపు తేదీని మళ్లీ ఏకంగా జూలై 31 దాకా పొడిగిస్తూ ఈనెల 6వ తేదీన ఉత్తర్వులిచ్చింది. ఇలా పొడిగింపులు చేసుకుంటూ వెళ్లడమే తప్ప పన్నురద్దుపై నిర్ణయం తీసుకోలేమని అధికారులు చెబుతున్నారు. పన్ను వసూళ్లకు సంబంధించిన అంశం అయినందున సీఎందే ఫైనల్ నిర్ణయమని వారు చెబుతున్నారు.

సాధారణంగా వాణిజ్య ప్యాసింజర్, సరుకు రవాణా వాహనాలు ఏ కారణంతో అయినా కొంతకాలం పాటు తిరగలేకపోతే ప్రభుత్వం వాటిని సరెండర్ చేసుకొని అంతకాలానికి పన్ను రద్దు చేస్తుంది. రాష్ట్రంలో మార్చి 22నుంచి కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాతి రోజు లాక్‌డౌన్ అమల్లోకి వచ్చాయి. దీంతో వాణిజ్య ప్రజా, సరుకు రవాణా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అనంతరం లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా వాహనాలకు అనుమతిచ్చినప్పటికీ తమకు వ్యాపారం లేదని వాహనదారులు పన్ను రద్దుకు డిమాండ్ చేశారు. అంతకుముందే జూన్ త్రైమాసికానికి అడ్వాన్స్ డ్ ఎంవీ ట్యాక్స్ చెల్లించాల్సిన గడువును లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాత నెల రోజుల దాకా పొడిగిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ గడువును అప్పటి నుంచి ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తున్నారు. అయితే పన్ను రద్దుకు మాత్రం శాఖ ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు. దీంతో వాహనదారులు పన్ను రద్దు డిమాండ్‌తో పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టడంతో దిగివచ్చి వారితో చర్చలు జరిపిన రవాణా అధికారులు జూన్, సెప్టెంబర్ రెండు త్రైమాసికాల రద్దుకు హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రతి నెల కనీసం రూ.120 కోట్ల దాకా త్రైమాసిక పన్ను వసూలవుతోంది. సరుకు రవాణాకు వినియోగించే లారీలు, మీడియం, లైట్ గూడ్స్ వాహనాలదే దీంట్లో ప్రధాన వాటాగా ఉంటుంది. సరుకు రవాణా వాహనాలపై ప్యాసింజర్ వాహనాల మీద ఉన్నంత కరోనా ప్రభావం లేకపోవడంతో వాటి యజమానుల్లో 80శాతం మంది త్రైమాసిక ఎంవీ పన్ను చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే త్రైమాసిక పన్నులో మిగిలిన ప్రధానవాటా మ్యాక్సీ క్యాబులు, సీసీ బస్సులది. వీటి యజమానుల్లో చాలా మంది వ్యాపారం లేక పన్ను చెల్లించలేదు. సరుకు రవాణా వాహనాలలాగా తమకు వ్యాపారం లేదని, కరోనా కారణంగా ప్రజలు ఆధ్యాత్మిక, విహార యాత్రలు, శుభకార్యాలు అన్నీ వాయిదా వేసుకుంటున్నారని తమకు ఊరట కలిగించడానికి పన్ను రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేశారు. వీరిలో ఎక్కువ మంది పన్ను చెల్లించకపోవడంతో ప్రభుత్వానికి జూన్ త్రైమాసికంలో కేవలం రూ.62 కోట్లు మాత్రమే ఎంవీ పన్ను వసూలైంది. అయితే పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న వీరంతా జూన్ త్రైమాసికంలో వాహనాలను సరెండర్ చేయకపోవడంతో ఈ అంశంపై ఏం చేయాలో తెలియక రవాణాశాఖ అధికారులు ఎక్కడలేని పాట్లు పడుతున్నారు.

Tags:    

Similar News