స్కూళ్లు బంద్, పరీక్షలు యధాతథం

దిశ, న్యూస్ బ్యూరో రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా నివారించే ఉద్దేశంతో ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్ణయించిన పదవ తరగతి లాంటి బోర్డు పరీక్షలు యధాతథంగా జరుగుతాయని, ఇందుకు తగిన ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొనింది. రెండు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగిన అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ […]

Update: 2020-03-14 11:23 GMT

దిశ, న్యూస్ బ్యూరో
రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా నివారించే ఉద్దేశంతో ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నిర్ణయించిన పదవ తరగతి లాంటి బోర్డు పరీక్షలు యధాతథంగా జరుగుతాయని, ఇందుకు తగిన ముందుజాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటున్నట్లు ప్రభుత్వం పేర్కొనింది. రెండు గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగిన అనంతరం ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. కేబినెట్ ఆమోదించిన నిర్ణయాలు శనివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తున్నాయని, ఉల్లంఘించినవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఎం హెచ్చరించారు. విద్యాసంస్థలతో పాటు కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపుల్లాంటివి కూడా మూతబడతాయని తెలిపారు. ప్రభుత్వం తొలి విడతగా ఈ చర్యల కోసం రూ. 500 కోట్లను సిద్ధంగా ఉంచిందని తెలిపారు.

సినిమాహాళ్ళు అన్నీ మూతబడతాయని స్పష్టం చేశారు. షాపింగ్ మాల్స్‌ను కూడా మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయిగానీ అలాంటి నిర్ణయం తీసుకోలేదని, అవి తెరిచే ఉంటాయని, ప్రజల నిత్యావసర వస్తువుల కొనుగోళ్ళు యధావిధిగా ఉంటాయని అన్నారు. మార్చి 31 తర్వాత మ్యారేజీ హాళ్ళు కూడా బుక్ చేయవద్దని, ఇప్పటికే రిజర్వు అయిన విధంగా ఆయా మ్యారేజీ హాళ్లలో పెళ్ళిళ్ళు జరుగుతాయని, అయితే బంధువుల సంఖ్యను వీలైనంతగా తగ్గించుకోవాలని సూచించారు. పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తరఫున వంద మంది చొప్పున మాత్రమే బంధువులు వచ్చేలా వారే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సరుకుల కొనుగోళ్ళ కోసం మార్కెట్‌కు వెళ్ళేవారు వీలైనంత తొందరగా పని ముగించుకుని ఇంటికి చేరుకోవడం మంచిదని సూచించారు.

కరోనా వ్యాధి రాష్ట్రంలో భయాందోళన చెందేంతగా లేదని, కానీ ముందుజాగ్రత్త చర్యగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందన్నారు. బస్సులు, రైళ్ళు, మెట్రో రైళ్ళలో ప్రయాణాలు యధావిధిగా చేసుకోవచ్చునని, అయితే నిర్వాహకులు ఎప్పటికప్పుడు శుభ్రతా చర్యలు చేపడతారని తెలిపారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచారాన్ని తగ్గించుకోవాల్సిందగా సూచిస్తూనే ఎగ్జిబిషన్లు, ర్యాలీలు, ట్రేడ్ ఫెయిర్‌లు లాంటివాటన్నింటిపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. కరోనా వ్యాధి ప్రబలకుండా రెండు దశల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆ ప్రకారం శనివారం అర్ధరాత్రి నుంచి మార్చి 31వ తేదీ వరకు అమల్లోకి వచ్చే కొన్ని అంశాలు :
• ఈ రాత్రి నుంచి మార్చి 31 వరకు ప్రైమరీ పాఠశాల నుంచి నుంచి యూనివర్శిటీ వరకు అన్ని రకాల విద్యాసంస్థలు సెలవులు. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
• కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు కూడా మూసేయాలి.
• బోర్డు పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. షెడ్యూలు ప్రకారమే కొనసాగుతాయి. వ్యాధి నివారణ కోసం ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుటుంది.
• ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్ళలో, రెసిడెన్షియల్ స్కూళ్ళలో పరీక్షల కోసం ఉండే పేద విద్యార్థులు కోసం హాస్టల్ వసతి కొనసాగుతుంది. పరీక్షలయ్యే వరకు వారు ఉండొచ్చు. ఈ సమయంలో ప్రత్యేకమైన శానిటరీ చర్యలను హాస్టల్ నిర్వాహకులు తీసుకుంటారు.
• మ్యారేజ్ హాల్స్ మూసేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఖరారైన ముహూర్తాలకు ఇబ్బంది లేదు. 200 మందికి మించకుండా బంధువులతో చేసుకుంటే మంచిది. వారి జాగ్రత్త దృష్ట్యా చెప్తున్నాం. పరిమిత సంఖ్యలోనే చేసుకోవాలని సూచిస్తున్నాం.
• పోలీసులు మ్యారేజ్ హాల్స్ విషయంలో పర్యవేక్షణ చేపట్టాలి. మార్చి 31 తర్వాత జరిగే పెళ్ళిళ్ళకు హాల్స్ బుక్ చేయవద్దు.
• బహిరంగసభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్ షాపులు, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్లు, ట్రేడ్ ఫేర్, కల్చరల్ ఈవెంట్స్‌కు అనుమతులు ఉండవు.
• ఇండోర్, ఔట్ డోర్ స్పోర్ట్స్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్స్, జిమ్, జూ పార్కులు, అమ్యూజ్‌మెంట్ పార్కులు, మ్యూజియంలు మూసివేయబడతాయి. తెరిస్తే కఠిన చర్యలుంటాయి.
• స్పోర్ట్స్ ఈవెంట్స్ అన్నీ రద్దు.
• ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ళు యధాతథంగా నడుస్తాయి. వీటిలో నిరంతరం శానిటషన్ పనులు జరుగుతాయి. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం.
• బార్లు, క్లబ్బులు, పబ్బులు, మెంబర్‌షిప్ క్లబ్బులు, నిజాం క్లబ్ లాంటివన్నీ మూసేయాలి.

కరోనా వ్యాధి నివారణ, నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని రకాలుగా సర్వ సన్నద్ధంగా ఉందని, ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, కేబినెట్ నిర్ణయం మేరకు రూ. 500 కోట్లు మంజూరు చేస్తున్నామని సీఎం తెలిపారు. విదేశాల నుంచి వస్తున్న వ్యాధి కాబట్టి విమానాశ్రయంలో అలెర్టుగా ఉన్నామని, తెలంగాణకు తీరప్రాంతం లేనందువల్ల పెద్దగా భయపడాల్సిందేమీ లేదని ప్రజలకు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాలకు అంటుకునే అవకాశం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1020 ఐసొలేషన్ బెడ్స్ సిద్ధం చేశామని, 321 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్ కూడా రెడీగా ఉన్నాయని తెలిపారు. 240 వెంటిలేటర్స్ కూడా సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రంలో క్వారంటైన్ సౌకర్యాలతో నాలుగు కేంద్రాలను నెలకొల్పినట్లు వివరించారు.

వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఫారెస్టు, పోలీసు శాఖలతో టాస్క్ ఫోర్సును ఏర్పాటుచేశామని, ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Tags:    

Similar News