తెలంగాణ పోలీసుల హెచ్చరిక.. అలా చేశారో జైలుకే..
దిశ, క్రైమ్ బ్యూరో : సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో గతేడాది మాదిరిగానే ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టుగా ఓ జీవోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిని నగర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన శ్రీపతి సంజీవ్ కుమార్(48).. 1993లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేయడంతో బంజారాహిల్స్ […]
దిశ, క్రైమ్ బ్యూరో : సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నజర్ వేశారు. రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో గతేడాది మాదిరిగానే ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటిస్తున్నట్టుగా ఓ జీవోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తిని నగర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నెల్లూరు పట్టణానికి చెందిన శ్రీపతి సంజీవ్ కుమార్(48).. 1993లో హైదరాబాద్ నగరానికి వచ్చాడు. చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తి చేయడంతో బంజారాహిల్స్ కార్వీ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు.
కరోనా నేపథ్యంలో గతేడాది లాక్ డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరుతో విడుదలైన జీవో నెంబరు 45ను తన లాప్ టాప్ నుంచి డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఈ జీవోను 2021లో విడుదల చేసినట్టుగా ఈ నెల 1వ తేదీన మార్ఫింగ్ చేసి, వాట్సాప్ ద్వారా అనేక గ్రూపులలో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించబోతున్నట్టుగా వార్త వైరల్ అయ్యింది. మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న జీవో తప్పుడు జీవో కావడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుని సీసీఎస్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
కేసు దర్యాప్తును సంయుక్తంగా చేపట్టిన సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ తరహా ఫేక్ వార్తలు ఏ గ్రూపు నుంచి ఏ గ్రూపునకు వస్తున్నాయో పరిశీలించారు. పోలీసులు సుమారు 1800 మొబైల్ ఫోన్లను వెరిఫికేషన్ చేశారు. ఎట్టకేలకు ఫేక్ జీవోను క్రియేట్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేసిన శ్రీపతి సంజీవ్ కుమార్ మాదాపూర్‌లో ఉంటున్నట్టుగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. లాక్ డౌన్ ఫేక్ జీవోతో పాటు తాజాగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాల ఫేక్ నోటిఫికేషన్‌ను క్రియేట్ చేసిన వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులను షేర్ చేయోద్దని గ్రూపు సభ్యులు, అడ్మిన్లకు సూచించారు. ఈ తరహా తప్పుడు ప్రచారంతో ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయని, లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫేక్ వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా డిటెక్టివ్ డిపార్ట్మెంట్ జాయింట్ సీపీ అవినాష్ మహాంతి, టాస్క్ ఫోర్స్ ఓఎస్‌డీ పి.రాధాకిషన్ రావు, సీసీఎస్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ ఇన్ స్పెక్టర్ రాజేష్, ఎస్ఐలు సతీష్ రెడ్డి, మల్లికార్జున్, ఎన్.రంజిత్ కుమార్, షేక్ కవిఉద్దీన్ తదితరులను సీపీ అంజనీకుమార్ అభినందించారు.