31 నెలల నిరీక్షణకు తెర
దిశ, తెలంగాణ బ్యూరో: సీల్డ్ కవర్లో వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి అందింది. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో వేతన సవరణ కమిషన్ చైర్మన్ బిస్వాల్, సభ్యులు అలీ రఫత్, ఉమామహేశ్వర్రావు సీల్డ్ కవర్లో తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు అందించారు. 31 నెలలపాటు అధ్యయనం చేసిన వేతన సవరణ నివేదిక ఎట్టకేలకు ప్రభుత్వానికి అందింది. మూడు నెలల కాలంలోనే నివేదిక ఇవ్వాలంటూ 2018 […]
దిశ, తెలంగాణ బ్యూరో: సీల్డ్ కవర్లో వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి అందింది. గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో వేతన సవరణ కమిషన్ చైర్మన్ బిస్వాల్, సభ్యులు అలీ రఫత్, ఉమామహేశ్వర్రావు సీల్డ్ కవర్లో తెలంగాణ తొలి వేతన సవరణ కమిషన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు అందించారు. 31 నెలలపాటు అధ్యయనం చేసిన వేతన సవరణ నివేదిక ఎట్టకేలకు ప్రభుత్వానికి అందింది. మూడు నెలల కాలంలోనే నివేదిక ఇవ్వాలంటూ 2018 మేలో ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్‌లతో కమిషన్ నియమించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడగించుకున్న కమిషన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో నివేదిక సమర్పించారు. గురువారం సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన తర్వాత నివేదిక సాయంత్రం వరకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో పీఆర్సీ నివేదికను సీఎస్‌కు అందించారు. సీఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు నివేదికను స్వీకరించారు. త్రిసభ్య కమిటీతో పాటుగా టీఎన్జీఓ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీజీఓ అధ్యక్షురాలు మమత, సెక్రటరీలు రాయకంటి ప్రతాప్, ఏనుగుల సత్యనారాయణ, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఉన్నారు.
నేడు అధికారుల కమిటీ భేటీ.. ఎల్లుండి జేఏసీకి నివేదిక
పీఆర్సీ నివేదిక అందడంతో ముగ్గురు ఉన్నతాధికారుల కమిటీ శుక్రవారం భేటీ కానున్నారు. సీఎస్ ఆధ్వర్యంలోని ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ సమావేశమై పీఆర్సీ ఇచ్చిన నివేదికను మరోసారి అధ్యయనం చేయనున్నారు. సీల్డ్ కవర్లో ఇచ్చిన ఈ నివేదికను శుక్రవారం ఓపెన్ చేసి కమిషన్ సూచించిన అంశాలపై చివరిసారిగా పరిశీలన చేయనున్నారు. కాగా, పీఆర్సీ నివేదికను శుక్రవారం ఓపెన్ చేసే అధికారుల కమిటీ ఈ నెల 2 లేదా 3న ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ కానుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ నివేదికను అధికారుల కమిటీ నుంచి అధికారికంగా తీసుకున్న తర్వాత ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ నెల 6 లేదా 7వ తేదీని సమావేశం అయ్యేందుకు నిర్ణయం తీసుకుంది. కమిషన్ నివేదిక, వేతన సవరణ అంశాలపై చర్చించి అదే రోజున సీఎస్‌కు ఉద్యోగుల పక్షాన డిమాండ్లు చెప్పనున్నారు. ఈ డిమాండ్లను కూడా స్వీకరించి పూర్తి వివరాలు, ఫైనల్ నివేదికను సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ సీఎం కేసీఆర్‌కు నివేదించనుంది. అనంతరం దీనిపై ఫైనాన్స్ శాఖ ఆమోదంతో సీఎం కేసీఆర్ పీఆర్సీని ప్రకటించనున్నట్లు చెబుతున్నారు. ఆ తర్వాత పీఆర్సీపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.
మూడు స్లాబుల్లో వేతన సవరణ..
సుదీర్ఘ కాలం సమయం తీసుకున్నా ఈసారి పీఆర్సీ కమిషన్‌లో చాలా అంశాలు సూచించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మూడు స్లాబుల్లో వేతన సవరణ చేయాలని నివేదికలో పేర్కొనట్లు సమాచారం. ఫిట్‌మెంట్‌ను 21 నుంచి 24 శాతం ఒక స్లాబుగా, 25 నుంచి 28 శాతం రెండోస్లాబులో, 30 నుంచి 33 వరకు మూడో స్లాబుగా పేర్కొన్నారని తెలుస్తోంది. ఇలా వేతన సవరణ చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతోందనే అంశాలను క్షుణంగా వివరించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఉద్యోగ సంఘాలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారని, పీఆర్సీ అంశంలో ఉద్యోగవర్గాలను ఒప్పించడంలో జేఏసీ కీలకంగా ఉండాలంటూ సూచించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.
ఈ సారి బెనిఫిట్స్ పెరిగే ఛాన్స్..
వేతన సవరణను మూడు స్లాబుల్లో చూపించిన కమిషన్ ఉద్యోగులకు పలు బెనిఫిట్లను కూడా సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులకు ఏడాదికోసారి వర్తింపచేసే ఎల్టీసీని ఇక నుంచి సులభతరం చేయనున్నారు. ప్రస్తుతం ఎల్టీసీలో నిబంధనలు కఠినతరంగానే ఉన్నాయి. ఏడాదికోసారి కుటుంబంతో సహా టూర్లకు వెళ్తే వాటికి సంబంధించిన ఖర్చులను ఆధారాలు, పత్రాలతో సమర్పించాల్సి ఉంటోంది. కానీ ఉద్యోగి పే స్కేల్ ఆధారంగా ఏడాదికి ఎల్టీసీని నిర్ధారించి ఇచ్చేందుకు నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మెడికల్ రీయింబర్స్మెంట్ పై, క్యాజువల్ లీవుపై కూడా నిబంధనలు మార్చినట్లు సమాచారం. పలు అంశాల్లో ఉద్యోగవర్గాలకు బెనిఫిట్స్‌ను ఈసారి పెంచే విధంగా నివేదికల్లో సూచించినట్లు సమాచారం.