IRCTC: ప్రైవేట్ రైళ్ల ఆలస్యానికి పరిహారం చెల్లించే పథకాన్ని నిలిపేసిన ఐఆర్‌సీటీసీ
ఈ పథకం కింద 2019, అక్టోబర్ 4 నుంచి 2024, ఫిబ్రవరి 16 ప్రయాణీకులకు రూ.26 లక్షలు పరిహారంగా చెల్లించారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేట్ రైళ్ల ఆలస్యంపై ప్రయాణికులకు పరిహారం పథకాన్ని నిలిపేసినట్టు ఐఆర్‌సీటీసీ తెలిపింది. సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) ద్వారా వార్తా సంస్థ పీటీఐ దాఖలు చేసిన దరఖాస్తుకు సమాధానం ఇచ్చిన ఐఆర్‌సీటీసీ ఈ విషయాన్ని ధృవీకరించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ప్రస్తుతం టిక్కెట్ బుకింగ్‌తో పాటు ప్రైవేట్ రైళ్లను కూడా నిర్వహిస్తోంది. ప్రైవేట్ రైళ్లు ఆలస్యంగా వస్తే అందుకుగానూ ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తుంది. ఐఆర్‌సీటీసీ ప్రకారం, ఈ పథకం కింద 2019, అక్టోబర్ 4 నుంచి 2024, ఫిబ్రవరి 16 ప్రయాణీకులకు రూ.26 లక్షలు పరిహారంగా చెల్లించారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే రూ.15.65 లక్షల పరిహారం అందించినట్లు సమాచారం. అయితే, ప్రైవేట్ రైళ్లు ఆలస్యంగా నడవకుండా పరిహారం అందించే ఈ పథకాన్ని 2025, ఫిబ్రవరి 15 నుంచి నిలిపేసినట్టు ఐఆర్‌సీటీసీ పేర్కొంది. దీనికి గల కారణాలు గోప్యమని వెల్లడించేందుకు నిరాకరించింది. ఆర్‌టీఐ ప్రకారం.. 2019-20లో రూ.1.78 లక్షలు, 2020-21లో సున్నా, 2021-22లో రూ.96,000, 2022-23లో రూ.7.74 లక్షలు, 2023-24లో రూ.15.65 లక్షలు ప్రయాణికులకు అందించినట్లు కార్పొరేషన్ తెలిపింది. రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఎంత పరిహారం అందుతుందన్న ప్రశ్నకు 60 నుంచి 120 నిమిషాల ఆలస్యానికి రూ.100, 120 నుంచి 240 నిమిషాల ఆలస్యమైతే రూ.250 పరిహారంగా అందజేశామని పేర్కొంది.