Meerut Murder: నిద్రమాత్రల కోసం మందుల చీటీ ఫోర్జరీ.. మీరట్ మర్డర్ కేసులో విషయాలు వెలుగులోకి..
మీరట్ లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి(Merchant Navy officer Murder) సౌరభ్ రాజ్ పూత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మంర చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: మీరట్ లో జరిగిన మర్చంట్ నేవీ అధికారి(Merchant Navy officer Murder) సౌరభ్ రాజ్ పూత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మంర చేశారు. ఈ సందర్భంగానే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. కాగా.. సౌరభ్‌ను హత్య చేసేందుకు ముస్కాన్ పక్కాగా ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం మందుల చీటీని ఫోర్జరీ చేసి నిద్రమాత్రలు సంపాదించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 22న ముస్కాన్ స్థానికంగా ఉన్న ఓ డాక్టర్ వద్దకు వెళ్లిందని పోలీసులు వర్గాలు తెలిపాయి.. ఆందోళన సమస్యతో బాధపడుతున్నానని చెప్పి మందులు రాయించుకుని.. ఆ తర్వాత ఓ ఖాళీ ప్రిస్క్రిప్షన్ పేపర్‌ను సంపాదించి అందులో ఆ మందులు రాసినట్లు తేలింది. వాటితో పాటు నిద్ర మాత్రల గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకొని ఆ పేర్లను చేర్చినట్లు తెలుస్తోంది. అయితే, ఫిబ్రవరి 25నే అతడిని హత్య చేసేందుకు ప్రయత్నించిందని.. కానీ, ఆరోజు సౌరభ్ మద్యం తాగకపోవడంతో ఆమె ప్లాన్ ఫెయిల్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత మార్చి 4న అతడికి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో అత్యంత కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
సౌరభ్ పంపిన డబ్బులతో బెట్టింగులు
మరోవైపు, పనికోసం విదేశాలకు వెళ్లిన సౌరభ్.. తన భార్య, కుమార్తె అవసరాల కోసం ప్రతినెలా రూ.లక్ష చొప్పున పంపించేవాడని దర్యాప్తులో తేలింది. ఆ డబ్బులు తన అకౌంట్‌లో పడగానే ముస్కాన్ ఆ విషయాన్ని ప్రియుడికి చేరవేసేదట. ఆ డబ్బుతో సాహిల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ పెట్టేవాడని పోలీసువర్గాలు పేర్కొన్నాయి. అక్కడ వచ్చిన డబ్బుతో వీరిద్దరూ రిషికేష్, డెహ్రాడూన్ లాంట్ ప్రాంతాలకు ట్రిప్ లకు వెళ్లినట్లు తెలుస్తోంది. సాహిల్‌కు ఎలాంటి ఉద్యోగం లేదని, గ్యాంబ్లింగ్‌లో వచ్చిన డబ్బులతోనే జల్సాలు చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు, తన తరఫున ఈ కేసు వాదన కోసం న్యాయవాది కావాలని ముస్కాన్ డిమాండ్ చేస్తోంది. తనపై తల్లిదండ్రులు కోపంతో ఉండడంతో లాయర్‌ను పెట్టేస్థితిలో లేరంటోంది. తనకు న్యాయం చేసేందుకు కోర్టులో కేసు వాదించేలా లాయర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. ఇకపోతే, నిందితురాలు ముస్కాన్ 2016లో మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పూత్ ని ప్రేమ వివాహం చేసుకుంది. వారిద్దరికీ 2019లో కుమార్తె పుట్టింది. ఆ తర్వాత సాహిల్ తో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో విడాకుల వరుకు వెళ్లిన సౌరభ్.. కుమార్తె కోసం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన అతడు కుమార్తె పుట్టిన రోజు కోసం తిరొచ్చాడు. దీంతో, అతడ్ని మార్చి 4న చివరకు తమ ప్రణాళిక ప్రకారం ముస్కాన్.. ఆమె ప్రియుడు సాహిల్.. సౌరబ్‌ను చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్ పోసేశారన్నారు.