పైసల్లేవ్.. పొదుపు అనివార్యం : సీఎం కేసీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్ర స్వీయ ఆదాయం 50 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మొదలు అక్టోబరు వరకు ఏడు నెలల కాలానికి సుమారు రూ. 52,750 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయిందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ ఏడు నెలల కాలానికి వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 67,608 కోట్ల మేరకు ఆదాయం రావాలి. రూ. 33,704 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ. 33,904 […]
దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కారణంగా రాష్ట్ర స్వీయ ఆదాయం 50 శాతానికి పైగా పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ మొదలు అక్టోబరు వరకు ఏడు నెలల కాలానికి సుమారు రూ. 52,750 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయిందని ఆర్థిక శాఖ అధికారులు తేల్చారు. ఈ ఏడు నెలల కాలానికి వార్షిక బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 67,608 కోట్ల మేరకు ఆదాయం రావాలి. రూ. 33,704 కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ. 33,904 కోట్ల మేరకు సమకూరాల్సి ఉంది. ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఈ సమావేశానికి హాజరుకాలేదు.
నష్టం తప్పదు..
రాష్ట్ర పన్నుల వాటా కింద కేంద్రం నుంచి గడచిన ఏడు నెలల కాలానికి రూ. 8,363 కోట్లు రావాల్సి ఉన్నా, రూ. 6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. రూ. 2,025 కోట్లు తగ్గాయి. రానున్న కాలంలోనూ కేంద్రం నుంచి రూ. 16,727 కోట్లకుగాను రూ. 11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ రూపంలో కూడా రూ. 4,829 కోట్ల మేర నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతేడాది సమకూరిన ఆదాయ వనరులతో పోల్చి 15% మేర వృద్ధి ఉంటుందని, 2020-21 బడ్జెట్‌లో పన్నెండు నెలల కాలానికి రాష్ట్రంలోని పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా సుమారు రూ. 1.16 లక్షల కోట్ల మేర సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఆ ప్రకారం గడచిన ఏడు నెలల కాలానికి రూ. 67,608 కోట్లు జమ కావాలి. రూ. 33,704 కోట్లు మాత్రమే సమకూరాయి. అంచనా వేసినట్లుగా 15% వృద్ధి సాధ్యం కాకపోగా గతేడాదిలాగా రూ. 39,608 కోట్లు కూడా రాలేదని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ అంచనాల్లో కూడా మార్పులు, సవరణలు అనివార్యమని సూచించారు.
నిధుల్లో కోత..
పలు కేంద్ర ప్రాయోజిత సంక్షేమ పథకాల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రానికి రూ. 9,725 కోట్లు రావాల్సి ఉందని, ఈ ప్రకారం అక్టోబర్ నెల నాటికి రూ. 5,673 కోట్లు రావాల్సి ఉండగా కేవలం రూ. 4,592 కోట్లు మాత్రమే వచ్చాయని అధికారులు వివరించారు. అక్టోబరు మాసం వరకే రావాల్సిన నిధుల్లో రూ. 1,081 కోత పడిందని, ఇక ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 9,725 కోట్ల రూపాయలకుగాను, రూ. 8,923 కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. మొత్తంగా కేంద్ర పథకాల కింద వచ్చే నిధుల్లో రూ. 802 కోట్ల రూపాయలు కోత పడే అవకాశం ఉందని సీఎంకు వివరించారు.
రాష్ట్రానికి మొత్తంగా రూ. 52,750 కోట్ల ఆదాయం తగ్గుతున్నందున దానికి అనుగుణంగా ప్రాధాన్య క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి (రెవెన్యూ) శేషాద్రి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు.