తెలంగాణం మరిచిన ‘ఉక్కు’ కథ
దిశ, ఖమ్మం ప్రతినిధి: ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ నినాదం ఎన్నో ఏళ్ల నుంచి వినపడుతోంది. ‘ఉక్కు సంకల్పం’మాత్రం నెరవేరడం లేదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని దశాబ్దాల నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. వనరులూ పుష్కలంగా ఉన్నా ఫ్యాక్టరీ స్థాపనకు మాత్రం ఎందుకో ముందడుగు పడడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని పార్టీలూ కర్మాగారం నిర్మించాలని ఉద్యమాలు చేశాయి. కేంద్రం కూడా హామీ ఇచ్చింది. అయినా ప్రయోజనం శూన్యం. ఇటు సీఎం కేసీఆర్ ఇచ్చిన […]
దిశ, ఖమ్మం ప్రతినిధి: ‘బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు’ నినాదం ఎన్నో ఏళ్ల నుంచి వినపడుతోంది. ‘ఉక్కు సంకల్పం’మాత్రం నెరవేరడం లేదు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపించాలని దశాబ్దాల నుంచి పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. వనరులూ పుష్కలంగా ఉన్నా ఫ్యాక్టరీ స్థాపనకు మాత్రం ఎందుకో ముందడుగు పడడం లేదు. రాష్ట్ర విభజనకు ముందు అన్ని పార్టీలూ కర్మాగారం నిర్మించాలని ఉద్యమాలు చేశాయి. కేంద్రం కూడా హామీ ఇచ్చింది. అయినా ప్రయోజనం శూన్యం. ఇటు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు.
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం మొండిచేయి చూపించింది. రాష్ట్రం నుంచి ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టింది. కేంద్రం నిర్మించకపోతే సింగరేణితో కలసి ఎంత ఖర్చయినా కర్మాగారాన్ని తామే ఏర్పాటు చేస్తామన్న సీఎం కేసీఆర్ మాటలూ బుట్టదాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం హడావుడి చేసినా, కేంద్రం మాత్రం సర్వేలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేసింది. రెండు ప్రభుత్వాలూ మోసం చేస్తున్నాయని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రంతో ఫైట్ చేయాల్సిన కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం, టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు కోసం బీజేపీతో అంటకాగుతున్నారని ప్రజాసంఘాల నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ వెళ్లినప్పుడు బయ్యారం ఉక్కు గుర్తు రాలేదా? అంటూ ఫైర్ అవుతున్నారు. అన్న మాట ప్రకారం సింగరేణితో కలిసి బయ్యారం ఉక్కు కర్మాగారం పనులు మొదలు పెట్టాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా దిగొస్తుందని చెబుతున్నారు.
అప్పుడు పోరాడి..
రాష్ట్ర విభజనకు ముందు అన్ని పార్టీలు బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నినదించాయి. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది సీమాంధ్రుల ప్రభుత్వం. తెలంగాణలో ఫ్యాక్టరీ ఏర్పాటును పూర్తిగా వ్యతిరేకించిన రాజశేఖర్ రెడ్డి పాలన. దాదాపు 2005 నుంచి కొన్ని ఏండ్ల పాటు నిరంతరాయంగా ఆంధ్రప్రాంతంవారు ఇక్కడి ముడి ఖనిజాన్ని కొల్లగొట్టుకుపోయారు. మనకు రావాల్సిన ఫ్యాక్టరీని విశాఖకు మార్చారు. అప్పుడు వారి బలం ఎక్కువ కాబట్టి పరిశ్రమ ఏర్పాటు కోసం జరిగిన పోరాటాలను, ఉద్యమాలను అణిచివేయగలిగారు. తెలంగాణ ఏర్పాటు తరువాత అవకాశాలున్నా ఉక్కు ఉక్కు కర్మాగారాన్ని సాధించలేకపోయారని గిరిజన సంఘాలు, పలు పార్టీల నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రులకు వినతులు ఇవ్వడం మినహా చేసిందేమీ లేదంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలోని హామీని నెరవేర్చేలా పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు.
వనరులున్నా..
అపారమైన ఇనుప ఖనిజం, పుష్కలంగా సహజ వనరులు బయ్యారం సొంతం. ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం, గార్ల, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలాల పరిధిలోని 56,960 హెక్టార్లలో ఖనిజం ఉంది. దీని విలువ సుమారు 700 లక్షల కోట్లని జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అంచనా వేసింది. దీన్ని ఆధారంగా చేసుకోనే, బయ్యారంలో ఫ్యాక్టరీ నెలకొల్పితే అడవిబిడ్డలకు ఉపాధితో పాటు ఈ ప్రాంతం బాగుపడుతుందని కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. 56,960 హెక్టార్లలో ఇనుము నిక్షేపాలు ఉన్నాయని, దేశంలో లభ్యమవుతున్న ఇనుప ఖనిజంలో దాదాపు 12 శాతం ఇక్కడే ఉందని అప్పటి సర్వే నిర్ధారించింది. గూడూరు, భీమదేవరపల్లి, నేలకొండపల్లి, గార్ల, బయ్యారంలో లభించే ఇనుప రాయిలో బయ్యారానిదే అగ్రస్థానమని కూడా నివేదికలో పొందుపరిచింది. 80 శాతం ఇనుపరాయి ఇక్కడ ఉన్నట్లు నిపుణుల కమిటీ కూడా తేల్చింది.
నిలదీయలేక!
టీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసి ఉంటే ఈపాటికే బయ్యారానికి ఫ్యాక్టరీ వచ్చి కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేవారని, ఏజెన్సీవాసులు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కేంద్రంపై కేసీఆర్ ప్రభుత్వం తీవ్రంగానే ఒత్తిడి చేసింది. అన్నిపార్టీలనూ కలుపుకుపోయి మరోసారి ఉద్యమాన్ని చేసి ఉంటే కొంతలో కొంతయినా మోడీ ప్రభుత్వం తలొగ్గేదని అంటున్నారు. కేసీఆర్ చెప్పిన విధంగా సింగరేణితో కలిసి ఫ్యాక్టరీ నిర్మాణానికి పూనుకున్నా, ఆ తర్వాత కేంద్రం కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఏదీ కుదరక పోతే ప్రైవేట్ సెక్టార్ తో కలిసి అయినా బయ్యారంలోని ముడి ఖనిజాన్ని వెలికితీయవచ్చంటున్నారు. ప్రైవేట్ సెక్టార్ తో కలిసి చేస్తే ప్రజావ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడం, తద్వారా పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ వచ్చే అవకాశం ఉండడంతో కేసీఆర్ మౌనంగా ఉండడమే మేలని భావించినట్లు చెబుతున్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మరుగున పడిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే అని చూపే ప్రయత్నం చేస్తున్నారు.
అన్నీ ఉన్నాయి..
ప్లాంట్ ఏర్పాటుకు సుమారు నాలుగు టీఎంసీల నీరు అవసరం ఉంటుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టులో భాగంగా బయ్యారం పెద్ద చెరువు బ్యాలెన్స్ రిజర్వాయర్ కానుంది. ఇక్కడ ఏడాది పొడవునా రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని అంచనా. ఈ నీటిని వాడుకోవచ్చు. బయ్యారం మండలంలో దాదాపు నాలుగు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. పరిశ్రమకు 22వందల ఎకరాలైతే సరిపోతుంది. బయ్యారం ఫ్యాక్టరీ స్థానికుల కల కాబట్టి మంచి ప్యాకేజీ, ఉద్యోగాలిస్తామంటే సులభంగానే భూసేకరణకు ఒప్పుకునేవారు. రైల్వే సదుపాయం కూడా ఉంది. పక్కనే ఉన్న కారేపల్లి మండలం మాదారంలో డోలమైట్ లభిస్తుంది. విశాఖకు ఇక్కడి నుంచే డోలమైట్ వెళ్తుంది. ఇల్లెందులో బొగ్గు లభిస్తుంది. బూడిందపాడు వద్ద పవర్ గ్రిడ్ ఉంది. కేటీపీఎస్, బీటీపీఎస్ ఉండనే ఉన్నాయి. కాలుష్య నివారణకు సహజసిద్ధ అడవులు ఉన్నాయి. ప్లాంట్ ఏర్పాటు చేస్తే దాదాపు 12వేల మంది నిర్వాసితులుగా మారుతారు.. వారందరికీ కర్మాగారంలో ఉపాధి కల్పించొచ్చు.
నాటి నుంచి నేటి దాకా
బయ్యారంలో 1954లో మైనింగ్ ప్రారంభమైంది. 1969లో కేంద్రం నిపుణుల కమిటీని బయ్యారానికి పంపింది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఇది అనుకూలమైన ప్రాంతమని, అన్ని సహజ వనులు కూడా పుష్కలంగా ఉన్నాయిని, కేంద్రానికి నివేదిక కూడా ఇచ్చింది. నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ప్రాంతం కావడంతో ఆలోచించాలని సూచించింది. బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటైతే విశాఖను వదులుకోవాల్సి వస్తుందని భావించారు. ఖనిజం క్వాలిటీ లేకపోతే ఛత్తీస్ గఢ్, బైలడీల నుంచి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించినా కేంద్రం వెనుకడుగు వేసింది. కేవలం నీటి ఆధారంగానే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. విశాఖ అనుబంధంగా ఎక్కడా ఇనుప గనులు లేవు. అన్ని వనరులున్న బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తే రెట్టింపు లాభాలొస్తాయంటున్నారు