ఏదులాపురం మున్సిపాలిటీ ఖరారు
పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.
దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలో ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం కేంద్రంగా కొత్త మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. పాలేరు శాసనసభ సభ్యుడు, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషితో ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ గౌతమ్ ఇటీవల అధికారులకు సర్క్యూలర్ జారీ చేసిన విషయం తెలిసిందే. దానికనుగుణంగానే జిల్లా కలెక్టర్ ముజుమిల్లాఖాన్ సదురు శాఖకు 12 గ్రామపంచాయతీలతో పాటు మ్యాప్ డ్రాప్ట్‌ను తయారు చేసి ఫైనల్ అప్రూవల్ కోసం పంపడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏదులాపురంతో పాటు మరో 12 మున్సిపాలిటీలను ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించింది. మొత్తం రూరల్ మండలంలోని 12 పంచాయతీలతో ఏదులాపురం మున్సిపాలిటీగా నామకరణం చేశారు.
దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ మండలంలోని పెద్దతండా, ఏదులాపురం, గుర్రలపాడు, వెంకటగిరి, గుదిమళ్ల, పోలేపల్లి, మద్దులపల్లి, బారుగూడెం, గొల్లగూడెం, ముత్తగూడెం, మద్దులపల్లి, తెల్దారుపల్లి, రెడ్డిపల్లి పంచాయతీలను కలిపి మున్పిపాలిటీగా చేశారు. మొత్తం 12 పంచాయతీల్లో 42,128 ఓట్లతో అవతరించింది. పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండల నాయకులతో సంప్రదింపులు జరిపి ఫైనల్ చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైతే జిల్లాలో 12 గ్రామపంచాయతీలు తగ్గనున్నాయి. 2018 ఎన్నికల్లో సైతం పైన పేర్కొన్న పంచాయతీలను ఖమ్మం మున్సిపాలిటీలో కొన్నింటిని విలీనం చేశారు. విలీనం పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు. అనంతరం మరలా వాటిని పంచాయతీలుగాను గుర్తిస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది.
అనాటి నుంచి నేటి వరకు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుంది. అయితే గత ప్రభుత్వమే నూతన మున్పిపాలిటీ చేస్తే ప్రజలకు బాగుండేది. దానిని ఆలోచన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 12 పంచాయతీలతో నూతన మున్సిపాలిటీకి శ్రీకారం చుట్టింది. దీంతో పాలేరుకు సైతం ఓ మున్పిపాలిటీ కళ నేరవేరనుంది. జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కో మున్సిపాలిటీ ఉంది. ఖమ్మానికి అతిసమీపంలో ఉన్న పాలేరులోనే ఇంత కాలం మున్పిపాలిటీ లేదు. ఖమ్మంకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో వెంచర్లు వెలిసి నూతన ఇండ్లు నిర్మితమయ్యాయి. వాటిలో మౌలికవసతుల కల్పన పంచాయతీలకు పెద్దతలనొప్పిగా మారింది. మున్సిపాలిటీ ఏర్పడితే బడ్జెట్ పెరిగి కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరించే అవకాశం ఉండనుంది. ఈ 12 పంచాయతీలను కలిపి మున్సిపాలిటీగా చేయడంతో అభివృద్ధికి అన్నిరకాలుగా సరితూకంగా ఉంటుందని మంత్రి శ్రీనివాసరెడ్డి ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
మంత్రి పొంగులేటి కృషితోనే..
పాలేరు శాసనసభ సభ్యుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషితో రూరల్ మండలంలోని నూతన మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మంత్రి ఆదేశాలతో చకచకా మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల డ్రాప్ట్‌లను అధికారులు రూపొందించి ప్రకటించడం జరిగింది. దీంతో పాలేరుకు ఉన్న మున్సిపాలిటీ లోటు కూడా తీరనుంది. నూతన మున్సిపాలిటీ ఏర్పాటుకు మంత్రి పొంగులేటితో నేరవేరిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎంవీపాలెం మండల కేంద్రంగా మరో మండలం ఏర్పాటు..?
రూరల్ మండలంలోని పది పంచాతీలు కలిపి ఓ మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తే మిగిలిన గ్రామాలన్నీ కలిపి ఓ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన అవశ్యకత ఏర్పడింది. ఎంవీపాలెం మండలం కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు బ్లూప్రింట్ సైతం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఎంవీపాలెం మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే 65 వేలకు పైగా ఓట్లు కలిగిన మండలంగా అవతరించనుంది.
పబ్లిక్కు సమస్యలు కూడా తీర్చేందుకు ఇది దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ఎంవీపాలెంలో నూతన పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ(సీఐ)స్థాయి అధికారితో కార్యాలయం ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖకు అధికారులు ప్రపోజల్స్ పంపారు. స్థల సేకరణకు సైతం అధికారులు పరిశీలన చేసినట్లు తెలిసింది.