మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ అవసరం

మహిళలను ఆర్థిక స్వేచ్చ కోసం స్వయం ఉపాధి పథకాలతో ప్రోత్సహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు.

Update: 2024-12-20 12:05 GMT

దిశ, కారేపల్లి : మహిళలను ఆర్థిక స్వేచ్చ కోసం స్వయం ఉపాధి పథకాలతో ప్రోత్సహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. కారేపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల మహిళా సమాఖ్య సమావేశానికి అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతులకు, మహిళలకు స్వయం ఉపాధిలో ప్రోత్సాహం అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. తక్కువ కాల వ్యవధిలో స్వయం ఉపాధి చేపట్టి ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బ్యాంకుల ద్వారా అందించే రుణాలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

     మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారన్నారు. రుణాలు తీసుకొని చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఆర్థికంగా స్థిరపడుతున్నారని తెలిపారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్ లు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు అప్పగించామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులను కూడా మహిళా సంఘాలకు ఇవ్వటం జరిగిందన్నారు. ఈ సమావేశంలో మండల తహసీల్దార్ సంపత్ కుమార్, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, ఐకేపీ ఏపీఎం పిడమర్తి వెంకటేశ్వర్లు, సీసీలు తుమ్మలపల్లి అనిల్, పగడాల పుష్ప, గౌసియా బేగం, వెంకన్న, విజయ లక్ష్మి, మండల సమైక్య అధ్యక్ష, కార్యదర్శులు ఇర్ప సుహాసిని, జిగట లక్ష్మి, కోశాధికారి ఎం.శ్రీలత తదితరులు పాల్గొన్నారు. 


Similar News