ఆశల్లో ‘ఆసరా’.. అమలుకాని హామీ..!
“ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మేం ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినం. కచ్చితంగా ఈ బడ్జెట్‌లో వారికి నిధులు పొందుపర్చి మార్చి 31 తర్వాత రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన మగవాళ్లు, ఆడవాళ్లైనా అందరికీ వృద్ధాప్య పింఛన్లు రూ.2016 చొప్పున అందిస్తం. దాదాపు ఎంత మంది ఉన్నారో లెక్క కూడా తేలింది. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏప్రిల్ నుంచి వారికి […]
“ రాష్ట్రంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో మేం ఇచ్చిన హామీలు కొన్ని పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా 57 ఏండ్లు దాటిన వారందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినం. కచ్చితంగా ఈ బడ్జెట్‌లో వారికి నిధులు పొందుపర్చి మార్చి 31 తర్వాత రాష్ట్రంలో 57 ఏండ్లు దాటిన మగవాళ్లు, ఆడవాళ్లైనా అందరికీ వృద్ధాప్య పింఛన్లు రూ.2016 చొప్పున అందిస్తం. దాదాపు ఎంత మంది ఉన్నారో లెక్క కూడా తేలింది. అవసరమైతే కేబినెట్ సబ్ కమిటీ వేసి ఏప్రిల్ నుంచి వారికి పింఛన్లు అందిస్తం..’’
– ఇదీ గతేడాది జనవరి 25న మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన.
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 57 ఏండ్లకే పెన్షన్ అర్హత వయస్సును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఆసరా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటికీ ప్రారంభం కాలేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. అనేక కారణాలను సాకుగా చూపిస్తూ ఇప్పటికే ఉన్న పింఛన్లలోనే కోత పెడుతున్నారు. ఈ సమయంలో కొత్త పింఛన్లు రావడం మరిచి పోవాల్సిందేనని అధికార వర్గాలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రస్తుతం 57 ఏండ్ల అర్హత వయస్సున్న వారు 8.51 లక్షల మంది కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వారిలో 6.62 లక్షల మంది అర్హులుగా ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ ఆ ఫైల్ పక్కనే పడేశారు. ఇప్పటిదాకా ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. అయితే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ మంజూరు చేయలేదు.
ఆశల దరఖాస్తులు
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు నెలల తర్వాత 2019 మే నెలలో పింఛన్ల సొమ్మును రెట్టింపు చేశారు. పింఛన్ల అర్హత వయస్సును 64 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు కుదించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో గ్రామాలు, పట్టణాల నుంచి దరఖాస్తులు వెల్లువలా వచ్చి పడ్డాయి. దరఖాస్తుల రూపేణా ప్రభుత్వానికి రూ.17.02 కోట్ల ఆదాయం వచ్చింది. మీ సేవా కేంద్రాల్లో ఒక్కో దరఖాస్తుకు రూ.200 వసూలు చేశారు. మొత్తం 8.51 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 57 ఏండ్ల వారికి పెన్షన్లు మంజూరు చేస్తారని ఆశపడ్డారు. కానీ ఎన్నికల కోడ్ సాకుతో దాట వేశారు.
నిబంధనలు కఠినం
కొత్త పెన్షన్ల కోసం ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. 2018 నవంబర్ వరకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటరు జాబితా ప్రామాణికంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. వాస్తవంగా గతేడాది మార్చి వరకు ఓటరు జాబితా ఆధారంగా కొత్త పెన్షన్ ఇస్తారని ఆశపడ్డారు. కానీ 2018 ఓటరు జాబితా ఆధారంగా వయస్సు నిర్ధారణ చేస్తుండటంతో… దాదాపు 3.21 లక్షల మందికి పెన్షన్ దూరమవుతోంది. వీటితో పాటుగా ఒక ఇంట్లో రెండు పెన్షన్లు, మూడెకరాలకుపైగా వ్యవసాయ భూమి ఉన్న వారు అనర్హులే. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం పరిమితిగా నిర్ధారించారు.
6.62 లక్షల మంది అర్హులు
పెన్షన్ అర్హత వయస్సు 57 ఏండ్లకు కుదించడంతో రాష్ట్రంలో మరో పది లక్షల వరకు ఆసరా లబ్ధిదారులు పెరుగుతారని ముందుగా భావించారు. రాష్ట్రం మొత్తంగా 8.51 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అయితే నిబంధనలను అనుసరిస్తూ లబ్ధిదారుల క్షేత్రస్థాయి విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కొన్నిచోట్ల అధికారులు గ్రామాల్లో విచారణ సైతం చేశారు. కానీ పట్టణ ప్రాంతాల్లో పెండింగ్ పెట్టారు. మొత్తం వచ్చిన దరఖాస్తుల్లో 6.62 లక్షల మంది అర్హులు ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని గతేడాది మార్చిలో మంత్రి దయాకర్‌రావు సైతం వెల్లడించారు. 57 ఏండ్లు నిండిన వారు 6.62 లక్షల మంది ఉన్నారని, వారికి త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని మార్చిలో ప్రకటించారు.
పద్దు కేటాయించినా..
కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. పెన్షన్ల సొమ్ము రెట్టింపు చేసిన అనంతరం 2019లో ఓటాన్ బడ్జెట్‌లో అభాగ్యుల పెన్షన్ల కోసం రూ.12,067 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత 2019-20 బడ్జెట్ సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టి రూ.9,434 కోట్లు కేటాయించారు. అప్పటి వరకు రాష్ట్రంలో 38.72 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నారు. ఆ తర్వాత గతేడాది మార్చిలో పెట్టిన బడ్జెట్‌లో 2020-21 కాలానికి రూ. 11,758 కోట్లను ఆసరా పెన్షన్లకు కేటాయించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 38,58,615 మందికి పెన్షన్లు ఇస్తుండగా.. వీరిలో దివ్యాంగులు 4,93,975 మంది ఉన్నారు. వృద్ధాప్య, వితంతు, నేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ, బోధకాల వ్యాధిగ్రస్తులు, బీడీ వర్కర్లు, ఒంటరి మహిళలకు రూ.2016 చొప్పున, దివ్యాంగులకు రూ.3016 చొప్పున పెన్షన్లు ఇస్తున్నారు. ఆసరా పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.800 కోట్లు చెల్లిస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు పెట్టినప్పటికీ.. కొత్త పెన్షన్లు మాత్రం మంజూరు చేయడం లేదు. వాస్తవంగా ప్రభుత్వం అంచనా వేసిన విధంగా కొత్త పెన్షన్లు 6.62 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే ఏటా రూ.1,601 కోట్లు అదనంగా విడుదల చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన నిధులు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ మంజూరీలో మాత్రం జాప్యం చేస్తున్నారు.
ఇస్తాం.. ఇస్తాం
కొత్త పెన్షన్లపై ప్రభుత్వం ఇస్తామంటూనే సాగదీస్తోంది. ఇటీవల మంత్రి దయాకర్‌రావు కూడా 57 ఏండ్ల పెన్షన్లు మంజూరు చేస్తామంటూ చెప్పారు. కానీ దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు ఉంటే ఇప్పటికే గ్రామస్థాయి నుంచి క్షేత్రస్థాయి విచారణ మొదలుకావాల్సి ఉందని, కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్లు ఇస్తామంటూ ఆశల్లో పెడుతున్నారు.