ఎట్టకేలకు పీఆర్సీ నివేదికలో కదలిక
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంలో ఒక్క అడుగు ముందుకు పడింది. 24 రోజుల తర్వాత సీఎస్ ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం భేటీ అయింది. ఈ నెల తొలి వారంలోనే సమావేశం కావాలని సీఎం చెప్పినా.. వివిధ కారణాలతో భేటీ కాలేదు. చివరకు ఆదివారం సీఎం కేసీఆర్ మళ్లీ అదే విషయాన్ని చెప్పడం, పీఆర్సీ నివేదికపై తేల్చాలని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో సోమవారం సీఎస్ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ ముఖ్య […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ అంశంలో ఒక్క అడుగు ముందుకు పడింది. 24 రోజుల తర్వాత సీఎస్ ఆధ్వర్యంలో త్రీమెన్ కమిటీ సోమవారం భేటీ అయింది. ఈ నెల తొలి వారంలోనే సమావేశం కావాలని సీఎం చెప్పినా.. వివిధ కారణాలతో భేటీ కాలేదు. చివరకు ఆదివారం సీఎం కేసీఆర్ మళ్లీ అదే విషయాన్ని చెప్పడం, పీఆర్సీ నివేదికపై తేల్చాలని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో సోమవారం సీఎస్ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలతో సమావేశాలకు షెడ్యూల్ నిర్ణయించారు. బుధవారం గుర్తింపు పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో త్రీమెన్కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు ఉద్యోగ సంఘాలకు కూడా సమాచారమిచ్చారు. అనంతరం ఈ నెల 29న సీఎం కేసీఆర్‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంకా సీఎం అపాయింట్‌మెంట్ ఖరారు కాలేదు. బుధవారం ఉద్యోగ సంఘాలతో భేటీ అయి ఫిట్మెంట్అంశాన్ని చర్చించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఇప్పటికే ఫిట్‌మెంట్‌పై ఉద్యోగ సంఘాల నుంచి కొంత ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు సమావేశంలో ఫిట్‌మెంట్ అంశాన్ని ప్రకటించి, దానిపై చర్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన వినతులు, వేతన సవరణ కమిషన్ సూచించిన సిఫారసులపై చర్చించి, ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధమైన ఫిట్‌మెంట్ శాతాన్ని ఉద్యోగ నేతలకు వివరించనున్నారు. ఆ తర్వాత దానిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. దీంతో బుధవారం ఉద్యోగ సంఘాలతో సమావేశమైన తర్వాత నివేదికను సీఎంకు అందిస్తే శుక్రవారం సీఎంతో సమావేశం ఉంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి తొలి వారంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించే అవకాశాలున్నాయి.
ఫిబ్రవరి రెండో వారంలోగా రాష్ట్రంలోని రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తొలి వారంలోనే ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాలు సీఎంకు విజ్ఞప్తి చేశాయి. దీంతో సీఎం కేసీఆర్ పలు ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. ఫిబ్రవరి తొలివారంలోగా పీఆర్సీని ప్రకటించకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారే ప్రమాదం ఉంది. అలాగైతే మాత్రం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగవర్గాల నుంచి వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.