మారని రిటైర్డ్ ఎంప్లాయిస్ తీరు.. సర్కార్ ఆదేశించినా కుర్చీలు వదలని వైనం
ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎక్స్‌టెన్షన్ పేరుతో అవకాశం కల్పిస్తూ వచ్చాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగం నుంచి పదవీ విరమణ పొందిన అధికారులు, ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎక్స్‌టెన్షన్ పేరుతో అవకాశం కల్పిస్తూ వచ్చాయి. ఫలితంగా సీనియారిటీ ఉన్న ఎంతో మంది అధికారులు, ఉద్యోగులకు ప్రమోషన్లు రాకుండా పోయాయి. కొంత మంది అయితే పదేండ్లకుపైగా సీట్లను వదలని పరిస్థితి నెలకొంది. అటెండర్ నుంచి మొదలుకుని ఆఫీసర్ వరకు కొనసాగుతూనే ఉన్నారు. అయితే పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 177మందితో కూడిన జాబితాను తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. అదే ఉత్తర్వుల్లో హెచ్ఓడీల జస్టిఫికేషన్ ఆధారంగా కొనసాగించొచ్చని చేర్చారు. దీన్ని ఆసరా చేసుకుని ఉన్న సీట్ల నుంచి కదలట్లేదు. దీనిపై రెగ్యులర్ అధికారులు మండిపడుతున్నారు. తొలగించాలని ఉత్తర్వులు ఇచ్చినట్టే ఇచ్చి ఈ జస్టిఫికేషన్ ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.
హెచ్ఎండీఏలోనే అధికం
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 177 మంది రిటైర్డ్ అధికారులు ఉన్నారు. వీటిలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ)లోనే అత్యధికంగా రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. 68మందిలో తహసీల్దార్లు, ఇంజినీర్లు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉన్నారు. ఎక్కువ మంది అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలోనే ఉన్నారు. వీరి కారణంగా చాలా మంది అధికారులకు ప్రమోషన్లు రావడంలేదు. దీంతోపాటు సర్వీసుతోపాటు బెనిఫిట్స్ లోనూ నష్టపోవాల్సి వస్తుంది. జీహెచ్ఎంసీలో 46మంది ఉన్నారు. హైదరాబాద్ మెట్రోరైలు విభాగంలో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితోపాటు 27మంది ఉన్నారు. వాటర్ బోర్డులో ఐదుగురు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ హెడ్ ఆఫీసులో నలుగురు, పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయంలో ఒకరు, మెప్మాలో ఇద్దరు, హెచ్ఆర్ డీసీఎల్ లో ఇద్దరు, టీయూఎఫ్ ఐడీసీలో ఒకరు, పబ్లిక్ హెల్త్ విభాగంలో ఒకరు, మెదక్ మున్సిపాలిటీలో ఒకరు, ఇల్లందు మున్సిపాలిటీలో ఒకరు, వీటీఏడీఏలో ఒకరు, వైటీడీఏలో ఆరుగురు, వరంగల్ కాకతీయ డెవలప్ మెంట్ ఆథారిటీ(కుడా)లో ఆరుగురు, సిద్దిపేట డెవలప్ మెంట్ ఆథారిటీలో ఒకరు, రెరాలో ఏడుగురు ఉన్నారు.
హెచ్ఎండీఏలో ససేమిరా
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసిన రిటైర్డ్ అధికారుల జాబితాలో హెచ్ఎండీఏకు సంబంధించిన వారే 68 మంది ఉన్నారు. అయితే రిటైర్డ్ అధికారుల సేవలు కావాలని హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఆయా విభాగాలకు చెందిన అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అందుకు కమిషనర్ అంగీకరించడం లేదని, ప్రభుత్వ ఆదేశాలను ఎట్టి పరిస్థితిలో అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పినట్టు తెలిసింది. వారం రోజుల్లో జాబితాలో ఉన్నవాళ్లను పంపించేయాలని ఆదేశాలు కూడా జారీచేసినట్టు సమాచారం. ఇక జీహెచ్ఎంసీలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అన్ని విభాగాల నుంచి రిమార్క్స్ పంపించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. వచ్చే వారంలో ఎంత మంది ఉంటారు? ఎంత మందిని పంపిస్తారనేది చూడాల్సిందే. ఇక మెట్రోరైలు విభాగంలో అయితే 50శాతానికి పైగా అధికారులను కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం నడుస్తోంది. మిగిలిన విభాగాల్లో తక్కువగా ఉండడంతోనే పెద్దగా పట్టించుకోవడం లేదని అధికారులు చెబుతున్నారు.
జస్టిఫికేషన్ పేరుతో..
రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులను తొలగించాలని మార్చి 25న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన ఉత్తర్వుల్లోనే ‘రిటైర్డ్ అధికారులు, ఉద్యోగుల సర్వీసు కావాలంటే సంబంధిత కాంపిటేంట్ ఆథారిటీ జస్టిఫికేషన్ తో ఫ్రెష్ ఆర్డర్స్ ఇవ్వాలి’ అని చేర్చారు. దీన్ని ఆసరా చేసుకుని పలువురు రిటైర్డ్ అధికారులు, ఉద్యోగులు ఫైరవీలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోరైలు ప్రాజెక్టు కార్యాలయాల్లో ఆ సీట్లను వదలడానికి సంశయిస్తున్నారు. రిటైర్డ్ అధికారుల తీరుపై రెగ్యులర్ అధికారులు మండిపడుతున్నారు. ‘ఇంకా ఎన్ని రోజులు తింటారు ప్రజల సొమ్ము..రిటైర్డ్ అయినా ఉద్యోగంలో కొనసాగితే కొత్తవాళ్లకు ప్రమోషన్లు ఎలా వస్తాయి. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలి’ అంటూ పలువురు అధికారులు, ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఆయా విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులకు సంబంధించిన జస్టిఫికేషన్ ఇవ్వాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, హెచ్ఎంఆర్ఎల్ లోని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతోంది.