సీఎంతో వస్తానంటే చర్చకు మేం రెఢీ.. మహేష్ గౌడ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్ట్రాంగ్ రిప్లై
అప్పుడు పారిపోయిన వాళ్లే ఇప్పుడు చర్చకు రమ్మంటున్నారని, మహేష్ గౌడ్ సీఎంను తీసుకొస్తానంటే తాము చర్చకు సిద్దమని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద గౌడ్ (BRS Party Whip KP Vivekanand Goud) అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అప్పుడు పారిపోయిన వాళ్లే ఇప్పుడు చర్చకు రమ్మంటున్నారని, మహేష్ గౌడ్ సీఎంను తీసుకొస్తానంటే తాము చర్చకు సిద్దమని బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ విప్ కేపీ వివేకానంద గౌడ్ (BRS Party Whip KP Vivekanand Goud) అన్నారు. తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్ని ఆధారాలతో కంచె గచ్చిబౌలి భూముల విషయంలో పది వేల కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగిందని నిరూపించారని అన్నారు. కేటీఆర్ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పలేకపోయారని, ప్రభుత్వం ఈ వ్యవహారంలో పీకల లోతు ఇరుక్కుపోయిందని ఆరోపించారు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC Chief mahesh Kumar Goud) అవగాహన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారని అన్నారు. పీసీసీ అధ్యక్షులు గతంలో తమ సీఎంలు తప్పు చేస్తే దారిలో పెట్టేవారని, మహేష్ గౌడ్ మాత్రం డమ్మీ పీసీసీ అధ్యక్షుడిగా మారారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవాలు చెప్పకుండా మహేష్ గౌడ్ కేటీఆర్‌ను జైల్లో పెడతామంటున్నారని, మహేష్ ఉడత ఊపులకు భయపడే వారు ఎవ్వరూ లేరని, బెదిరించే ధోరణిలో మహేష్ గౌడ్ మాట్లాడుతున్నారని తెలిపారు. మహేష్ గౌడ్ చర్చకు రమ్మంటున్నారు.. వస్తాం, అయితే మహేష్ గౌడ్ సీఎంను పక్కన కూర్చో బెట్టుకోవాలని అన్నారు.
అసెంబ్లీలో అనేక అంశాలపై చర్చకు మేము పెట్టిన డిమాండ్లపై పారిపోయిన వాళ్లే ఇపుడు మళ్ళీ చర్చకు వస్తారా అంటున్నారని ఎద్దేవా చేశారు. మీనాక్షి నటరాజన్ (Minakshi Natarajan) సూపర్ సీఎం (Super CM)గా అవతరించారని, ఆమె రేవంత్ తప్పులను సమర్థిస్తున్నారా, సరి చేస్తున్నారా అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను కాపాడితే రేవంత్ అన్యాక్రాంతం చేస్తున్నారని, కేసీఆర్ (KCR) కష్టపడి ఫార్మాసిటీకి 17 వేల ఎకరాలు సేకరిస్తే వాటిని రేవంత్ రెడ్డి (Revanth Reddy) రియల్ ఎస్టేట్ దందాకు వాడుతున్నారని ఆరోపణలు చేశారు. రేవంత్ పీసీసీ అధ్యక్షుడిగా ఆర్టీఐని అడ్డంగా పెట్టుకుని భూ దందా చేశారని, అప్పుడు సీఎం హోదాలో అధికారికంగా భూ దందా చేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
ఇక కంచె గచ్చి బౌలి భూములకు సంబంధించి బ్రోకర్‌కు 170 కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తారు? అని ప్రశ్నించారు. అలాగే ఆ భూములను పది వేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టామని అసెంబ్లీలో చెప్పిన ప్రభుత్వం ఇపుడు బుకాయిస్తోందని అన్నారు. ఐసీఐసీఐ పది వేల కోట్లు చెల్లించిందని పత్రికలు కోడై కూశాయని, అప్పుడు ఖండించని ఐసీఐసీఐ ఇప్పుడు ఎందుకు ఖండిస్తోందని నిలదీశారు. రూ. 75 కోట్లకు ఎకరా అని ఓసారి జీవో ఇచ్చి, 52 కోట్లకు ఎకరా అని మరోసారి అంటారు.. రకరకాల వాదనలతో ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.
శ్వేతపత్రాలపై ఈ ప్రభుత్వానికి మక్కువ ఎక్కువ అని, ఈ అంశంలోనూ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ప్రెస్‌మీట్ ట్రైలర్ మాత్రమేనని, ముందు ముందు మరిన్ని వివరాలు బయటపెడతామని తెలిపారు. బీజేపీ ఎంపీ పేరు (BJP MP Name) కూడా త్వరలో బయటపెడతామని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌పై పగ, భూముల్లో పాగా అనే సిద్ధాంతంతో రేవంత్ పాలన సాగిస్తున్నారని, మహేష్ గౌడ్ ఇకనైనా పీసీసీ అధ్యక్షుడినని బాధ్యతతో వ్యవహరించి మసులుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) సూచించారు.