గులాబీల్లో గుబులు.. ’నామినేటెడ్‘ దాగుడు మూతలు

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి దఫా ఆధికారంలోకి వచ్చినప్పుడే నామినేటెడ్ పోస్టులు కొంతమందికే పరిమితమయ్యాయి. దాదాపు 54 పోస్టులను భర్తీ చేయలేదు. వాటిని కనీసం ముట్టుకోలేదు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేండ్లు దాటిపోయినా.. తమను పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం నిరాశ నిస్పృహలకు లోనవుతోంది. అయితే వారి వేదన వారి వరకే పరిమితమవుతోంది. ఈ పరిస్థితిపై గులాబీ దళం మండిపడుతోంది. […]

Update: 2021-02-10 12:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వం తొలి దఫా ఆధికారంలోకి వచ్చినప్పుడే నామినేటెడ్ పోస్టులు కొంతమందికే పరిమితమయ్యాయి. దాదాపు 54 పోస్టులను భర్తీ చేయలేదు. వాటిని కనీసం ముట్టుకోలేదు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి రెండేండ్లు దాటిపోయినా.. తమను పట్టించుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకత్వం నిరాశ నిస్పృహలకు లోనవుతోంది. అయితే వారి వేదన వారి వరకే పరిమితమవుతోంది. ఈ పరిస్థితిపై గులాబీ దళం మండిపడుతోంది. ఇప్పుడు.. అప్పుడూ.. అంటూ ఊరిస్తూ పార్టీ అధిష్టానం ఆడుకుంతోందని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు ఆ పార్టీ నేతలు.

కనీసం పోస్ట్ అయినా ఇస్తారని..

పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి ఏ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కనీసం నామినేటెడ్‌ పదవుల్లోనైనా చోటు దక్కకపోతుందా అనే ఆశతో ఉంటున్నారు. త్వరలో నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంటూ సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుతున్న ప్రతిసారీ, చెప్పులరిగేలా అగ్రనేతల చుట్టూ తిరగడం, ఆ తర్వాత నీరుగారిపోవడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం గ్యాడ్యుయేట్, సాగర్ ఉప ఎన్నిక, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికలకు ముందైనా నామినేటెడ్‌ పోస్టులు వస్తాయని అందరూ భావించారు. ఇటీవల పార్టీ మీటింగ్ అనంతరం పలు జిల్లాల నేతలతో విడివిడిగా సమావేశమైన సందర్భంగా సీఎం కొంతమందికి నామినేటెడ్ పోస్టులపై హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ అది నెరవేరేలా లేదంటున్నారు.

మళ్లో పుట్టిన రోజు వస్తోంది

గత ఏడాది సీఎం జన్మదినం సందర్భంగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని అందరూ ఆశించారు. అందుకనుగుణంగా అప్పుడు జరిగిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. కార్పొరేషన్, దేవాదాయ, మార్కెట్ కమిటీ చైర్మన్ల భర్తీ కోసం జాబితా రూపొందించాలని మంత్రులకు సీఎం ఆదేశాలిచ్చినట్లు ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో సూచనలు చేశారు. దీంతో అందరూ ప్రగతిభవన్​ వైపు దారి పట్టారు. కానీ ఏడాది గడిచింది. మళ్లీ పుట్టినరోజు వస్తోంది. కానీ పోస్టు మాత్రం దక్కలేదు.

ఎన్నికలు, సభ్యత్వ నమోదుకు దూరం

ప్రతిసారి ఏదో ఒక సాకుతో తమను వాడుకుంటూ పక్కన పెడుతుండడంతో పలువురు రాష్ట్ర స్థాయి ద్వితీయశ్రేణి నాయకులు ఈసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారానికి, సభ్యత్వ నమోదుకు అంటీముట్టనట్టుగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే వరంగల్ సెగ్మెంట్లో పల్లా రాజేశ్వర్​రెడ్డి ప్రచారం చేస్తున్నా.. కొంత కేడర్ దూరంగానే ఉంటోంది. పార్టీ ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టింది. అయితే చాలా చోట్ల నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. పార్టీ కోసం పని చేస్తున్నామని, పదవుల్లేక… కనీస గౌరవం కూడా లేకుండాపోయిందని, ఇప్పుడు సభ్యత్వ నమోదుకు ఎలా రావాలంటూ ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దగ్గరకు వెళ్లి నిలదీస్తున్నారు. వారికి సమాధానం చెప్పలేక నేతలు తల పట్టుకుంటున్నారు. అయితే ఈసారి పదవి వస్తుందని, నీకే ఇప్పిస్తామంటూ చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

నిండా అప్పుల పాలవుతున్నాం

గులాబీ దళంలోని నాయకులు ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో పడుతున్నారు. కొందరు సీనియర్‌ లీడర్లకు నామినేటెడ్‌ పదవులు ఖాయమంటూ కొంతకాలంగా ప్రచారం జోరుగా సాగింది. ఈ మేరకు వారు కూడా తమకు పదవి ఖాయమంటూ తిరుగుతున్నారు. కానీ పదవులు రావడంలో ఆలస్యమవుతుండటంతో ఆర్థిక భారంతో సతమతమవుతున్నారు. పదవులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఉండడంతో అప్పులతో కాలం గడపాల్సివస్తోంది. కొంతమంది జిల్లా కేంద్రాలకు మకాం మార్చి.. తిరిగి తమ సొంత స్థలాలకు పదవులు లేకుండా వెళ్లలేక ఆస్తులు అమ్ముకుంటూ పరువు ప్రతిష్టల కోసం ఉంటున్నారు.

Tags:    

Similar News