తెలంగాణ ప్రభుత్వ ఆశలు లిక్కర్‌పైనే..!
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేదని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ కేటాయింపులపై ఆచితూచి అడుగు వేయాలనుకుంటోంది. పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి డివొల్యూషన్ రూపంలో వచ్చేది కూడా ఈసారి తగ్గిపోనుంది. దీంతో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకం, మద్యం ద్వారా సమకూరే ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడం మినహా కొత్తగా మార్గాలు లేవని ఆర్థిక […]
దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ సంవత్సరం పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేదని అంచనాకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ కేటాయింపులపై ఆచితూచి అడుగు వేయాలనుకుంటోంది. పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి డివొల్యూషన్ రూపంలో వచ్చేది కూడా ఈసారి తగ్గిపోనుంది. దీంతో రాష్ట్ర స్వీయ ఆర్థిక వనరులపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ భూముల అమ్మకం, మద్యం ద్వారా సమకూరే ఆదాయాన్ని మరింతగా పెంచుకోవడం మినహా కొత్తగా మార్గాలు లేవని ఆర్థిక శాఖ అధికారులు అంచనాకు వచ్చారు. కొత్తగా బార్లకు అనుమతి ఇవ్వడం, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప లాంటి సంస్థలకు చెందిన భూముల్ని ఈ ఏడాది గరిష్ట స్థాయిలో అమ్మకానికి పెట్టడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలనుకుంటోంది. దీనికి తోడు భూముల విలువను సవరించి రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ ద్వారా కూడా కొంత అదనంగా సమకూర్చుకోవాలనుకుంటోంది.
ఏటేటా పెరుగుతున్న మద్యం ఆదాయం
రాష్ట్రం ఏర్పడే నాటికి మద్యం ద్వారా సుమారు రూ. 10 వేల కోట్ల ఆదాయమే సమకూరింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అదనం. అప్పటి నుంచి ప్రతి ఏటా మద్యం ఆదాయం పెరుగుతూనే ఉంది. ఒక్క నెలలోనే (జనవరి 2021) దాదాపు రెండు వేల కోట్ల రూపాయల మేర ఆదాయం కేవలం మద్యం అమ్మకాల ద్వారా లభించింది. 2019లో మద్యం ద్వారా సుమారు రూ. 25 వేల కోట్లు సమకూరగా ఈసారి ఇది కచ్చితంగా రూ. 30 వేల కోట్లు దాటుతుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కలేస్తున్నారు. ఎలాగూ కొత్తగా 159 బార్లు తెరుస్తున్నందున మరికొంత ఆదాయం సమకూరనుంది. కరోనా సమయంలో మద్యం ధరలను ఒకసారి పెంచినందున మరోసారి పెంచితే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందోననే చర్చలు కూడా ఆ శాఖ అధికారుల స్థాయిలో జరుగుతున్నాయి.
భూముల రిజిస్ట్రేషన్ ఆదాయంపై దృష్టి..
మద్యం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సంతృప్తికరమైన ఆదాయాన్ని పొందాలనుకుంటున్నది రియల్ ఎస్టేట్, భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ, ప్రభుత్వ భూముల అమ్మకం, భూముల విలువను సవరించడం తదితరాల ద్వారానే. కరోనా సమయంలో పూర్తిస్థాయిలో భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ‘ధరణి‘ కారణంగా దాదాపు రెండున్నర నెలల పాటు రిజిస్ట్రేషన్లు జరగనేలేదు. దీంతో గణనీయ స్థాయిలో ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరసంలో సుమారు పది వేల కోట్ల రూపాయల మేర ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి ఇప్పటివరకు (ఫిబ్రవరి చివరి నాటికి) కేవలం రూ. 3,200 కోట్లు మాత్రమే సమకూరాయి.
కేంద్రం నుంచి తగ్గనున్న ఆర్థిక వనరులు
కరోనా నష్టానికి పరిహారంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ‘హెలికాప్టర్ మనీ‘ లేదా ఇతర రూపాల్లో కొన్ని నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం పెట్టుకుంది. కానీ అది రాకపోగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగా సుమారు ఐదు వేల కోట్ల రూపాయలను రాష్ట్రం కోల్పోయింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి 2.437 శాతం మేర వాటా ఉండగా 15వ ఆర్థిక సంఘం సిఫారసులతో అది 2.102 శాతానికి తగ్గింది. ఆ కారణంగా ఒక్క ఏడాదిలోనే రాష్ట్రం నాలుగు వేల కోట్లకు పైగా నష్టపోతోంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ‘అగ్రి సెస్‘ విధించడంతో రాష్ట్రానికి పెట్రోలు, డీజిల్ ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడింది.
ఆచితూచి ఖర్చు..
పరిమిత ఆదాయ వనరులతో ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని అమలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటికి అదనంగా డబ్బులు అవసరం కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టాలనుకుంటోంది. సాగునీటి ప్రాజెక్టులు మినహా ఇతర రకాల కాపిటల్ ఎక్స్‌పెండిచర్ కేటాయింపులను దాదాపుగా నిలిపివేయడమే మంచిదనే అంచనాకు వచ్చింది. అందుకే ఈసారి ‘జీరో బడ్జెట్‘ జాబితాలో కొన్ని పనులు చేరే అవకాశం ఉంది. గత బడ్జెట్‌ను రూ. 1.83 లక్షల కోట్లుగా అంచనా వేసుకున్నా లాక్‌డౌన్ కారణంగా నవంబరు చివరి నాటికే రూ. 52 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం జీఎస్టీ కలెక్షన్లు పెరగడం, అన్‌లాక్‌తో వ్యాపార కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతుండడంతో స్వల్పంగా ఆదాయం పెరిగింది.