మేము ఒప్పుకోము.. కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకుంటున్న విద్యుత్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న నిబంధనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. బిల్లుపై ఇప్పటికే అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటూ, డిస్కంలను దశలవారీగా ప్రైవేటుపరం చేసే ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, కార్యదర్శి అలోక్ కుమార్ బుధవారం నిర్వహించిన […]
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురావాలనుకుంటున్న విద్యుత్ బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించింది. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలన్న నిబంధనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. బిల్లుపై ఇప్పటికే అసెంబ్లీలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉంటూ, డిస్కంలను దశలవారీగా ప్రైవేటుపరం చేసే ప్రతిపాదనను కూడా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.
ఢిల్లీ నుంచి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, కార్యదర్శి అలోక్ కుమార్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్కో సీఎండీ, పలువురు అధికారులు హాజరయ్యారు. కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, డిస్కంలకు ఫ్రాంచైజీలు నెలకొల్పడం, ఈఆర్‌సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్)ను కేంద్రమే నియమించడం, రాష్ట్రాల జెన్‌కోలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో 19 శాతం సంప్రదాయేతర (పవన, సౌర విద్యుత్ తదితరాలు) ఉండడం, క్రమంగా దాని ఉత్పత్తి పెంచడం వంటి ఆరు అంశాలను ప్రస్తావించారు.
కేంద్ర మంత్రి ప్రతిపాదించిన వాటిలో పంపుసెట్లకు మీటర్లు బిగించడం, డిస్కంలకు ఫ్రాంచైజీలను నెలకొల్పడం, ఈఆర్‌సీల ఏర్పాటు కేంద్రం పరిధిలోకి వెళ్లడం అనే మూడు అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వాటికి అనుమతించేదే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కొత్త బిల్లు విషయమై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంటూనే, గతంలో అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని, సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎండీ ప్రస్తావించినట్టు సమాచారం. కానీ ఆ విషయాన్ని సీఎండీగానీ, రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారులుగానీ అధికారికంగా వెల్లడించలేదు.
వ్యతిరేకిస్తున్నా ముందుకు..
విద్యుత్ సంస్కరణల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలనుకుంటోంది. అందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లును ఇప్పటికే అన్ని రాష్ట్రాలకూ పంపగా, అధ్యయనం చేసిన దాదాపు ఇరవై రాష్ట్రాలు ఉచిత వ్యవసాయ విద్యుత్ విషయంలో మీటర్లు పెట్టే విధానాన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ అసెంబ్లీ కూడా గత సెప్టెంబరు 15న విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టి కేంద్రం కొత్త విద్యుత్ బిల్లు (2003 చట్టానికి సవరణలు చేసే బిల్లు) రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైనదని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని స్పష్టం చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధానికి లేఖ కూడా రాసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్ర విద్యుత్ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులోనూ సీఎండీ ప్రభాకర్ రావు ఇదే అంశాన్ని నొక్కిచెప్పినట్లు తెలిసింది.
కాగా, విద్యుత్ ఇంజినీర్ల ఫోరం కూడా కేంద్ర విధానాన్ని తప్పుపట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రికి కూడా లేఖ రాసి ఆ ప్రతిపాదనలను విరమించుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించుకుని చట్టాన్ని చేయాలన్న పట్టుదలతోనే ముందుకెళ్తోంది.