తెలంగాణ జీడీపీ లాక్ ‘డౌన్’

– కరోనా దెబ్బకు పడిపోయిన డిమాండ్ – దాదాపు నిలిచిపోయిన వస్తు, సేవల ఉత్పత్తి – రెవెన్యూ లేని ప్రైవేటు కంపెనీలు – ప్రభుత్వ ఖజానా ఖాళీ – జీతాలు కోసేసిన ప్రభుత్వం – ఉద్యోగాలే పీకేసే పనిలో ప్రైవేటు కంపెనీలు దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి 22న ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్‌డౌన్ రాష్ట్రంలో ఏప్రిల్ 14దాకా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా మాత్రం లాక్‌డౌన్ […]

Update: 2020-04-09 08:00 GMT

– కరోనా దెబ్బకు పడిపోయిన డిమాండ్
– దాదాపు నిలిచిపోయిన వస్తు, సేవల ఉత్పత్తి
– రెవెన్యూ లేని ప్రైవేటు కంపెనీలు
– ప్రభుత్వ ఖజానా ఖాళీ
– జీతాలు కోసేసిన ప్రభుత్వం
– ఉద్యోగాలే పీకేసే పనిలో ప్రైవేటు కంపెనీలు

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మార్చి 22న ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూతో ప్రారంభమైన లాక్‌డౌన్ రాష్ట్రంలో ఏప్రిల్ 14దాకా కొనసాగనుంది. దేశవ్యాప్తంగా మాత్రం లాక్‌డౌన్ మార్చి 24 నుంచి ప్రారంభమైంది. దీంతో దేశం, రాష్ట్రంలో గడిచిన 15రోజుల నుంచి ఆర్థిక వ్యవస్థ ముందుకు కదలడం లేదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ గురించి ఒకటి రెండు రోజులుగా పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నివేదికలు నెగెటివ్ ఇస్తున్న విషయం తెలిసిందే. అమెరికా బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మన్ సాక్స్ అయితే దేశ జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.2 శాతానికి పడిపోనుందని నివేదికిచ్చింది. కొన్ని కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర జీడీపీ డబుల్ డిజిట్ వృద్ధిలో దూసుకుపోయిన విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా రాష్ట్ర జీడీపీ 9లక్షల 60వేల కోట్లుగా పేర్కొంది. కాగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఓ మోస్తరు మాంద్యంతో జీడీపీ వృద్ధిరేటు అంతకముందు సంవత్సరాల కంటే కొద్దిగా తగ్గి 12శాతానికి చేరింది. మాంద్యం నుంచి రికవర్ అవుతుందనుకునే టైంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కరోనా లాక్‌డౌన్ వచ్చిపడింది. దీంతో తెలంగాణ రాష్ట్ర జీడీపీ వృద్ధిరేటు స్పీడుకు బ్రేక్ పడినట్లయింది.

ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతర చిరుద్యోగులు, వ్యాపారస్థులు అందరూ లాక్‌డౌన్ వల్ల ఇళ్లకే పరిమితమవడంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఉండే హైదరాబాద్ నగరంలో స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) పూర్తిగా నిలిచిపోయింది. వస్తు, సేవల ఉత్పత్తి 99 శాతం మేర ఎక్కడికక్కడే ఆగిపోయింది. తెలంగాణ రాష్ట్ర జీడీపీ రూ.9 లక్షల 60వేల కోట్లలో 66 శాతం సర్వీసులు, 18 శాతం వ్యవసాయం, 16 శాతం మ్యానుఫ్యాక్చరింగ్ రంగం వాటాలున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్న వ్యవసాయం కేవలం 18 శాతం మాత్రమే. లాక్‌డౌన్ వల్ల ఈ రంగం పెద్దగా ప్రభావితమవకపోయిన్నప్పటికీ రాష్ట్ర జీడీపీలో సింహభాగం వాటాలు కలిగిన ద్వితీయ, తృతీయ రంగాలైన మ్యానుఫ్యాక్చరింగ్, సేవల రంగాలు పూర్తిగా ప్రభావితమయ్యాయి. వీటిలో సర్వీసుల రంగంలోని ఐటీ వంటి పరిశ్రమలు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాత ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి కొద్దోగొప్పో నెట్టుకొస్తున్నారు. అయితే భారీ జీతాలుండి ఎక్కువగా ఖర్చుపెట్టే ఐటీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితమవడంతో ఈ రంగం మీద ఆధారపడ్డ అనుబంధ సర్వీసులైన ట్రాన్స్‌పోర్టు, రిటైల్, ఎంటర్‌టైన్‌మెంట్, రెస్టారెంట్ వంటి సర్వీసులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పని జరగదని అందరికీ తెలిసిందే. దీంతో రాష్ట్ర ఒక్క రోజు జీడీపీ రూ.2650 కోట్లలో రోజుకు దాదాపు రూ.2000కోట్ల విలువ కలిగిన వస్తు, సేవల ఉత్పత్తి ఆగిపోయిందని తెలుస్తోంది.

రాష్ట్రంలో స్థానికంగా ఉన్న డిమాండ్ మేర, ఇక్కడి నుంచి బయటి రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతుల అవసరాల కోసం వస్తు, సేవల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనినే ఎకనమిక్స్ పరిభాషలో జీడీపీ అంటారు. అయితే ప్రస్తుత లాక్‌డౌన్ వల్ల ప్రజలు బయటికి వచ్చే అవకాశం లేకపోవడంతో రాష్ట్రంలో వస్తు, సేవల డిమాండ్ దాదాపుగా పడిపోయింది. దేశంలోని ఇతర రాష్ట్రాలు, ప్రపంచ దేశాలు సైతం కరోనాతో పోరాడుతున్నందున ఎక్స్‌పోర్ట్ డిమాండ్ సైతం గణనీయంగా పడిపోయినట్టు తెలుస్తోంది. డిమాండ్ పడిపోతే ఉత్పత్తి ఆటోమెటిక్‌గా తగ్గిపోతుంది. తయారీ, సేవా రంగంలో ఉత్పత్తి పడిపోతే కంపెనీలకు ఆదాయం పడిపోతుంది. అవి ప్రభుత్వానికి కట్టే పరోక్ష, ప్రత్యక్ష పన్నులు గణనీయంగా తగ్గుతాయి. దీనికి తోడు డిమాండ్ లేనపుడు కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించుకుంటాయి. దీని వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది.

రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రారంభమైన రోజు నుంచి రూ.2400 కోట్లు ఆదాయం రావాల్సి ఉండగా రూ.6 కోట్లే వచ్చిందని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. జీడీపీ గణనీయంగా పడిపోవడం వల్లే రాష్ట్రానికి జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ లాంటి వివిధ రూపాల్లో వచ్చే పన్ను ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ఖజానాకు ప్రతిరోజు రావాల్సిన సుమారు రూ.350 కోట్ల ఆదాయం పూర్తిగా బందైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పలు అత్యవసర సర్వీసులు కాని ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల జీతాలు 60 శాతం వరకు కోతపెట్టింది. పలు సంక్షేమ కార్యక్రమాలకు సైతం నిధుల విడుదలపై డౌటు పడే పరిస్థితి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమకు ద్రవ్యలోటు కింద ఆర్బీఐ నుంచి వచ్చే అప్పు సొమ్మును ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో లేదా మొదటి త్రైమాసికంలోనే వాడుకొనే ప్రయత్నాల్లో ఉంది. ప్రతి సంవత్సరం జీడీపీలో 3 శాతం ఇచ్చే ద్రవ్యలోటు అప్పులను మరింత పెంచుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్ బీఎమ్ చట్టాన్ని సవరించాలని కేంద్రాన్ని కోరే అవకాశం లేకపోలేదు.

Tags: telangana, corona, lock down, effect on gdp, revenue loss, job losses

Tags:    

Similar News