సిలబస్, క్యాలెండర్ కుదింపు !

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్- 19 నేపథ్యంలో సాధారణ అకాడమిక్ ఇయర్ ప్రారంభం గడువు దాటిపోయింది. విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిలబస్ కుదింపుతో పాటు విద్యాక్యాలెండర్ రోజులను తగ్గించాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నిర్ణయం విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పాఠ్యాంశాల తొలగింపు పైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 నుంచి 220 వరకూ వర్కింగ్ డే ఉంటున్నాయి. అయితే గరిష్టంగా […]

Update: 2020-07-08 09:15 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కొవిడ్- 19 నేపథ్యంలో సాధారణ అకాడమిక్ ఇయర్ ప్రారంభం గడువు దాటిపోయింది. విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో సిలబస్ కుదింపుతో పాటు విద్యాక్యాలెండర్ రోజులను తగ్గించాలని విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ నిర్ణయం విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. పాఠ్యాంశాల తొలగింపు పైనా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 నుంచి 220 వరకూ వర్కింగ్ డే ఉంటున్నాయి. అయితే గరిష్టంగా 180 వరకూ మాత్రమే విద్యాలయాలు తెరుచుకుంటున్నట్టు తెలుస్తోంది. విద్యాసంవత్సరాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారనేదానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సిలబస్‌ను తగ్గించాలనే నిర్ణయం ముందుగానే ఎందుకు తీసుకుంటారనే విమర్శలు ఎదురవుతున్నాయి.

సాధారణంగా జూన్ 14న పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉన్నా కాలేదు. సెప్టెంబర్ 1 నుంచి కళాశాలలు ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు మూడు నెలల కాలం కోత పడుతుంది కాబట్టి ఆ మేరకు పనిదినాలు తగ్గించడంతో పాటు చాప్టర్ల తొలగింపు చేపడుతున్నట్టు విద్యాధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ సిలబస్‌ను 30శాతం తగ్గించారు. రాష్ట్ర సిలబస్‌లోనూ 20-35% వరకూ సిలబస్‌ను తగ్గించేందుకు విద్యాశాఖ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పనిదినాల్లో కూడా కోత విధించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా విద్యార్థులపై భారాన్ని తగ్గించవచ్చని వారు భావిస్తున్నారు. కొవిడ్ సమయంలోనూ సాధారణ విద్యా క్యాలెండర్ను అమలు చేయడం ద్వారా భవిష్యత్ విద్యా సంవత్సరాలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని వారి వాదన. అయితే సిలబస్, విద్యాసంవత్సరం క్యాలెండర్ తగ్గింపును వ్యతిరేకించేవారి వాదన మరోలా ఉంది. ఆధునిక సమాజ మార్పులు, టెక్నాలజీని అందుకునే స్థాయిలో ప్రస్తుత సిలబస్ లేదు. తరగతుల వారీగా ఏయే స్టేజీల్లో ఏ పాఠ్యాంశాలు బోధించాలని ముందుగానే నిర్ణయిస్తున్నారు. విద్యార్థుల వయసు, మానసిక స్థాయిలపై ఆధారపడి తరగతుల పాఠ్యాంశాలను తయారుచేస్తారు. సిలబస్‌ను రీషెడ్యూల్ చేయాలనుకుంటే నిపుణులు నిర్ణయిస్తారు. అయితే ఇపుడు కొవిడ్‌ను ఒక కారణంగా చూపి కొన్ని చాప్టర్లను పూర్తిగా తొలగించడం సరికాదనేది వారి వాదన.

ఉదాహరణకు ప్రస్తుతం సీబీఎస్ఈ సిలబస్‌లో ప్రజాస్వామ్యం, పౌరసత్వం వంటి ముఖ్యమైన పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. మనదేశంలో ప్రాథమిక అంశాలను నేర్చుకోకుండా విద్యార్థులు ఇంకా ఏం తెలుసుకుంటారనేది వారి వాదన. పాఠ్యాంశాల్లో ప్రస్తుత కాలంలో ఎంత అవసరమో అంతవరకైనా విద్యార్థులకు బోధించి, మిగిలినది తొలగిస్తే బాగుంటుంది కానీ పూర్తిగా అధ్యాయాలను తొలగించడం సరికాదు. విద్యాసంవత్సరాన్ని ప్రారంభిస్తే ఎప్పటివరకు కొనసాగించవచ్చో.. సిలబస్‌లో ఎలాంటి మార్పులు అవసరమో ఓ అంచనాకు రావచ్చు. ముందుగానే ఇలాంటి పనులు చేయడం వల్ల అంత ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. దసరా, దీపావళి, వేసవి సెలవును కూడా ఉపయోగించుకునేలా క్యాలెండర్ రూపొందిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిలబడలేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్న సందర్భంలో ఇలాంటి చర్యలు వ్యతిరేక ఫలితాలను ఇస్తాయని ఉపాధ్యాయసంఘాల నేతలు అభిప్రాయ పడుతున్నారు.

తొందరపాటు చర్యలు మంచి ఫలితాలను ఇవ్వవు – చావ రవి, టీఎస్‌ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ముందుగా విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలి. అపుడున్న వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటే మంచిది. విద్యాలయాలు తెరవకముందే సిలబస్‌లో కోత విధింపు వంటి చర్యలు మంచి ఫలితాలను ఇవ్వబోవని మేం భావిస్తున్నాం. అకాడమిక్ క్యాలెండర్ను కుదించాల్సిన అవసరం కూడా రాదని అంచనా వేస్తున్నాం. విద్యార్థులు చదువు ప్రారంభిస్తే క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నిపుణులు అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. కానీ ముందుగానే సిలబస్, అకాడమిక్ ఇయర్ తగ్గింపు వంటి నిర్ణయాలు విద్యార్థులకు మేలు చేయకపోగా.. వ్యతిరేక ఫలితాలను ఇస్తాయి. ప్రభుత్వం పునరాలోచించాలి.

Tags:    

Similar News