తెలంగాణలో ఒకేరోజు 75 మందికి పాజిటివ్

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజున 75 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 229కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందగా శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 11కు చేరుకుంది. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారందరినీ గుర్తించామని, కరోనా లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించామని ప్రభుత్వం పేర్కొంది. వీరందరికీ […]

Update: 2020-04-03 11:35 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజున 75 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 229కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మంది కరోనా కారణంగా మృతి చెందగా శుక్రవారం మరో ఇద్దరు మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 11కు చేరుకుంది. మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారందరినీ గుర్తించామని, కరోనా లక్షణాలు ఉన్నవారిని, వారి కుటుంబ సభ్యులను ఐసొలేషన్ కేంద్రాలకు తరలించామని ప్రభుత్వం పేర్కొంది. వీరందరికీ పరీక్షలు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని ఆరు ల్యాబొరేటరీలు ఇందుకోసం 24 గంటలూ షిప్టులవారీగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో సరిగ్గా నెల రోజుల క్రితం… గత నెల 4వ తేదీన తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదుకాగా ఈ నెల రోజుల వ్యవధిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 229కు చేరుకోవడం గమనార్హం. ఇందులో ఇప్పటికే 17 మంది చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యి ఇంటికి చేరుకోగా శుక్రవారం మరో 15 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య 186గా ఉంది.

రాష్ట్రంలో ఒకేసారి 75 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులు గత నెల 22 నుంచి నిలిచిపోవడంతో ఇక విదేశాల నుంచి వైరస్ వచ్చే అవకాశం లేదు. పద్నాలుగు రోజుల క్వారంటైన్ కాలం కూడా ముగిసిపోయింది. అయినా పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలోని మర్కజ్ మసీదుకు వెళ్ళివచ్చినవారే. మృతి చెందిన ఇద్దరిలో ఒకరు షాద్‌నగర్‌కు చెందినవారుకాగా మరొకరు సికింద్రాబాద్‌కు చెందినవారని రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. వరుసగా గడిచిన నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. గత నెల 31న ఇరవై కేసులు నమోదుకాగా, ఏప్రిల్ 1న 30 కేసులు, గురువారం 27 కేసులు, శుక్రవారం 75 కేసులు నమోదయ్యాయి.

ఒకే రోజున 75 కేసులు నమోదైనట్లు మంత్రి ఆ బులెటిన్‌లో పేర్కొన్నప్పటికీ జిల్లాలవారీగా మాత్రం వివరాలను ఇవ్వలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాజిటివ్ కేసుల్లో విదేశీ ప్రయాణం చేసివచ్చినవారు, మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారు, వారి ద్వారా లక్షణాలు సోకినవారి వివరాలేవీ ఇందులో లేవు. కొత్తగా నమోదైన 75 కేసుల్లో ఎక్కువగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందినవేనని వైద్యారోగ్య శాఖ అధికారుల సమాచారం. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారి సంఖ్య దాదాపు 1,030గా ఉందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఇందులో ఇంకా 160 మందిని గుర్తించాల్సి ఉందని మంత్రి ఈటల రాజేందర్ రెండు రోజుల క్రితం పేర్కొన్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలో అందరినీ గుర్తించినట్లు శుక్రవారం వెల్లడించారు. అయితే ఇంతకాలం పాటు మర్కజ్‌కు వెళ్ళివచ్చినవారితో సన్నిహిత సంబంధం (కాంటాక్ట్) ఉన్నవారిని కూడా గుర్తించిన వైద్య సిబ్బంది ఐసొలేషన్ కేంద్రాలకు తరలించింది. కొద్దిమందికి పరీక్షలు ముగియగా మరికొద్దిమందికి ఇంకా రిపోర్టులు రావాల్సి ఉంది. పెద్ద సంఖ్యలో పరీక్షలు జరగాల్సి ఉన్నందున రాష్ట్రంలో మొత్తం ఆరు ల్యాబ్‌లలో 24 గంటలూ మూడు షిప్టుల చొప్పున పరీక్షలు జరుగుతున్నాయి. శని, ఆదివారాల్లో మరికొన్ని కొత్త కేసుల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఆయుబ్‌ఖాన్‌పై ప్రభుత్వం సీరియస్

ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్ళి వచ్చి ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పనందుకు ఆయనపై శాఖాపరమైన చర్యలు మొదలయ్యే అవకాశం ఉంది. పశు సంవర్ధక శాఖలో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ఆయుబ్ ఖాన్ గత నెల 13 నుంచి మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. 16వ తేదీన తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటి నుంచి విధులకు హాజరవుతున్నారు. అయితే మర్కజ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో ఆయుబ్ ఖాన్ కూడా వెళ్ళివచ్చిన విషయం బయటపడింది. దీంతో ఆయనను వెంటనే ఐసొలేషన్ కేంద్రానికి తరలించిన ప్రభుత్వం ఆయన కూర్చునే ఛాంబర్‌తోపాటు మొత్తం తాత్కాలిక సచివాలయాన్ని శానిటైజ్ చేయించింది. కరోనా తీవ్రతను పట్టించుకోకుండా మర్కజ్‌కు వెళ్ళివచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచినందుకు ఆయనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోడానికి సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి రూపొందించిన ఫైల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఇక ఆయనపై చర్య తీసుకోవడమే తరువాయి.

Tags : Telangana, Corona, Positive, Death, Discharge, 75 cases, in one day

Tags:    

Similar News