లాక్‌డౌన్ రూల్స్‌కు సర్కారు బ్రేక్
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈ నెల 18న జారీ చేసిన ఉత్తర్వులకు భిన్నంగా 29న కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం చేయాలనుకుంటున్నారు. వందల సంఖ్యలో పూజారులు, వేద పండితులు, రుత్వికులను ఆహ్వానిస్తున్నారు. సుమారు 200 మంది రుత్వికులు, 200 మంది వీవీఐపీలు, 1000 మంది వీఐపీలు, 800 మంది పోలీసు సెక్యూరిటీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, అధికారులు, స్థానిక గ్రామాల […]
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. ఈ నెల 18న జారీ చేసిన ఉత్తర్వులకు భిన్నంగా 29న కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం చేయాలనుకుంటున్నారు. వందల సంఖ్యలో పూజారులు, వేద పండితులు, రుత్వికులను ఆహ్వానిస్తున్నారు. సుమారు 200 మంది రుత్వికులు, 200 మంది వీవీఐపీలు, 1000 మంది వీఐపీలు, 800 మంది పోలీసు సెక్యూరిటీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు, అధికారులు, స్థానిక గ్రామాల నుంచి ప్రత్యేకంగా వచ్చే ఆహ్వానితులు.. ఇలా మొత్తం కలిపి సుమారు 4000 మంది జమ కానున్నారు. ఆ తర్వాత కొండ పోచమ్మ సాగర్ పంపు హౌజ్ దగ్గర చినజీయర్ స్వామి పాల్గొనే సుదర్శన యాగం పూర్ణాహుతిలో సైతం పాల్గొననున్నారు. ప్రజలంతా స్వీయ నియంత్రణ పాటించాలని, సామాజిక దూరం నిబంధనను ఉల్లంఘించవద్దని చెప్తూనే స్వయంగా ముఖ్యమంత్రే వాటిని బుట్టదాఖలా చేస్తున్నారు. నీతులు, నిబంధనలు, సుద్దులు ప్రజలకు మాత్రమేనా.. పాలకులకు వర్తించవా? అనేది చర్చనీయాంశమైంది.
కొండ పోచమ్మసాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 29న తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి జరిగే కార్యక్రమ వివరాలను మీడియాకు వెల్లడించిన ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏయే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారో పేర్కొంది. నిజానికి నాలుగో విడత లాక్‌డౌన్ ఈ నెల 31వ తేదీ వరకూ కొనసాగనుంది. ఎన్ని రకాల ఆంక్షల సడలింపు ఇచ్చినా ఎలాంటి మినహాయింపులు లేకుండా పకడ్బందీగా నిషేధించిన వివరాలను ఈ నెల 18న వెలువరించిన జీవో (నెం.68)లో (6 హెచ్, ఐ నిబంధనలు) రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇప్పుడు కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఆక్కడి ఆలయంలో 29వ తేదీ తెల్లవారు జామున చండీయాగం, ఆ తర్వాత ఉదయం పది గంటలకు పంపు హౌజ్ దగ్గర సుదర్శనయాగంలో పాల్గొనే కార్యక్రమంలో ఆయనతో పాటు సతీమణి, కుటుంబ సభ్యులు, పూజారులు, రుత్వికులు, మంత్రులు, అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది, పార్టీ నాయకుల లాంటివారంతా కలిసి సుమారు రెండు వేల మంది ఉంటారని అంచనా. వీవీఐపీల కోసమే 200 వాహనాలు పట్టే పార్కింగ్ స్థలాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక సుమారు వెయ్యి మంది వీఐపీల వాహనాల కోసం మరో పార్కింగ్ ఏర్పాటవుతోంది. రుత్వికులే సుమారు 200 మంది పాల్గొంటున్నట్లు పోలీసులు తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో సుమారు 800 మంది పోలీసులు ఉంటున్నారు. ఇంత భారీ సంఖ్యలో పాల్గొంటున్న ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధం.
ప్రజలు గుమికూడడం లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధం
కేంద్ర హోంశాఖ 4వ విడత లాక్‌డౌన్‌కు ఈ నెల 17న విధించిన నిబంధనల (నెం.40-3/2020/డీఎం-1-ఏ) ప్రకారం ‘ప్రార్థనా స్థలాలు, ఆలయాలు మూసి ఉంచాలి. ప్రజలు వాటిల్లో పాల్గొనకూడదు. మత అవసరాల కోసం ప్రజలు గుమికూడడం పక్కాగా నిషేధించబడింది’ అని రెండో నిబంధనలోని 7వ అంశంలో స్పష్టంగా ఉంది. ఇక అదే మార్గదర్శకాల్లోని 6వ అంశంలో ‘అన్ని రకాల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు నిషేధం. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం కూడా నిషేధం’ అని పేర్కొంది. ఎలాంటి మినహాయింపులు లేకుండా దేశవ్యాప్తంగా ఇది అమలు కావాల్సిందేనని కేంద్రం అందులో స్పష్టం చేసింది. పెళ్లిళ్ల లాంటి కార్యక్రమాలకు గరిష్ఠంగా యాభై మందికి మించకూడదని, వారు కూడా అక్కడ సామాజిక దూరం నిబంధనను పాటించాల్సిందేనని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టంగా చెప్పింది. చివరకు చావు అనంతరం జరిగే అంత్యక్రియలు, శ్మశానంలో కూడా గరిష్ఠంగా ఇరవై మందికి మించకూడదని స్పష్టం చేసింది. అక్కడ కూడా సామాజిక దూరం పాటించక తప్పదని స్పష్టం చేసింది. ఎక్కువ మంది గుమికూడితే వైరస్ వ్యాప్తికి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని విపత్తు నిర్వహణా చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని అమలు చేయనున్నట్లు జీవో నెం.68లో స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా జరగబోతున్నది.
ఉల్లంఘిస్తే ఏమవుతుంది?
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేయకపోతే వారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునో కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 55 ప్రకారం ప్రభుత్వంలోని ఏ శాఖ లేదా విభాగం ఉల్లంఘనకు పాల్పడినా ఆ శాఖ లేదా విభాగం అధిపతి దానికి జవాబుదారీ అవుతారని, చట్టప్రకారం శిక్షార్హులవుతారని కేంద్రం ప్రకటించింది. అనాలోచితంగా లేదా అవగాహన లేకుండా ఇలాంటి ఉల్లంఘన జరిగినట్లయితే దానికి మినహాయింపు ఉంటుంది. కానీ ఇప్పుడు పక్కా ప్లాన్ ప్రకారం మూడు రోజుల ముందు నుంచే కొండ పోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం గురించి స్వయంగా ముఖ్యమంత్రే పర్యవేక్షించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించడం గమనార్హం.
పండుగలన్నీ సాదాసీదాగానే
లాక్‌డౌన్ కారణంగా అన్నిరకాల మత ప్రార్థనలు నిషేధం. ఆ ప్రకారమే మొదటి లాక్‌డౌన్ సమయంలో వచ్చిన గుడ్ ఫ్రైడే చర్చిల్లో నలుగురైదుగురికే పరిమితమైంది. ఆ తర్వాత ఉగాది పంచాంగ శ్రవణం ఆన్‌లైన్‌కే పరిమితమైంది. ఆ తర్వాత వచ్చిన భద్రాద్రి ఆలయంలోని శ్రీరామనవమి వేడుకలు సైతం పరిమితంగానే జరిగాయి. తాజాగా ముస్లిం సోదరుల రంజాన్ వేడుకలు సైతం మక్కా మసీదు దగ్గర ఎలాంటి జనసంచారం లేకుండా ఇండ్లకే పరిమితమయ్యాయి. ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా వేలాది మందితో చండీయాగం, సుదర్శన యాగం జరుగుతుండడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి కనీసంగా 1500 లేదా 2000 మందికి భోజనం పెట్టి గ్రాండ్‌గా చేద్దామంటూ మర్కుక్ సర్పంచ్‌కు ఆదివారం (మే 24) ఫోన్ చేసిన కేసీఆర్ తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించారు. ఒకవైపు ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి, సామాజిక దూరం నిబంధనను అనుసరించాలి, వైరస్‌తో సహజీవనం తప్పదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూనే ఇప్పుడు పదుల సంఖ్యలో యాగాలు, హోమాలు చేస్తుండడం వేల సంఖ్యలో భోజనాలు పెట్టాలంటూ సర్పంచ్‌కు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశం.
‘కొండపోచమ్మ’ ప్రారంభోత్సవం ఇలా..
– కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చండీయాగం, సుదర్శన యాగం, గంగమ్మ పూజలు
– 29వ తేదీ ఉదయం 4 గంటలకు ఏక కాలంలో కొండ పోచమ్మ ఆలయంలో చండీయాగం, కొండపోచమ్మ సాగర్ పంపుహౌజ్ (మర్కుక్) వద్ద సుదర్శన యాగం
– ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రాజెక్టు నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే కొండ పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
– చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొంటారు. తీర్థ ప్రసాదాలు, వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకుంటారు.
– అక్కడి నుంచి ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. ఉదయం 9 గంటల తర్వాత ఎర్రవల్లి, మర్కుక్ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు.
– అనంతరం మర్కుక్ వద్ద గల కొండ పోచమ్మ సాగర్‌కు నీటిని లిఫ్టు చేసే పంపు హౌజు వద్దకు చేరుకుంటారు. పది గంటల సమయంలో పంపుహౌజు వద్దకు చేరుకుని చినజీయర్ స్వామికి కేసీఆర్ స్వాగతం పలుకుతారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు.
– అనంతరం పంపుహౌజ్ స్విచ్ఛాన్ (ప్రారంభం) చేస్తారు. అక్కడి నుంచి ప్రాజెక్టు డిశ్చార్జి కెనాల్ (నీరు చేరుకునే ప్రాంతం) వద్దకు వచ్చి గోదావరి జలాలకు స్వాగతం పలుకుతారు.
– గోదావరి గంగమ్మకు పూజలు నిర్వహిస్తారు. అనంతరం చినజీయర్ స్వామికి వీడ్కోలు పలుకుతారు.
– ఆహ్వానించిన కొద్ది మంది అతిథులకు అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.