అసెంబ్లీ సెషన్స్.. నెగెటివ్ వస్తేనే లోనికి!
దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ఆరు నెలల తరువాత సోమవారం ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అసెంబ్లీ లోనికి అనుమతించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పటికే టెస్టులు చేయించుకున్నారు. మంత్రి హరీశ్‌రావుకు పాజిటివ్ రావడంతో, 50 ఏళ్లు దాటిన ఎమ్మెల్యేలకు కరోనా గుబులు పట్టుకుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్ వాతావరణంలో జరిగే ఈ సమావేశాలకు ఎలా హాజరు కావాలనేదాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అవసరమైనప్పుడు […]
దిశ, న్యూస్ బ్యూరో: అసెంబ్లీ సమావేశాలు ఆరు నెలల తరువాత సోమవారం ప్రారంభం కానున్నాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో సరికొత్త ఆంక్షలు అమలులోకి వచ్చాయి. నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అసెంబ్లీ లోనికి అనుమతించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఇప్పటికే టెస్టులు చేయించుకున్నారు. మంత్రి హరీశ్‌రావుకు పాజిటివ్ రావడంతో, 50 ఏళ్లు దాటిన ఎమ్మెల్యేలకు కరోనా గుబులు పట్టుకుంది. పూర్తిగా ఎయిర్ కండిషన్ వాతావరణంలో జరిగే ఈ సమావేశాలకు ఎలా హాజరు కావాలనేదాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అవసరమైనప్పుడు మాత్రమే హాల్‌లో ఉండి మిగిలిన సమయం టీవీ ముందు కూర్చుని వీక్షించాలనుకుంటున్నారు. ఎమ్మెల్సీలలో కరోనా భయం మరింతగా ఉంది. వృద్ధాప్య సమస్యలతోపాటు అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండడం ఇందుకు కారణం. కరోనా నెగెటివ్ అని నిర్ధారణ కాకపోతే సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేనందున అందరూ టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థతితులలో సమావేశాలకు ఎంతమంది హాజరవుతారనే చర్చ మొదలైంది. తొలి రోజు సెషన్ నలుగురు సభ్యుల సంతాప తీర్మానాలను ఆమోదం తెలపడానికి మాత్రమే పరిమితం కానుంది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, గన్‌మెన్, అసెంబ్లీ సిబ్బంది, మీడియా, ప్రభుత్వ అధికారులు, డ్రైవర్లు.. ఇలా అన్ని సెక్షన్లవారికీ ఆవరణ ణలో తిరగకుండా కొత్త ఆంక్షలు రూపొందించారు. ఎమ్మెల్సీలలో కరోనా భయం మరింత ఎక్కువగానే ఉంది. వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్యం, వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుండడం ఇందుకు కారణం. కరోనా నెగెటివ్ అని నిర్ధారణ కాకపోతే సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేనందువల్ల అందరూ టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది.
సమావేశాలు ఏకపక్షమేనా?
కరోనా పరిస్థితులకు తగినట్లుగా ఈ సమావేశాలకు ప్రభుత్వం సిద్ధపడింది. తాను చెప్పదల్చుకున్న అంశాలన్నింటిపై వివరణ ఇచ్చి సభ ఆమోదం పొందడంపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. విపక్షాలు లేవనెత్తే అంశాలకంటే తాను చెప్పదల్చుకున్న అంశాలపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎన్ని రోజులైనా సభ నిర్వహించడానికి సిద్ధమని కాంగ్రెస్ కంటే ముందుగానే ప్రకటన చేసినందువల్ల విమర్శించడానికి ఆస్కారం లేకుండా చేయగలిగింది. ఏయే అంశాలను ప్రభుత్వం ప్రస్తావించనుందీ, ఇప్పటికే సీఎం చూచాయగా పేర్కొన్నారు. తొలుత వాటికే ప్రాధాన్యం ఇచ్చి ఆ తర్వాత విపక్షాలు లేవనెత్తే అంశాలను వినే అవకాశం ఉంది. అనేక అంశాలను ప్రస్తావించాలని విపక్షాలు సిద్ధమవుతున్నా, వాటికి ఏ మేరకు అవకాశం ఉంటుందన్నది అనుమానమే. గత అనుభవాలతో పోల్చి చూసుకుంటే ఈ సమావేశాలు ఏకపక్షంగానే జరుగుతాయన్న అభిప్రాయం కాంగ్రెస్, బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. నాలుగు ఆర్డినెన్సులకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనుంది.
ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై ప్రధాన ఫోకస్..
దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ప్రభుత్వం తరఫున తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం పొందడం ఈ సమావేశాల్లో ఒక ప్రాధాన్యతాంశం. ఈ విషయంలో కాంగ్రెస్ సభ్యులకు కనీసం మాట్లాడే అర్హత కూడా లేదని అధికార పార్టీ సభ్యులు గట్టిగానే స్పందించే అవకాశం ఉంది. కరోనా కష్టకాలంలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనా రైతుబంధు సాయాన్ని మాత్రం ఆపలేదని, రైతుల్ని కష్టకాలంలో ఆదుకున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకోనుంది. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రైతులంగా నియంత్రిత సాగు విధానానికి అనుగుణంగా పంటలు వేసుకున్నారని నొక్కచెప్పనుంది. కరోనా విషయంలో మిగిలిన రాష్ట్రాలకంటే ఉత్తమంగా నియంత్రించగలిగామని, మృతుల సంఖ్యను పెరగకుండా చూశామని, వలస కార్మికులను మానవతా దృక్పథంతో ఆదుకున్నామని.. ఇలా అనేక అంశాలను ప్రస్తావించనుంది. కృష్ణా జలాల విషయంలో ప్రభుత్వాన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టడం, కేంద్రం క్రియాశీలక పాత్ర పోషించకుండా మౌనంగా ఉండడం, గతంలో కాంగ్రెస్ నాయకులు హంద్రీ-నీవా లాంటి ప్రాజెక్టులకు హారతి పట్టడం లాంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం ప్రస్తావించే అవకాశం ఉంది.
కరోనాపై కాంగ్రెస్ ప్రధాన విమర్శలు..
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించడానికి అవసరమైన అస్త్రశస్త్రాలను కాంగ్రెస్ సిద్ధం చేసుకుంది. గత సమావేశాల్లో కరోనాను ప్రస్తావించి మాస్కు గురించి మాట్లాడిన ఎమ్మెల్యే సీతక్క నోరు మూయించిన తీరులో సీఎం కామెంట్ చేయడం, ఇప్పుడు ఒకటిన్నర లక్షల కేసుల స్థాయికి చేరుకోవడం, దాదాపు 900 మంది చనిపోవడానికి కారణమవ్వడం, ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు సరైన సౌకర్యాలు లేకపోవడం.. ఇలాంటి అంశాలన్నింటినీ కాంగ్రెస్ సభ్యులు లేవనెత్తనున్నారు. పారాసిటమాల్ అనే కామెంట్ మొదలు ఇప్పుడు సభ్యులందరికీ తప్పనిసరి కరోనా పరీక్షల వరకు వచ్చిన పరిస్థితిని ప్రస్తావించనున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఇటీవల పలు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవల గురించి అధ్యయనం చేసిన అనుభవాలతో ప్రభుత్వాన్ని ఎండగట్టే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎత్తిచూపడానికి స్పీకర్ దగ్గరి నుంచి అధికార పార్టీ సభ్యుల వరకు ఆటంకాలు కల్పిస్తున్నారన్న అభిప్రాయంతో ఈసారి ఏ మేరకు సమయం దొరుకుతుందనే అనుమానమూ కాంగ్రెస్ సభ్యుల్లో ఉంది.
రెవెన్యూ చట్టంపైనే సర్వత్రా ఆసక్తి..
రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటూ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించిన సీఎం కేసీఆర్ కొత్త చట్టం వస్తుందని పేర్కొన్నారు. ఇటీవల చాలా మంది రెవెన్యూ అధికారులు, సిబ్బంది అవినీతి కేసుల్లో ఇరుక్కున్న అంశాలను ప్రస్తావించి కొత్త చట్టం గురించి సీఎం సుదీర్ఘంగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉంది. కొత్త చట్టం ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం సోమవారం రాత్రి మంత్రివర్గ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం లేదా రెవెన్యూ అధికారుల అధికారాలను కత్తిరించడం లాంటివాటికి ఆస్కారం ఉంది. ఒకరిద్దరు పంచాయతీ కార్యదర్శులతో ముఖ్యమంత్రి ఫోన్ చేసిన మాట్లాడిన వివరాలను ప్రభుత్వవర్గాలు ఉద్దేశపూర్వకంగానే బైటకు పంపించడంతో ఎలాంటి రియాక్షన్ వచ్చిందో బేరీజు వేసుకున్నాయి. ఆ మాటలను బట్టి ఇకపైన రెవెన్యూ అధికారాలకు కోత తప్పదనే గుసగుసలు ఆ శాఖలోనే వ్యక్తమవుతున్నాయి.
జీఎస్టీ విషయంలో కేంద్రంపై ఘాటైన వ్యాఖ్యలు?
జీఎస్టీ విషయంలో కేంద్ర వైఖరిపై స్వయంగా ముఖ్యమంత్రే ఘాటుగా వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది. ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలతో పాటు రాష్ట్రాల అధికారాలను, హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తూ సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని అసెంబ్లీ సాక్షిగా కామెంట్ చేసే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కరోనా కారణంగా సమావేశాలకు హాజరుకాలేని పరిస్థితుల్లో కరోనా కాలంలో ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాలకు కేంద్రం హెలికాప్టర్ మనీ, అప్పుల చెల్లింపుపై మారటోరియం, ఎఫ్ఆర్‌బీఎం పెంపుకు షరతులు విధించడం లాంటి అంశాల్లో స్వయంగా కేసీఆర్ మాట్లాడి కేంద్రాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. విపక్షాలు ప్రస్తావించే అప్పులు పెరగడం, ఉద్యోగుల పింఛన్లలో కోత పెట్టడం లాంటి అంశాలపైనా సీఎం ఘాటుగానే స్పందించే అవకాశం ఉంది.
మీడియాకు ఆంక్షలు..
కరోనా ఆంక్షలను ప్రస్తావిస్తూ మీడియాకు కఠినమైన ఆంక్షలనే అసెంబ్లీ స్పీకర్ విధించారు. గ్యాలరీ తప్ప ఆవరణలో ఎక్కడా తిరగకుండా నిషేధాజ్ఞలు అమలవుతున్నాయి. మీడియా పాయింట్‌ను సైతం ఎత్తేశారు అసెంబ్లీ అధికారులు. అసెంబ్లీ లాబీల్లోగానీ, పార్టీ శాసనసభాపక్ష కార్యాలయాల్లోకిగానీ వెళ్ళకుండా ఆంక్షలు విధించారు. ప్రతీ మీడియా సంస్థ నుంచి అసెంబ్లీకి ఒకరు, కౌన్సిల్‌కు ఒకరు చొప్పున మాత్రమే హాజరుకావాలంటూ జర్నలిస్టుల సంఖ్యను కుదించారు.
అసెంబ్లీలో నేడు..
అసెంబ్లీ సమావేశాల తొలి రోజు మొత్తం సంతాప తీర్మానాలకే పరిమితం కానుంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి తదితరులు ఇటీవల మరణించారు. వారికి సంతాప తీర్మానాలను ఆమోదించడంతో తొలి రోజు సమావేశాలు ముగుస్తాయి. ఈ సమావేశాలు ముఖ్యమంత్రి స్వయంగా కనీసంగా 15 రోజులు ఉండాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో నిర్దిష్ట షెడ్యూలు ఖరారు కానుంది. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ లాంటివాటిపైనా స్పష్టత రానుంది. కాంగ్రెస్ మాత్రం స్వల్పకాలిక చర్చలు, జీరో అవర్ లాంటివి ఉండాల్సిందేనన్న అభిప్రాయంతో ఉన్నాయి. ఏయే అంశాలకు ఎంత సమయం చర్చకు కేటాయించాలనే అంశంపైనా బీఏసీలో నిర్ణయం జరగనుంది. సాయంత్రం తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం, రాత్రి ఏడు గంటలకు ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరగనుంది.