సులభంగా ఫైల్స్ షేర్ చేసుకునే ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్

ఆండ్రాయిడ్ ఓఎస్‌ 'నియర్‌బై షేరింగ్', ఐఓఎస్‌ 'ఎయిర్ డ్రాప్' తరహాలో ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫైల్స్‌ బదిలీ చేసుకునే ఫీచర్‌

Update: 2024-01-22 11:30 GMT
సులభంగా ఫైల్స్ షేర్ చేసుకునే ఫీచర్ తీసుకొస్తున్న వాట్సాప్
  • whatsapp icon

దిశ, టెక్నాలజీ: ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు వినియోగదారులకు కొత్త ఫీచర్లను అందించడంలో ముందుంటుంది. గతేడాది వాట్సాప్ నుంచి హెచ్‌డీ ఫోటోలు, వీడియోలను పంపే సదుపాయం అందించిన ప్లాట్‌ఫామ్, తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆండ్రాయిడ్ ఓఎస్‌కు చెందిన 'నియర్‌బై షేరింగ్', ఐఓఎస్‌కు చెందిన 'ఎయిర్ డ్రాప్' తరహాలో సమీపంలో ఉన్నవారికి ఇంటర్నెట్‌తో పనిలేకుండా ఫైల్స్‌ను బదిలీ చేసుకునే ఫీచర్‌ను అందించనుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ పరీక్షల దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదివరకు చాలామంది ఫోటో, ఆడియో, వీడియో, డాక్యుమెంట్లను 'షేర్ చాట్' యాప్ ఉపయోగించి ఇతరులకు పంపేవారు. అయితే, వివిధ కారణాలతో ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించడంతో గూగుల్ తన యూజర్ల కోసం ఆండ్రాయిడ్ ఓఎస్‌లో నియర్‌బై షేర్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ఒకేసారి ఎక్కువమందికి ఫైల్స్ పంపించవచ్చు. ఇప్పుడు వాట్సాప్ సైతం అలాంటి ఆప్షన్‌తో 'పీపుల్ నియర్‌బై' పేరుతో ఫీచర్‌ను తీసుకురానుంది. యూజర్లకు సంబంధించిన వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి సమస్య లేకుండా ఇందులో ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్‌ వాబీటా ఇన్ఫో వెల్లడించింది.

Tags:    

Similar News