యావత్ ప్రపంచానికి సరికొత్త సవాల్.. విశ్వ రహస్యాల అన్వేషణలో కీలక ఘట్టం
వినీలాకాశంలోని అనంత నక్షత్రాల ఆవిర్భావం గురించి అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్ : వినీలాకాశంలోని అనంత నక్షత్రాల ఆవిర్భావం గురించి అన్వేషణ కొనసాగుతూనే ఉంది. అనంత విశ్వ రహస్యాలను అధ్యయనం చేయడమే అంతిమ లక్ష్యంగా ఆల్బర్ట్ ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ వంటి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ జీవితాల్నే త్యాగం చేశారు. తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన భారీప్రయోగం స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ మళ్లీ యావత్ ప్రపంచానికి ఓ సరికొత్త సవాల్ గా మారింది. ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా నుంచి స్పియరెక్స్ టెలిస్కోప్ అబ్జర్వేటరీను నాలుగు ఉపగ్రహాలతో కలిపి నాసా విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది.
488 మిలియన్ డాలర్ల వ్యయం
అంతరిక్షపు పూర్తి చిత్ర పటంను మానవాళికి అందించే ప్రధాన లక్ష్యంతో ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ పనిచేస్తుంది. ఈ అబ్జర్వేటరీతో పాటు అంతరిక్షంలోకి వెళ్లిన నాలుగు ఉపగ్రహాలు సూర్యుని ఉపరితల వాతావరణాన్ని అధ్యయనం చేస్తాయి. 488 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ దాదాపు 500 కేజీ ల బరువు ఉంటుంది. కోన్ ఆకారంలో ఉండే ఈ అబ్జర్వేటరీ పరారుణ కిరణాల సాయంతో అందమైన అంతరిక్షాన్ని పరిశీలిస్తూ ఆరు నెలలకొకసారి తాను దర్శించిన ఖగోళ పటానికి సంబంధించిన 3డీ చిత్రాన్ని రూపొందిస్తుంది. ఈ టెలిస్కోప్ అబ్జర్వేటరీ అందించే ఖగోళ సమాచారం విశ్లేషణలో జేమ్స్ వెబ్ టెలిస్కోప్, హబుల్ టెలిస్కోప్ లు కూడా సహాయకారిగా ఉండబోతున్నాయి. స్పియరెక్స్ అబ్జర్వేటరీ రెండు సంవత్సరాల పాటు అంతరిక్షంలో తన విధులను నిర్వర్తిస్తూ విశ్వానికి సంబంధించిన సమగ్ర ఖగోళ సమాచారంతో పాటు, బిగ్ బ్యాంగ్‌కు సంబంధించిన ఎన్నో రహాస్యాల గుట్టును విప్పనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిలోని పరారుణ డిటెక్టర్‌లను రక్షించడానికి -210 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఉంచారు. మానవ కండ్లు సైతం చూడలేని అదృశ్య రంగులను కూడా స్పియరెక్స్ పసిగడుతుంది. స్పియరెక్స్ అందించే అంతరిక్ష చిత్రపటం ద్వారా నక్షత్రాల, గ్రహాల అంతర్గత నిర్మాణంతో పాటు ముఖ్యంగా ఖగోళంలో నీటి వనరులు ఎక్కడైనా వున్నాయా అన్నది సూక్ష్మంగా అధ్యయనం చేయనున్నారు.