5జీ వచ్చినా వేధిస్తోన్న సెల్ సిగ్నల్స్.. సమస్యకు కారణం ఇదే!

కాలం మారుతున్నది. టెక్నాలజీ 5జీ లోకి వచ్చింది. అయినా ఫోన్లకు మాత్రం సిగ్నల్స్ అందడం లేదు. 3జీ నుంచి 4జీలోకి, ఇపుడు 5జీ లోకి వచ్చినప్పటికీ పెద్ద పెద్ద నగరాల్లో సైతం ప్రస్తుతం

Update: 2022-10-08 23:45 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కాలం మారుతున్నది. టెక్నాలజీ 5జీ లోకి వచ్చింది. అయినా ఫోన్లకు మాత్రం సిగ్నల్స్ అందడం లేదు. 3జీ నుంచి 4జీలోకి, ఇపుడు 5జీ లోకి వచ్చినప్పటికీ పెద్ద పెద్ద నగరాల్లో సైతం ప్రస్తుతం సెల్‌ఫోన్ యూజర్లు కాల్ డ్రాప్ లేదా, కాల్ జంప్, మాట్లాడుతున్న మధ్యలోనే కాల్ కట్ అవ్వడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీంతో కంపెనీలు 4జీనే సరిగా అందించలేకపోతున్నాయంటూ యూజర్లు విమర్శిస్తున్నారు. నగరాలతో పాటు ఇప్పటికీ కొన్ని పల్లెల్లో అసలు ఇంటర్‌నెట్ సౌకర్యం లేకపోవడం, సిగ్నల్స్ కోసం మిద్దెలు, చెట్లు ఎక్కాల్సిన పరిస్థితులు దర్శనమిస్తుండడం గమనార్హం. సిగ్నల్స్ 5జీకి కన్వర్ట్ అవుతున్న తరుణంలోనూ ఇలాంటి సమస్యలు మరింత తలెత్తడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

తగ్గిన టవర్స్.. పెరిగిన యూజర్స్

ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకు ప్రధాన కారణంగా వినియోగం మేర టవర్స్ లేకపోవడమేనని తెలుస్తున్నది. మరోవైపు కొన్ని టవర్లు ఎపుడో నిర్మించడం వాటి మెయింటె నెన్స్‌ను పట్టించుకోకపోవడంతోనూ అవి ఆశించిన మేర సిగ్నల్స్‌ను అందించడంలేదు. ఇందుకు మరో కారణం టవర్స్ లేకపోవడం, కొత్తవి నిర్మించకపోవడం, వినియోగదారులు పెరగడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇకపోతే కంపెనీల ఆఫర్లతో బహిరంగ మార్కెట్లో సిమ్‌ల విక్రయాలు యథేచ్చగా ఉండడంతో సిగ్నల్ ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం కూడా కాల్ డ్రాప్, జంప్‌నకు ప్రధాన కారణంగా ఉన్నాయని సైబర్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. దీంతో కాల్ మాట్లాడుతున్నప్పుడు, లేదంటే కట్ అవ్వడం ఎందుకు జరుగుతున్నదోనని కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కస్టమర్లు పెరుగుతున్న సమయంలో కంపెనీలు టవర్స్‌ను పెంచడం, సిగ్నల్ ఫ్రీక్వెన్సీని పెంచాల్సి ఉంది. కానీ నెట్‌వర్క్ కంపెనీలు ఈ చర్యలను తీసుకోకపోవడంతోనే రోజురోజుకు ఈ సమస్య మరింత జఠిలం అవుతుంది.

ఏఆర్‌పీయూ ఉన్నా మెయింటెనెన్స్ చేయట్లే!

ప్రస్తుతం ఎదుర్కొంటున్న కాల్ డ్రాప్, కాల్ జంప్, కట్ అవ్వడం లాంటి సమస్యను కంపెనీలకు గతంలో ఏఆర్ పీయూ (ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్) ఛార్జీలు సరిపడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ మేరకు 2016కు ముందు నెలకు రూ.300గా ఉన్న ఛార్జీ రూ.100 కు పడిపోయింది. అయితే ప్రస్తుతం ఏఆర్‌పీయూ రూ.170 నుంచి రూ.200 వరకు వస్తున్నది. సబ్‌స్ర్కైబర్స్ బేస్ పెరగడంతో ఏఆర్‌పీయూ కూడా పెరిగింది. అయినప్పటికీ కంపెనీలు మాత్రం సిగ్నల్‌ను అందించడానికి చర్యలు తీసుకోవడంలేదు. దీంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్య తీవ్రమవుతున్నది. కాల్ డ్రాప్‌కు జరిమానా ఉన్నప్పటికీ టెలికమ్ కంపెనీలు అవేమీ పట్టించుకోకుండా తమ ఇష్టారీతిన వ్యవహరించడం వలన సమస్యకు పరిష్కారం లభించడంలేదు.

5జీతో కొంత మేలు..

సిగ్నల్ సమస్య, టవర్లు లేకపోవడంతో పాటు 4జీ నెట్‌వర్క్‌లో ఒకేసారి ఫోన్లు, ఇంటర్‌నెట్‌కు సరిపడా కెపాసిటీ అందివ్వలేదు. ఈ కారణంతోనే ప్రస్తుతం సమస్య వస్తున్నది. అయితే 5జీ కొన్నిప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే దాదాపు ఏడాది సమయం పడుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం 4జీలో ఉన్న సమస్యలు 5జీ రాకతో కొంత మెరుగు పడుతాయని చెబుతున్నారు. దీంతో పాటు నగరాల్లో కాంక్రీట్ బిల్డింగులు నిర్మాణాలను మధ్యలో గ్యాప్ లేకుండా నిర్మిస్తుండడం వలన కూడా సిగ్నల్ సమస్య వస్తున్నట్టు చెబుతున్నారు.

కంపెనీలు విస్తరణకు పెట్టుబడి పెట్టట్లే -నల్లమోతు శ్రీధర్, సైబర్ ఎక్స్ పర్ట్

నెట్‌‌వర్క్ కంపెనీలు వినియోగదారులకు అవసరమైన సిగ్నల్స్ ఇచ్చే అంశంపై దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా నెట్‌‌వర్క్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కంపెనీలకు ఏఆర్ పీయూ పెరుగుతున్నా విస్తరణకు పెట్టుబడులు పెట్టడం లేదు. మరోవైపు స్పెక్ట్రమ్ వేలం, ఖర్చు నేపథ్యంలో కంపెనీలు కూడా ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. మరోవైపు కాంక్రీట్ బిల్డింగ్‌లు మధ్యలో గ్యాప్ లేకుండా నిర్మించడంతోనూ సిగ్నల్ సమస్యలు ఏర్పడుతున్నాయి.

Tags:    

Similar News