2025లో ప్యూర్ ఈవీ కంపెనీ ఐపీఓ.. ప్రకటించిన ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ బ్రాండ్
దిశ, వెబ్‌డెస్క్: ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ ప్యూర్ ఈవీ వచ్చే ఏడాది స్టాక్‌మార్కెట్లోకి ప్రవేశించనుంది. 2025లో తమ కంపెనీ ఐపీఓని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోందని ప్రకటించింది. తమ సంస్థకు స్థిరమైన ఆర్థిక మూలాలున్నాయని, మూడేళ్లుగా సమగ్రమైన నిర్వహణ లాభాలను సాధించడమే కాకుండా FAME సబ్సిడీలపై, ప్రభుత్వ రాయితీలపై ఆధారపడకుండా నగదు చెల్లింపులను సజావుగా చేస్తున్నామని ప్యూర్ ఈవీ వెల్లడించింది. అంతేకాకుండా 85% వాటాను కలిగి ఉన్న కంపెనీ ప్రమోటర్లు, ఆపరేటింగ్ స్థాయిలో స్థిరమన లాభాలను అందుకుంటున్నారని, ఈ రకంగా అన్ని విధాలుగా తమ కంపెనీ వేగంగా ముందుకు వెళుతుండడం వల్ల నాట్కో ఫార్మా ఫ్యామిలీ ఆఫీస్, లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ ఆఫీస్, హెచ్ టీ వెంచర్స్, బీసీసీఎల్, యూఈపీఎల్, ఐ-టీఐసీ, ఐఐటీ హైదరాబాద్‌తో సహా ప్రముఖ పెట్టుబడిదారులు మద్దతు వల్ల మార్గెట్లో అగ్రగామిగా ఉన్నామని చెప్పారు. అందుకే ఇప్పుడు స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నామని ప్యూర్ ఈవీ ప్రకటించింది. అంతేకాకుండా వచ్చే ఐదేళ్లలో 100 రెట్లు వృద్ధి సాధించే కంపెనీల జాబితాలో తాము రెండో స్థానంలో ఉన్నామని, రాబోయే నాలుగేళ్లల్లో 20 రెట్లు టర్నోవర్ సాధించే అంచనాలతో ప్యూర్ ఈవీ ముందుకెళుతోందని చెప్పింది.
తమ కంపెనీ ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్‌తో ఇప్పటికే భాగస్వామిగా ఉందని, అలాగే యూకేలోని కోవెంట్రీకి చెందిన పీడీఎస్ఎల్ అనే ఓ ఇంజినీరింగ్ సంస్థతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ కోసం ఒప్పందం కుదుర్చుకున్నామని, దాని ద్వారా 2026 ఆర్థిక సంవత్సరం నాటికి బ్యాటరీ పరంగా మరిన్ని అద్భుతమైన ఆవిష్కరణలు చేయబోతున్నామని వెల్లడించింది.
ఇక ఈ విషయంపై ప్యూర్ ఈవీ యొక్క సీఈవో రోహిత్ వదేరా మాట్లాడుతూ 2025 భారత్ ఎలక్ట్రానిక్ విప్లవంలో భాగస్వామ్యం కావడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. నూతన ఆవిష్కరణలు, నైపుణ్యం, స్థిరత్వం పట్ల తాము ఎంతో నిబద్ధతతో ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా AI ఆధారిత సాంకేతికత, పనితీరు, సామర్థ్యంపై దృష్టి సారించడంతో మోటార్‌సైకిల్ విభాగంలో గణనీయమైన వాటాను పొందగలమనే నమ్మకం తమకుందనిొ రోహిత్ అన్నారు. ప్రతిభావంతులైన బృందం, పెట్టుబడిదారుల మద్దతుతో, తాము కేవలం వాహనాలను విక్రయించడం మాత్రమే కాదని, తాము తమ కమ్యూనిటీలతో పాటు సమాజానికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.
‘‘ప్రస్తుతం ప్యూర్ ఈవీ, EV విభాగంలో ప్రాంతీయ రవాణా కార్యాలయ స్థాయిలో సుమారు 7% మార్కెట్ వాటాను కలిగి ఉంది. భారతదేశంలోని టైర్-1, టైర్-2 నగరాలన్నింటిలో ప్యూర్ ఈవీ విస్తరించాలనే ఆశయంతో ఉన్నాం. ఇప్పటికే భారతదేశంలో విక్రయించే ద్విచక్ర వాహనాలలో 65% వాటా ప్యూర్ ఈవీ మోటార్‌సైకిళ్లదే. రాబోయే ఐదేళ్లలో 100 రెట్లు విస్తరిస్తాం.’’ అని రోహిత్ అన్నారు.
సాంకేతికత అభివృద్ధి చెందడం, బ్యాటరీ ధరలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నందున, ప్యూర్ ఈవీ ఈ ట్రెండ్లను ప్రభావితం చేయడానికి వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తున్నామని, వినూత్న ఆఫర్లు, వేగవంతమైన మార్కెటింగ్, బ్రాండింగ్ వంటి వ్యూహాలతో తమ డీలర్స్ నెట్‌వర్క్‌ని విస్తరించడానికి ప్రయత్నిస్తున్నామి ప్యూర్ ఈవీ తెలిపింది. అంతేకాకుండా స్కూటర్లు, మోటార్‌సైకిళ్ల అమ్మకాలను వేగవంతం చేస్తామని, రాబోయే నాలుగేళ్లల్లో ప్యూర్ ఈవీ రూ.2000 కోట్ల టర్నోవర్‌ను చేరుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొంది. ఇక ఈ మధ్యనే తమ కంపెనీ నుంచి విడుదలైన రెండు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్నాయని అన్నారు.