మొక్కల ముచ్చట్లు.. తొలిసారిగా లైవ్‌లో రికార్డయ్యాయి
దిశ, నేషనల్ బ్యూరో : మొక్కలు సజీవమైనవని మనకు తెలుసు. అవి పెరుగుతాయని మనకు తెలుసు.
దిశ, నేషనల్ బ్యూరో : మొక్కలు సజీవమైనవని మనకు తెలుసు. అవి పెరుగుతాయని మనకు తెలుసు. అయితే మనుషుల్లాగే మొక్కలు కూడా పరస్పరం ఒకదానితో ఒకటి ముచ్చట్లు పెట్టుకుంటాయని, కబుర్లు చెప్పుకుంటాయని తొలిసారిగా వెలుగుచూసింది. జపాన్‌లోని సైతామా యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసత్సుగు టయోటా నేతృత్వంలోని శాస్త్రవేత్తల టీమ్ ఈవిషయాన్ని గుర్తించింది. మొక్కలు వాటిదైన సొంత శైలిలో ఒకదానితో ఒకటి మాట్లాడుకోవడాన్ని కెమెరాలో రికార్డు చేశారు. కీటకాలు లేదా ఇతరత్రా విపత్కర పరిస్థితుల వల్ల ముప్పు ఎదురైనప్పుడు మొక్కలు అస్థిర కర్బన సమ్మేళనాలను రిలీజ్ చేస్తాయని గుర్తించారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించాయి. ఆ వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్‌లో కెమెరాలో రికార్డయింది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్‌లో పబ్లిష్ అయింది.