ఇద్దరు ఏలియన్స్‌తో నా ముచ్చట్లు.. అమెరికా మాజీ సైనికుడి కీలక ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి నెలవైన అమెరికాలోని ప్రజల్లో చాలామంది ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతుంటారు.
దిశ, నేషనల్ బ్యూరో : ఎంతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీకి నెలవైన అమెరికాలోని ప్రజల్లో చాలామంది ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతుంటారు. వాటి గురించి రకరకాల కథలు అక్కడ ప్రచారంలో ఉన్నాయి. అమెరికా ఆర్మీకి చెందిన మాజీ హెలికాప్టర్ పైలట్ అలెక్స్ కొలియర్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయన తాజాగా ఒక వింత వాదనను తెరపైకి తెచ్చారు. తాను 1980వ దశకంలో ఏలియన్లను కలిసి మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. తాను కలిసిన ఏలియన్ల పేర్లు.. విసయుస్, మోరోఅనే అని వెల్లడించారు. ఆ ఇద్దరు ఏలియన్లు తనను చాలా పెద్ద అంతరిక్ష నౌకలో తీసుకెళ్లారని అలెక్స్ వివరించారు. ‘‘స్పేస్ షిప్‌లో వెళ్తూ నేను ఏలియన్లతో కులాసాగా ముచ్చట్లు పెట్టాను. అమెరికా టెక్నాలజీ గురించి అభిప్రాయం చెప్పండని వాళ్లను అడగగా.. తమ కంటే 400 ఏళ్లు అడ్వాన్స్‌డ్‌గా అమెరికా ఉందని ఒక ఏలియన్ బదులిచ్చింది. ఆ స్పేస్ షిప్‌లో నేను ఏలియన్లతో కలిసి మూడునెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించాను. అది భూమిపై సమయానికి కేవలం 18 నిమిషాలతో సమానం’’ అని ఆయన తెలిపారు. ‘‘విశ్వంలో మనుషులు ఒంటరిగా లేరు. మనుషులకు తోడుగా అనేక ఇతర గ్రహాంతర జీవులు కూడా ఉన్నాయని ఏలియన్లు నాకు స్పష్టంగా చెప్పాయి’’ అని అలెక్స్ చెప్పారు. బాల్యంలో 1960వ దశకంలో అమ్మమ్మ ఇంట్లో దాగుడుమూతల గేమ్ ఆడుకుంటుండగా.. ఒక చీకటి గదిలోకి వెళ్లి దాక్కున్నప్పుడు కూడా ఏలియన్లు కనిపించారని ఆయన పేర్కొన్నారు. ఏలియన్స్‌కు సంబంధించిన అవశేషాలు త్వరలోనే ఏదో ఒకచోట మనుషులకు లభించడం ఖాయమని అలెక్స్ అభిప్రాయపడ్డారు.