ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు? ఎవరు చేస్తారు? ట్యాపింగ్ చేయడానికి ఏమేమి అవసరం?
గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చ నడుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చ నడుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం చట్టవిరుద్ధంగా ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖుల ఫోన్లపై ఎస్ఐబీ అధికారులు నిఘా పెట్టారన్న కేసులో అనేక ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం.
ఫోన్ ట్యాపింగ్ కి హ్యాకింగ్ కి తేడా ఏంటి?
ఎదుటి వ్యక్తి అనుమతి లేకుండా వారి ఫోన్ సంభాషణలను రహస్యంగా వినడాన్ని ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఫోన్ ట్యాపింగ్ లో కేవలం ఎదుటి వారు మాట్లాడే సంభాషణలు మాత్రమే వినగలిగే అవకాశం ఉంటుంది. హ్యాకింగ్ అనేది అడ్వాన్స్ లెవల్ టెక్నాలజీ. స్మార్ట్ ఫోన్ లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లలో యాప్ లను ఇన్ స్టాల్ చేయడం ద్వారా ఫోన్ ను పూర్తిగా వారి కంట్రోల్ లోకి తీసుకోవడాన్ని హ్యాకింగ్ అంటారు. వీటి కోసం ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్లు ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ లో ఏదైనా మొబైల్ నెంబర్ పై నిఘా పెట్టాలనుకుంటే ఆ నెంబర్ ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ ను సాఫ్ట్ వేర్ ల ద్వారా వింటుంటారు.
అఫీషియల్ ట్యాపింగ్ ఎవరు చేస్తారు?
ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టడంతో పాటు వాటిని రికార్డు చేసి ఈ సమాచారాన్ని కంప్యూటర్లలో స్టోర్ చేయవచ్చు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం పరిధిలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. అయితే అత్యవసర సమయంలో హోంశాఖలోని జాయింట్ సెక్రెటరీ స్థాయి లేదా ఆ పై స్థాయి అధికారి అనుమతితో ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయవచ్చు. ఫోన్ కాల్ రికార్డు లేదా ఇంటర్ సెప్ట్ చేసే అధికారం కేంద్ర ప్రభుత్వం పది సంస్థలకు ఇచ్చింది. ఇందులో ఇంటెలిజెన్స్ బ్యూరో,సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనరేట్ వారికి ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుంది.
ట్యాపింగ్ ఎందుకు చేస్తారు..?
అసలు ఫోన్ ట్యాపింగ్ చేయడం చట్టవిరుద్ధం. ఇది అన్ని సందర్భాల్లో చేయరు. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ప్రభుత్వానికి సరైన కారణాలు ఉండాలి.శాంతి భద్రతల పరిరక్షణ, ఉగ్రవాద చర్యలు లాంటి కారణాలతో అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటారు. చట్టానికి లోబడి సంబంధిత సర్వీస్ ప్రొవైడర్ ఈ అవకాశాన్ని కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా దాదాపుగా 9 వేల ఫోన్ల ట్యాపింగ్‌కు ఉత్తర్వులు ఇస్తున్నట్లు సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ అండ్ లా సెంటర్ సంస్థ గతంలో తెలిపింది.
ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు?
చట్టపరంగా ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు మూడు నుంచి నాలుగు వర్క్ స్టేషన్లు, డెస్క్ టాప్ మానిటర్లు, హెడ్ ఫోన్లు అవసరపడతాయి. ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు సరిపడా సర్వర్లు, రికార్డింగ్ పరికరాలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందజేసే కేబుల్స్ ఉండాలి. వీటి ద్వారా అధికారులు తమకు కావాలనుకున్న వారి సంభాషణలను రికార్డు చేస్తారు. వీటి కోసం ఉపయోగించే ఒక్కో సర్వర్ ఖరీదు సుమారు రూ.10 నుంచి 15 లక్షల వరకూ ఉంటుంది. వీటితో పాటు స్టింగ్ రే పరికరాలు ఉపయోగించి కూడా ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. స్టింగ్ రే పరికరాలు ఫోన్ సిగ్నళ్లను డిజేబుల్ చేసి సురక్షితం కాని 2జీ నెట్వర్క్ లోని వెళ్లేలా చేస్తాయి. అలా వెళ్ళగానే సులభంగా ట్యాప్ చేస్తాయి. ప్రతి రెండు నెలలకోసారి ప్రభుత్వం అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉగ్రవాదులు, మిలిటెంట్ల విషయంలో అనుమతి తీసుకోకుండానే 72 గంటల పాటు నిఘా సంస్థలు ఒక ఫోన్ ను ట్యాప్ చేయవచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తే 48 గంటల్లో ఆ ఫోన్ సంభాషణలను ధ్వంసం చేయాల్సి ఉంటుంది.
ట్యాపింగ్ గుర్తించడం ఎలా?
ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ కు గురవుతుంది తెలుసుకోవడం దాదాపు అసాధ్యం అని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. గతంలో ల్యాండ్ లైన్ లు ఉపయోగించిన సమయంలో ఫోన్ ట్యాప్ చేసి ఎదుటి వారి కాల్స్ వింటుంటే ఒక రకమైన బజ్ సౌండ్ వచ్చేదని కానీ ప్రస్తుతం పూర్తిగా హెచ్ డీ క్వాలిటీతో కాల్స్, హై డెఫినేషన్ ఆడియో వింటున్నందునా ఇంటర్సెప్షన్ ఎదైనా చేసినా ఏమాత్రం డౌట్ రాకుండా కాల్ రికార్డు లేదా ట్యాప్ అవుతుంది అని అవతలి వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎవరైనా నా ఫోన్ ట్యాప్ అవుతున్నది అని అంటే దానిని ఆధారాలతో నిరూపితం అయ్యే వరకు అనుమానంగానే పరిగణించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ చట్టాలు..
కాల్స్‌ను రికార్డు చేయడానికి లేదా ఇంటర్‌సెప్ట్ చేయడానికి కేంద్రంలో కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం విషయంలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి తప్పనిసరి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్- 1885 ప్రకారం ఫోన్ ట్యాపింగ్ గురించి చెబుతోంది. ఈ చట్టంలోని సెక్షన్ - 5(2) ప్రకారం దేశసార్వభౌమత్వం, సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజల శ్రేయస్సు లాంటి అంశాల్లో రాష్ట్రం లేదా కేంద్రం ట్యాపింగ్ చేసే వీలు ఉన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000లోని సెక్షన్ 69 కూడా ట్యాపింగ్ కు సంబంధించి పలు అంశాల చెబుతోంది. ట్యాపింగ్ చేయాలనుకునే ప్రభుత్వం చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రైవేట్ వ్యక్తుల నిఘా
ప్రైవేటు వ్యక్తులు, ప్రైవేట్ సంస్థలు కూడా ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్ వేర్లతో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ సంస్థలతో పాటు కొన్నిసార్లు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు సైతం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడే అవకాశాలు ఉంటాయి. 2001 నుంచి 2006 మధ్య కాలంలో మన దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేతలైన ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులైన పీయూష్ గోయల్, ప్రమోద్ మహాజన్ లాంటి వారి ఫోన్లను ఓ ప్రముఖ కార్పొరేట్ దిగ్గ సంస్థ ట్యాప్ చేసినట్లు కథనాలు వచ్చాయి. 2013లో బెంగళూరుకు చెందిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్, సాఫ్ట్ వేర్ డెవలపర్ ఇలానే అరెస్ట్ అయ్యారు. ఆయన ఓ ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ తో వందల మందిపై నిఘా పెట్టారు. ఆయన సేవలను వినియోగించుకున్న వారిలో పారిశ్రామిక వేత్తలతో పాటు సామాన్యుల వరకూ ఉన్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. ఇటీవల ఇజ్రాయేల్ స్పైవేర్‌తో భారత్‌లోని ప్రముఖ రాజకీయ నాయకులు, మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులపై నిఘా పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ సాఫ్ట్ వేర్ పై రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఆరోపణలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కు శిక్షలు
చట్టవ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడితే ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 26 (బి) ప్రకారం గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు. అంతే కాదు బాధితులు తమ ప్రైవసీ హక్కును ఉల్లంఢించారని కోరుతూ మానవ హక్కుల కమిషన్ ను కూడా ఆశ్రయించవచ్చు.