ఫోన్ పోయిందా? అయితే ఇక నో టెన్షన్..! ఇలా చేస్తే మీ ఫోన్ మీ చేతికి వస్తుంది!
స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త. ఇక మీదట ఫోన్‌ను పోగొట్టుకున్న లేదంటే ఎవరైనా దొంగలించినా కూడా మీ ఫోన్ తిరిగి పొందడం చాలా సులువు కానుంది.
దిశ, వెబ్‌డెస్క్: స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త. ఇక మీదట ఫోన్‌ను పోగొట్టుకున్న లేదంటే ఎవరైనా దొంగలించినా కూడా మీ ఫోన్ తిరిగి పొందడం చాలా సులువు కానుంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకుని బాధపడుతున్నారు. తిరిగి తమ ఫోన్‌ను ఎలా పొందాలో తెలియక సతమతం అవుతున్నారు. ముఖ్యమైన ఫొటోలు, వీడియోలు, డేటా పోయిందని బాధపడిన సందర్భాలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చిన కూడా పోయిన ఫోన్ దొరుకుతుందనే గ్యారెంటీ లేదు. దేశవ్యాప్తంగా ఫోన్ దొంగతనాలు కూడా ఎక్కువ అయ్యాయి. అవాంఛనీయ సంఘటనలకు దొంగిలించిన ఫోన్లు వాడటం ఈ మధ్య కాలంలో పెరిగిపోయింది.
ఈ సమస్యలను ఎలాగైనా పరిష్కరించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ‘సంచార్ సాథి’ పోర్టల్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఫోన్ పోగొట్టుకున్న వారు సులభంగా తమ ఫోన్‌ను తిరిగి పొందవచ్చు. 'సంచార్ సాథీ' వెబ్‌పోర్టల్‌ను సెంటర్ ఫర్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్(CDOT) రూపొందించింది. ఈ పోర్టల్ ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కర్ణాటక సహా కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో అందుబాటులో ఉండగా ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. అధికారిక ప్రకటన ప్రకారం, మే 17 నుంచి ఈ పోర్టల్ అందుబాటులో ఉంది.
పోయిన ఫోన్‌ను తిరిగి పొందడానికి www.sancharsaathi.gov.inని సందర్శించాలి. ఈ సైట్‌లో కొన్ని ముఖ్యమైన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పేపర్స్ ఎంటంటే.. పోయిన ఫోన్ IMEI నెంబర్, ఎఫ్‌ఐఆర్ నెంబర్, మొబైల్ ఫోన్ ఇన్‌వాయిస్, ఆధార్ నెంబర్ లేదా ఇతర వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డు.
‘సంచార్ సాథి’ పోర్టల్‌న ఉపయోగించే విధానం..
* ముందుగా ఫోన్ పోయిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎఫ్‌ఐఆర్ నెంబర్ తీసుకోవాల్సి ఉంటుంది.
* https://ceir.sancharsaathi.gov.in/Home/index.jsp పోర్టల్‌లోకి వెళ్లాలి. అక్కడ దొంగిలించిన/ పోగొట్టుకున్న మొబైల్ బ్లాక్ చేయడం, దొరికిన మొబైల్‌ను అన్‌బ్లాక్ చేయడం, రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడం వంటి ఆప్షన్స్ ఉంటాయి.
* దానిలో Request for blocking Lost/Stolen Mobile అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
* ఆ తరువాత ఆ పేజీలో ఇచ్చిన ఆప్షన్స్ ఆధారంగా మొబైల్ నెంబర్, IMEI నెంబర్, ఫోన్ బ్రాండ్ పేరు, ఫోన్ పోయిన ప్లేస్, తేదీ, FIR నెంబర్ వివరాలు ఎంటర్ చేసి FIR కాపీని సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
* తర్వాత, పేరు, చిరునామా, ప్రభుత్వ గుర్తింపు కార్డు నెంబర్ ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాలి.
* మొబైల్ నంబర్ OTP నమోదు చేసి డిక్లరేషన్ బాక్స్‌పై క్లిక్ చేసి, సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
* తర్వాత ఫోన్ బ్లాక్ చేయబడుతుంది.
ఒకవేళ ఫోన్ దొరికినట్లయితే తిరిగి దానిని అన్‌బ్లాక్ చేయడానికి కంప్లైంట్ నెంబర్ ఎంటర్ చేసి సైట్‌లో పేర్కొన్న విధంగా ప్రాసెస్ చేస్తే, ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది.