ఉద్యోగులు కంపెనీ నుంచి ఎప్పుడు వెళ్లిపోతారో చెబుతున్న AI..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుండి, AI కి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.
దిశ, ఫీచర్స్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినప్పటి నుండి, AI కి సంబంధించిన కొన్ని కొత్త విషయాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ప్రజల ఉద్యోగాలకు ముప్పుగా మారబోతోందని కొన్నిసార్లు మనం వింటూనే ఉన్నాము. కానీ ఇప్పుడు AI ఉద్యోగి ఎప్పుడు ఉద్యోగం నుంచి నిష్క్రమించబోతున్నాడో అంచనాలు వేయనుందని వెలుగులోకి వచ్చింది. ఇటీవల కొంతమంది జపనీస్ పరిశోధకులు కలిసి AI సాధనాన్ని సిద్ధం చేశారు. ఈ AI టూల్ కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగి ఎప్పుడు ఉద్యోగం నుంచి నిష్క్రమించబోతున్నాడో ముందుగానే గుర్తిస్తుందట. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా.. మరి అది ఎలా సాధ్యమో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ అధునాతన AI సాధనాన్ని ఎవరు సిద్ధం చేశారు ?
ఇంతటి అధునాతన సాధనాన్ని సిద్దం చేసేందుకు టోక్యో సిటీ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ నరుహికో షిరాటోరి ఒక స్టార్టప్‌తో చేతులు కలిపారని నివేదికలు చెబుతున్నాయి.
ఈ AI సాధనం ఎలా పని చేస్తుంది ?
ఈ AI టూల్ ఉద్యోగి లీవ్ తీసుకునే విధానాలు, ఉద్యోగుల హాజరు వంటి అనేక అంశాలను అంచనా వేస్తుందట. కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల డేటాను అధ్యయనం చేయడం ద్వారా నివేదికలను సిద్ధం చేస్తుందట. ఈ అడ్వాన్స్‌డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఇప్పటికే మేనేజర్‌లకు టీమ్‌లోని ఏ వ్యక్తి ఉద్యోగం మానేయాలని ఆలోచిస్తున్నాడో తెలుపుతుందట. దీని ద్వారా కంపెనీల నుంచి ఉద్యోగం మానేసే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలిస్తే మేనేజర్లు ఉద్యోగితో మాట్లాడగలరు, జట్టు సభ్యులు కూడా ఉద్యోగిని ఆపగలరని అంచనా.