భూమి కింద సొరంగమార్గం.. 250 సంవత్సరాల నాటి రహస్యం వెల్లడి..
భూమి కింద ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి.
దిశ, ఫీచర్స్ : భూమి కింద ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ఇవి తరచుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తెలియకుండానే శాస్త్రవేత్తలు లేదా సాధారణ వ్యక్తులు వందల లేదా వేల సంవత్సరాల నాటి రహస్యాలను బహిర్గతం చేసే కొన్ని పనులను చేస్తూ ఉంటారు. బ్రిటన్‌లోని స్టాక్‌టన్ నగరంలో అలాంటిదే జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, తెలియకుండా ఒక రహస్య గది తలుపు తెరిచాడు. ఇది వందల సంవత్సరాల నాటి రహస్యాన్ని వెల్లడించింది. ఆ వ్యక్తి ధైర్యం కూడగట్టుకుని ఆ రహస్య ద్వారంలోకి ప్రవేశించి ఆశ్చర్యపోయానని చెప్పాడు.
వ్యక్తి పేరు జెఫ్ హైఫీల్డ్. అతడికి 56 ఏండ్లు. ది సన్ నివేదిక ప్రకారం, జెఫ్ ఇటీవల ఇంగ్లాండ్‌లోని స్టాక్‌టన్‌లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అక్కడ అతను విలాసవంతమైన కార్యాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ శుభ్రపరిచే సమయంలో అతను ఒక రహస్య తలుపును చూశాడు. దాని లోపల సొరంగాలను చూశాడు. ఆ సొరంగం లోపల చాలా రహస్య గదులు కూడా ఉన్నాయి. ఆ రహస్య గదులు 5-5 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయని జెఫ్ చెప్పాడు. అవి ఆర్మీ బ్యారక్‌లా కనిపించాయి.
సొరంగాలు 250 ఏళ్ల నాటివి..
జెఫ్ తన ఇంటి లోపల కనిపించే సొరంగాలు, సెల్లార్‌లను చూసిన తర్వాత కొంచెం భయపడ్డాడు. ఆ తర్వాత దాని గురించి చరిత్రకారులతో మాట్లాడాడు. తాను కనుగొన్న సొరంగాలు 10-20 ఏళ్ల నాటివి కావని 250 ఏళ్ల నాటివని, ఈ సొరంగాలు నగరం అంతటా విస్తరించి ఉన్నాయని చెప్పారు. కొన్ని సొరంగాలు నదులకు కూడా దారితీస్తాయని తెలిపారు. చరిత్రకారుల ప్రకారం పూర్వం ప్రజలు సొరంగాలలో నిర్మించిన ఆ గదులలో నివసించేవారట. కానీ కాలక్రమేణా విలాసవంతమైన భవనాలు నిర్మించి అక్కడ నివసించడానికి వెళ్ళారట.
సొరంగాలు ఎందుకు నిర్మించారు ?
ఈ సొరంగాలకు సంబంధించి అనేక ఇతర వాదనలు ఉన్నాయి. ఈ సొరంగాలు అక్రమ రవాణాకు ఉపయోగపడతాయని కొందరు అంటుండగా, ఇంతకు ముందు నగరంలో ఎక్కడికైనా వెళ్లేందుకు ఆ మార్గాల్లోనే వెళ్లేవారని మరికొందరు చెబుతున్నారు.