స్కూల్స్‌లో టీచర్ల టైమ్‌పాస్.. ఆన్‌లైన్ క్లాస్‌లు లేవా..?

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలకు వస్తున్నామా.. పోతున్నామా అనే తీరులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను విస్మరించి పాఠశాలలో కాలయాపన చేస్తున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపంలో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడం లేదు. టీవీ, ఫోన్ సదుపాయం లేని విద్యార్థులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో చిన్నారులు వ్యవసాయ కూలీలుగా, వ్యాపార దుకాణాల్లో వర్కర్లుగా మారుతున్నారు. బాధ్యతలను విస్మరిస్తున్న టీచర్లు.. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులకు […]

Update: 2021-07-31 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పాఠశాలకు వస్తున్నామా.. పోతున్నామా అనే తీరులో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను విస్మరించి పాఠశాలలో కాలయాపన చేస్తున్నారు. ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపంలో విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావడం లేదు. టీవీ, ఫోన్ సదుపాయం లేని విద్యార్థులను గుర్తించడంలో అలసత్వం వహిస్తున్నారు. ప్రత్యేక దృష్టి సారించకపోవడంతో చిన్నారులు వ్యవసాయ కూలీలుగా, వ్యాపార దుకాణాల్లో వర్కర్లుగా మారుతున్నారు.

బాధ్యతలను విస్మరిస్తున్న టీచర్లు..

ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరువుతున్న విద్యార్థులను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. హాజరుకాని విద్యార్థులను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఏ కారణాల చేత విద్యార్థులు తరగతులకు హాజరు కావడం లేదు, ఎంత మందికి టీవీ, ఫోన్ సదుపాయాలు లేవనే అంశాలను గుర్తించడం లేదు. ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో విఫలమవుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలు పాటించని ఉపాధ్యాయులు..

ఆన్‌లైన్ తరగతులను ప్రారంభించిన ప్రభుత్వం.. సమర్థవంతంగా అమలయ్యేందుకు విద్యార్థులంతా హజరయ్యేలా చర్యలు చేపట్టేందుకు ఉపాధ్యాయులకు పలు బాధ్యతలు అప్పగించింది. విద్యార్థులు సంఖ్యను బట్టి ఒక్కో ఉపాధ్యాయునికి సరిపడా విద్యార్థులను కేటాయించి నిత్యం వారిని పర్యవేక్షించాల్సిందిగా సూచించారు. ఉపాధ్యాయులు తమకు కేటాయించిన విద్యార్థులను ప్రతి రోజు ఫోన్ ద్వారా సంప్రదించిన ఆన్‌లైన్ తరగతులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తుండాలి. ఒక రోజు ముందుగానే తరగతుల షెడ్యూల్‌ను విద్యార్థులకు తెలియజేయాలి. తరగతుల నిర్వహణకు గంట ముందు విద్యార్థులను సంసిద్ధం చేయాలి.

ఆన్‎లైన్ తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల వివరాలను ప్రతి రోజు నోట్ బుక్‌లో నమోదు చేయాలి. హాజరుకాని విద్యార్థులను ఫోన్ ద్వారా లేదా నేరుగా సంప్రదించిన తరగతులను హాజరయ్యేలా చర్యలు చేపట్టాలి. ఆన్‌లైన్ తరగతుల గురించి తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల హాజరయ్యేలా చూడాలి. తరగతులకు హాజరుకాని విద్యార్థులకు పాఠాలకు సంబంధించిన యూ ట్యూబ్ లింక్‌ను విద్యార్థుల ఫోన్‌కు పంపించి పాఠాలు వినేలా చర్యలు చేపట్టాలి. టీవీ ద్వారా, ఫోన్ ద్వారా ఎంత మంది విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారనే అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఈ వివరాలన్నింటిని మానిటరింగ్ చేస్తున్న అధికారులకు అందించాలి. ఈ విధానాలన్ని క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులు చేపట్టకపోవడం వలన విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గుతున్నది.

వ్యవసాయ కూలీలుగా మారుతున్న విద్యార్థులు..

పాఠశాలలకు దూరమైన విద్యార్థులు వ్యవసాయ కూలీలుగా, దుకాణాల్లో వర్కర్లుగా మారుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు దాదాపుగా వ్యవసాయ పనులకు వెళుతున్నారు. ఆన్‌లైన్ తరగతులు వినేందుకు టీవీ, ఫోన్ సదుపాయం లేకపోవడం వీటికి తోడు ఆర్థిక సమస్యలు వెంటాడంతో తల్లిదండ్రులే తమ పిల్లలను కూలీకి తీసుకువెళుతున్నారు. పూట గడవని స్థితిలో ఉన్న పేద కుటుంబాలకు చిన్నారుల కూలీ డబ్బులు కూడా తోడవుతుండటంతో విద్యకు పూర్తిగా దూరమవుతున్నారు. ఉదాహరణకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 425 మంది విద్యార్థులున్నారు. వీరిలో టీవీలు ఫోన్‌లు అందుబాటులో ఉండి ఆన్‌లైన్ తరగతులకు రోజు 150 నుంచి 170 మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. మిగతా విద్యార్థులంతా వ్యవసాయ పనులకు, వివిధ వ్యాపార దుకాణాల్లో కూలీలుగా వెళుతున్నారు. హాజరుకాలేని విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు సరైన చర్యలు చేపట్టడం లేదు.

Tags:    

Similar News