గ్రేటర్ ఎన్నికలపై టీచర్ల ఎఫెక్ట్
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు ఏవైనా ప్రభుత్వ ఉపాధ్యాయులతో నిర్వహిస్తుండటం సర్వసాధారణం. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఉపాధ్యాయుల మినహా నాన్ -టీచింగ్ స్టాఫ్, ఇతర శాఖల్లోని సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల కోసం 48 వేల సిబ్బంది అవసరమవుతారని అంచనా వేసిన ఎన్నికల అధికారులు, వివిధ శాఖలకు లేఖలు కూడా రాశారు. గ్రేటర్ ఎన్నికల విధులకు కేటాయించిన వారికి ఆదేశాలు జారీ చేస్తూ.. డ్యూటీకి రానివారికి ఎన్నికల నిబంధనల […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు ఏవైనా ప్రభుత్వ ఉపాధ్యాయులతో నిర్వహిస్తుండటం సర్వసాధారణం. ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో ఉపాధ్యాయుల మినహా నాన్ -టీచింగ్ స్టాఫ్, ఇతర శాఖల్లోని సిబ్బందిని కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్ ఎన్నికల కోసం 48 వేల సిబ్బంది అవసరమవుతారని అంచనా వేసిన ఎన్నికల అధికారులు, వివిధ శాఖలకు లేఖలు కూడా రాశారు. గ్రేటర్ ఎన్నికల విధులకు కేటాయించిన వారికి ఆదేశాలు జారీ చేస్తూ.. డ్యూటీకి రానివారికి ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేశారు. డిసెంబర్ 1 జరిగే ఎన్నికలకు సంబంధించి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించినా.. 35శాతం మంది గైర్హాజరైనట్టు అధికారులు గుర్తించారు.
నిబంధనల ప్రకారం ఓటింగ్‌కు ఒక్క రోజు ముందుగా సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లు అప్పగించడంతో పాటు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికే పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది చేరుకోవాల్సి ఉంది. అయితే ఆ సమయానికి వారంతా డీఆర్‌సీ కేంద్రాల్లోనే ఉండిపోయారు. కొన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది కూడా రాలేదు. ఎన్నికల విధుల కోసం 30 శాతం రిజర్వ్ సిబ్బందిని ముందుగా ఎన్నికల విభాగం కేటాయించగా.. అసలు అసవరమైనంత స్థాయిలో సిబ్బంది రాకపోవడం గమనార్హం.. వీరిలోనూ జిల్లాల్లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వారిని తీసుకున్నారు.
అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు కూడా..
చివరకు అంగన్ వాడీలు, ఆశా వర్కర్లతో సహా ఎన్నికల విధుల కోసం రావాల్సి వచ్చింది. ముందుగా కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది శిక్షణకు రాకపోవడమేగాక బ్యాలెట్ బాక్స్లు తీసుకునేందుకు సోమవారం డీఆర్‌సీ కేంద్రాలకు కూడా చేరుకోలేదు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కొందరి ఉద్యోగులకు ఆదివారం రాత్రి ఏడు గంటలకు ఫోన్ చేసి ఉదయమే గ్రేటర్ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రావాలని అధికారులు ఆర్డర్స్ వేశారు. స్వంత పనుల మీద వేరే ప్రాంతాలకు వెళ్లినవారు, బంధువుల ఇండ్లకు, టూర్లకు వెళ్లినవారు అని తేడాలేకుండా ఎలక్షన్స్ ఆదేశాలు రావడంతో తప్పనిపరిస్థితుల్లో ఇక్కడకు చేరుకున్నట్టు కరీంనగర్ జిల్లాకు చెందిన ఉద్యోగి ఒకరు తెలిపారు.
ఆలస్యంగా తెలిసింది:
అయినా పోలింగ్ స్టేషన్లకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేరని ఆదివారం మధ్యాహ్నానికి గానీ అధికారులు గుర్తించలేకపోయారు. చివరి నిమిషంలో ఎలా సర్ధుబాటు చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు ఏవీ కాలేజీలో ఏర్పాటు చేసిన డీఆర్‌సీ కేంద్రాన్ని సందర్శించింది. సాయంత్రం నాలుగు గంటలైనా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్‌లు అక్కడే ఉన్నాయి. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కూడా రాలేదని సంబంధిత రూట్ అధికారులు తెలిపారు. అంతగా విద్యార్హత లేని సిబ్బంది, జిల్లాల నుంచి వచ్చిన వారిలో అనేక మంది తమకు ఎలక్షన్స్ డ్యూటీపై అవగాహన లేదని సమస్యలను ఏకరువు పెట్టారు. దీంతో వీరందరికి ఓ పదిహేను నిమిషాలు క్లాసులు చెప్పారు. బ్యాలెట్ బాక్స్లు తీసుకునేందుకు రానివారి స్థానంలో సర్దుబాటు చేసేందుకు చివరి నిమిషంలో జీహెచ్ఎంసీ ఆర్ అండ్ బీ అధికారులకు ఫోన్ చేసి రప్పించారు.
అయినా తక్కువ పడినా సిబ్బంది కోసం దగ్గర ఏరియాల్లో ఉన్న ఆశా వర్కర్లను సైతం పిలిపించారు. సోమవారం రాత్రి వరకూ విధుల కేటాయింపే జరపగా.. బ్యాలెట్ పత్రాలు, బాక్స్‌లు సిద్ధం చేసుకొని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ఇబ్బందులు తప్పలేదు. గ్రేటర్ ఎన్నికల విధుల కోసం మూగ, చెవిటి సిబ్బందిని కూడా తీసుకోవడం గమనార్హం.. జిల్లాల నుంచి చేరుకున్న వీరిని ఎక్కడ కేటాయించాలో, విషయాన్ని ఎలా తెలపాలో తెలియక డీఆర్‌సీ కేంద్రం, రూట్ అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల రోజు వేల సంఖ్యలో వచ్చే ఓటర్లతో వారు ఎలా సమన్వయం చేసుకుంటారని సంబంధిత అధికారులే వాపోతున్నారు.
ఆ నిర్ణయమే సమస్యకు కారణం:
జీహెచ్ఎంసీ ఎన్నికలకు కేటాయించినవారు డ్యూటీకి రాలేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. అంతకుముందుగా ఉపాధ్యాయులను ఎలక్షన్ డ్యూటీలకు తీసుకోవద్దనే ప్రభుత్వ నిర్ణయమే ఈ సమస్యకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. డ్యూటీలు వేసిన వారిలో కరోనా భయాలు, సిఫారసులు, ఇతర కారణాలతో రాలేదు. నిజానికి ఉపాధ్యాయులను కేటాయిస్తే సమస్య ఇంత తీవ్రంగా ఉండేది కాదని ఎలక్షన్స్ ఆఫీసర్లు సైతం అంగీకరిస్తున్నారు.
ఇటీవల జరిగిన దుబ్బాక ఎన్నికల వరకూ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా విశ్వసించడంతోనే వారిని దూరంగా పెట్టారని అందరూ భావిస్తున్నారు. అయితే అది బల్దియా ఎన్నికల నిర్వాహణపైనే ప్రభావం చూపుతోంది. సిబ్బంది కొరతతో ఇది చాలా స్పష్టమవగా.. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుందన్న నమ్మకం లేకుండా పోయింది. విద్యార్హత తక్కువగా ఉన్నవారిని, అనుభవలేమి సిబ్బంది సమస్యగా మారనుంది.
మరో వైపు టీచింగ్ స్టాఫ్‌ను తీసుకోకపోవడంతో వారంతా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే కార్యక్రమం కూడా అధికార పార్టీపై ప్రభావం చూపనుంది. ఎన్నికల డ్యూటీని నిర్వహించడంలో ఉపాధ్యాయులను మించినవారు లేరని ఎన్నికల అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వారి వృత్తి రీత్యా టీచర్లకు ఉన్న సహజ లక్షణాలు ఎన్నికల డ్యూటీలను సమర్థవంతంగా నిర్వహించడంలో సహయపడుతాయని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.
ఓటింగ్ రోజు వచ్చే సమస్యలను, అవంతరాలను ఉపాధ్యాయులు చాలా సులభంగా ఎదుర్కోగలరని, ఇప్పుడు కేటాయించిన సిబ్బందితో కొత్త సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులు లేకుండా నిర్వహిస్తున్న మొట్టమొదటి ఎలక్షన్స్‌గా ప్రస్తుత గ్రేటర్ పోరు రికార్డుల్లో ఎక్కనుంది. ఎన్నికల నిర్వహించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన కింది స్థాయి ఉద్యోగులు, జిల్లాల నుంచి వచ్చిన అన్ – స్కిల్డ్ వర్కర్లు ఏ విధంగా నిర్వహిస్తారో.. డిసెంబర్ ఒకటిన తేలనుంది.