వేధింపులు భరించలేం.. జీతాలిస్తే వెళ్ళిపోతాం
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నర్సుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్నవారితోనే మరింత ఎక్కువ పని చేయించుకోడానికి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైనా మాత్రలతోనే వారితో డ్యూటీ చేయించుకుంటున్నట్లు తమిళనాడు నర్సులు వాపోతున్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చాలా కాలంగా పనిచేస్తున్న తమలో కొద్దిమందికి పాజిటివ్ వచ్చిందని, అయినా మాత్రలను వేసుకుని డ్యూటీకి రావాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని, నిరాకరించినందుకు బైటకు పంపకుండా నిర్బంధించి జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని వీడియో ద్వారా మీడియాకు […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా నర్సుల కొరత తీవ్రంగా ఉండడంతో ప్రస్తుతం పనిచేస్తున్నవారితోనే మరింత ఎక్కువ పని చేయించుకోడానికి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురైనా మాత్రలతోనే వారితో డ్యూటీ చేయించుకుంటున్నట్లు తమిళనాడు నర్సులు వాపోతున్నారు. నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చాలా కాలంగా పనిచేస్తున్న తమలో కొద్దిమందికి పాజిటివ్ వచ్చిందని, అయినా మాత్రలను వేసుకుని డ్యూటీకి రావాల్సిందిగా ఇబ్బంది పెడుతున్నారని, నిరాకరించినందుకు బైటకు పంపకుండా నిర్బంధించి జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని వీడియో ద్వారా మీడియాకు వారి బాధల్ని చెప్పుకున్నారు.
ఆసుపత్రి యాజమాన్యం వేధింపుల్ని లిఖితపూర్వకంగా రాష్ట్ర నర్సుల సంఘానికి తెలియజేశారు. తమిళనాడు నుంచి వచ్చిన తమకు కరోనా ఇన్‌ఫెక్షన్ సోకినందునే క్వారంటైన్‌లోకి, ఐసొలేషన్‌లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నామని, కానీ యాజమాన్యం మాత్రం అందుకు ఒప్పుకోవడంలేదని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం లేకపోవడంతో సంఘానికి లేఖ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. నర్సింగ్ వృత్తిలో ఉంటూ పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసి కూడా దాన్ని దాచిపెట్టి వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడేవారికి చికిత్స ఎలా చేస్తామని ఎం. లవీమా మేరీ అనే నర్సు వ్యాఖ్యానించారు.
నిర్బంధ పరిస్థితుల్లో పనిచేయలేమంటూ ఆసుపత్రి నర్సింగ్ సూపరింటెండెంట్‌కు చెప్పామని, జీతం ఇస్తే సొంతూరికి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత వస్తామని చెప్పినా ఆమె ఇవ్వడానికి నిరాకరించారని, హెచ్‌ఆర్ డిపార్టుమెంట్ స్టాఫ్ కూడా సహకరించలేదని సుబ్బుతాయి అనే మరో నర్సు తన ఆవేదన వ్యక్తం చేసింది. చేతిలో డబ్బులు లేకుండా తమిళనాడు వరకూ వెళ్ళలేమన్న ధైర్యంతోనే వారు జీతం ఇవ్వకుండా వేధిస్తున్నారని, కనీసం ఆసుపత్రి నుంచి బైటకు వెళ్ళడానికి కూడా సెక్యూరిటీకి చెప్పి ఆపేయిస్తున్నారని ఆరోపించారు.
హాస్టల్‌లో ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నామని, ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిసినా క్వారంటైన్‌లో ఉండే అవకాశమే లేకుండాపోయిందని మురుగలక్ష్మి అనే నర్సు పేర్కొన్నారు. ఒక నర్సుగా సామాజిక గుర్తింపు, గౌరవం కూడా ఈ ఆసుపత్రిలో లేదని, చేసిన పనికి జీతం అడిగినందుకు నోటికొచ్చినట్లు దూషిస్తున్నారని తన బాధను చెప్పుకున్నారు. ఈ ఆసుపత్రిలో కొత్తగా కరోనా పేషెంట్ల కోసం వార్డును ఏర్పాటు చేసిన తర్వాతనే తమకు వైరస్ ఇన్‌పెక్షన్ సోకిందని తెలిపారు.