తమిళ రాజకీయాల్లో ఆ రెండు పార్టీల మధ్యనే పోటీ..!

నేషనల్ డెస్క్: దేశ రాజకీయాలు ఒకవైపు.. తమిళనాట రాజకీయాలు మరోవైపు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రంలో మాత్రం ద్రవిడ పార్టీనే అధికారంలో ఉంటుంది. 1967 నుంచి ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం(ఏఐఏడీఎంకే) పార్టీల మధ్యే అధికారం దోబూచులాడుతున్నది. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ద్విముఖ పోరే కొనసాగనుంది. ఏఐఏడీఎంకే వరుసగా మూడోసారి అధికారం కోసం ఆరాటపడుతుండగా, పదేళ్ల తర్వాత పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాల్సిందేనని డీఎంకే శక్తియుక్తులను కూడగట్టుకుని సంగ్రామంలోకి […]

Update: 2021-02-28 13:30 GMT

నేషనల్ డెస్క్: దేశ రాజకీయాలు ఒకవైపు.. తమిళనాట రాజకీయాలు మరోవైపు. కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా రాష్ట్రంలో మాత్రం ద్రవిడ పార్టీనే అధికారంలో ఉంటుంది. 1967 నుంచి ద్రవిడ మున్నెట్ర కజగం(డీఎంకే), ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం(ఏఐఏడీఎంకే) పార్టీల మధ్యే అధికారం దోబూచులాడుతున్నది. ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ద్విముఖ పోరే కొనసాగనుంది. ఏఐఏడీఎంకే వరుసగా మూడోసారి అధికారం కోసం ఆరాటపడుతుండగా, పదేళ్ల తర్వాత పీఠాన్ని ఎలాగైనా అధిరోహించాల్సిందేనని డీఎంకే శక్తియుక్తులను కూడగట్టుకుని సంగ్రామంలోకి దూకుతున్నది. సీఎం ఈ పళనిస్వామికి, ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌కూ ఈ ఎన్నికలు వారి భవిష్యత్‌కు లిట్మస్ పరీక్షలాంటివే. ప్రత్యర్థుల నుంచి మిత్రులుగా మారిన పన్నీర్ సెల్వం, వీకే శశికళను ఎదుర్కొని ఇకపైనా పార్టీలో నిలదొక్కుకోవడానికి పార్టీని విజయతీరానికి చేర్చడం పళనిస్వామికి కీలకం. డీఎంకే సారథిగా నిరూపించుకోవడానికి స్టాలిన్‌కూ ఎన్నికలు అంతే ముఖ్యం.

ఈ ఎన్నికలు ‘అమ్మ’ జయలలిత, కలైంజ్ఞర్ కరుణానిధి లేకుండా జరుగుతున్నాయి. అంతేకాదు, ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో నవశకానికి నాందీ పలకనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 2న విడుదలవుతాయి. ఈ ప్రకటనకు ముందే డీఎంకే, ఏఐఏడీఎంకేలతోపాటు బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే సారథ్యంలో బీజేపీ, పీఎంకే, డీఎండీకే, టీఎంసీ, న్యూ జస్టిస్ పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. డీఎంకే అలయెన్స్‌లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్, ఎంఎన్ఎంకేలు భాగస్వాములుగా ఉన్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాగా, కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో మెరవనున్నారు. ఆయన ఇతర పార్టీలను కూడగట్టి ఉనికిని చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి బరిలోకి దిగాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఇద్దరు అగ్రనేతల అస్తమయం తర్వాత ఏర్పడ్డ రాజకీయ ఖాళీని పూర్తి చేసే సమయంలో పాలిటిక్స్‌లోకి రంగప్రవేశం చేశారు. సుమారు 80శాతం అక్షరాస్యత రేటు గల తమిళనాడులో పొలిటికల్ గిమ్మిక్కులు పెద్దగా ఫలితాలనివ్వకపోవచ్చునని నిపుణుల అభిప్రాయం.

బీజేపీ టార్గెట్ 2026

2011లో 203 సీట్ల భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఏఐఏడీఎంకే 2016లోనూ సొంతంగా 130 సీట్లను సాధించుకోగలిగింది. 2016లో డీఎంకే 67 స్థానాలను మెరుగుపరుచుకుని 98 సీట్లను గెలుచుకుంది. ఇదే ఊపు 2019 పార్లమెంటు ఎన్నికల్లోనూ కనిపించింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను డీఎంకే కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేశాయి. మొత్తం 39 పార్లమెంటు స్థానాలకుగానూ 38 సీట్లను డీఎంకే కూటమి రాబట్టుకోగా ఏఐఏడీఎంకే కేవలం ఒకే సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమున్నప్పటికీ రాష్ట్రంలో ఆ పార్టీ ఒక్క ఎంపీ సీటునూ గెలవలేకపోయింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భావసారూప్యత పార్టీలన్నింటినీ కలుపుకుని రాష్ట్రంలో తనకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరుచుకోవాలని బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తున్నది.

2026లో ఇక్కడ అధికారంలో ఉండాలని ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయి. తొలి నుంచి రాష్ట్రంలో అధికారపక్షంపై ప్రతి సమస్యపై గట్టి కౌంటర్ ఇస్తున్న ప్రతిపక్ష డీఎంకే క్రమంగా బలపడుతున్నది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో మరింత ఉత్తేజం పొందింది. ప్రభుత్వ తప్పిదాలను బలంగా నిలదీస్తున్నది. ఏఐఏడీఎంకే దశాబ్దకాలంగా అధికారంలో ఉండి అవినీతికి పాల్పడుతున్నదని పదునైన ఆరోపణలు చేస్తున్నది. అంతేకాదు, కేంద్రంలోని బీజేపీకి ఏఐఏడీఎంకే కీలుబొమ్మ అని విమర్శలు గుప్పిస్తున్నది. తమిళ ప్రజలపై బీజేపీ హిందీ భాషను రుద్దుతున్నదని, రాష్ట్ర ప్రజల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని రెండు పార్టీలపై కలిపి ఆరోపణలు చేస్తున్నది. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేకత, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు, ప్రభుత్వ వ్యతిరేకత డీఎంకే కూటమికి కలిసొచ్చే అంశాలుగా ఉన్నాయి.

అధికారపక్షానికి శశికళ ఫీవర్:

2016లో అధికారాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఏఐఏడీఎంకే సారథి ‘అమ్మ’ జయలలిత మరణంతో సీఎం కుర్చీపై అంతర్గత విభేదాలు వచ్చాయి. పన్నీర్ సెల్వం అటు తర్వాత జయలలిత నెచ్చెలి వీకే శశికళ సీఎం సీటుకు సమీపంగా వెళ్లినా పళనిస్వామి చేజిక్కించుకున్నారు. శశికళ అవినీతి కేసులో నాలుగేళ్లు జైలుకు వెళ్లారు. శశికళ వర్గంతో పళనిస్వామి కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. శశికళను, టీటీవీ దినకరణ్‌ను బహిష్కరించాక, 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకున్నాక పళనిస్వామి దారి సుగమమైంది. కరోనా సంక్షోభ సమయంలో నగదు అందజేత, సాగు రుణమాఫీ, పంట నష్టాలకు పరిహారం, కరోనా కట్టడిలో ఓ మేరకు విజయవంతమై ఆయన ప్రజల్లో సానుకూలత సాధించుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బంగారం తాకట్టు రుణాలు మాఫీ చేయడం, వన్నియర్ కమ్యూనిటీకి దాదాపు 10శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించి ఉత్తర తమిళనాడులో ఓ మేరకు పట్టుసాధించుకున్నట్టయింది. ఈ ఏరియాలో వన్నియర్ కమ్యూనిటీ బలంగా ఉన్నది. కానీ, నాలుగేళ్ల శిక్ష తర్వాత విడుదలైన శశికళ ప్రాబల్యం, పదేళ్లు అధికారంలో ఉండటం మూలంగా సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్తుతం పళనిస్వామికి ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఏఐఏడీఎంకే కలిసికట్టుగా శశికళ నేతృత్వంలో బరిలోకి దిగాలని టీటీవీ దినకరణ్ పిలుపునిస్తున్నారు. కాగా, పార్టీ జెండాను వినియోగించవద్దని ప్రభుత్వం ఫిర్యాదులు చేస్తున్నది. వాటినీ శశికళ ఖాతరు చేయకుండా దూసుకెళ్లుతున్నారు. ఒకవేళ శశికళ వేరుగా టీటీవీ దినకరణ్ పార్టీ ఏఎంఎంకేతో కలిసి పోటీ చేసినా ఏఐఏడీఎంకే ఓట్లు చీలిపోయే అవకాశముంది. దీంతో అధికారపక్షానికి శశికళ ఫీవర్ పట్టుకుంది.

Tags:    

Similar News