‘సెక్స్’ శారీరక అవసరం కాదు.. టీనేజర్స్‌ మైండ్ సెట్‌పై ఓపెన్ టాక్!

దిశ, ఫీచర్స్ : తరాలు, అంతరాలతో పాటు యువతరం, అమ్మనాన్నలు కూడా మారుతున్నారు. ఒకప్పుడు నాన్నతో మాట్లాడాలంటే అమ్మే వారధిగా నిలిచేది. అమ్మతో ఏదైనా చెప్పాలంటే అక్కనే ఆ పనికి ప్రతినిధిగా ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్‌తో ఏదైనా నిరభ్యంతరంగా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. కానీ ఒక్క విషయంలో మాత్రం మనసు పొరల్లో దాచింది బయట పెట్టేందుకు సంకోచిస్తున్నారు. అందరికీ తెలిసిన ఆ అంశమే ‘లైంగికత’. పిల్లలతో మనం చేసే అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన చర్చల్లో ‘సెక్స్’ […]

Update: 2021-11-06 21:35 GMT

దిశ, ఫీచర్స్ : తరాలు, అంతరాలతో పాటు యువతరం, అమ్మనాన్నలు కూడా మారుతున్నారు. ఒకప్పుడు నాన్నతో మాట్లాడాలంటే అమ్మే వారధిగా నిలిచేది. అమ్మతో ఏదైనా చెప్పాలంటే అక్కనే ఆ పనికి ప్రతినిధిగా ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్‌తో ఏదైనా నిరభ్యంతరంగా మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. కానీ ఒక్క విషయంలో మాత్రం మనసు పొరల్లో దాచింది బయట పెట్టేందుకు సంకోచిస్తున్నారు. అందరికీ తెలిసిన ఆ అంశమే ‘లైంగికత’. పిల్లలతో మనం చేసే అత్యంత ముఖ్యమైన, ప్రభావవంతమైన చర్చల్లో ‘సెక్స్’ తప్పక ఉండాలి. ఆలోచనాత్మకంగా ఉద్దేశపూర్వకంగా దాన్ని కొనసాగించాలి.

పిల్లలు యుక్తవయస్సులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ టాపిక్‌పై మాట్లాడేందుకు సిగ్గుపడే బదులు లైంగిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని అంశాలను.. శారీరక, భావోద్వేగాలను చర్చించడం ఎంతో ఉత్తమం. లేదంటే సరైన మార్గదర్శకత్వం లేక అనర్థాలు జరిగే అవకాశముంది. మీ బిడ్డ సురక్షితంగా ఉండాలని కోరుకుంటే త్వరగా ఓపెన్ అయ్యేందుకు ప్రయత్నించండి. అప్పుడే ప్రతీ తదుపరి చర్చ మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మీ పిల్లలు మిమ్మల్ని చేరుకునేందుకు సులభతరం చేయడంతో పాటు పిల్లలకు మీపై గట్టి నమ్మకాన్ని ఏర్పరుస్తుంది.

‘సెక్స్ ఎడ్యుకేషన్’ పెద్దలకు మాత్రమే కాదు, యుక్తవయస్సులోకి ప్రవేశించే వారికి కూడా ముఖ్యమైనదే. వారి జీవితం ప్రమాదంలో పడకుండా ఉండాలంటే ‘లైంగికత’ విషయాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సోషలాజికల్ ఫ్యాక్టర్స్ అనేక విధాలుగా పిల్లలకు లైంగిక విద్యను పరిమితం చేస్తున్నప్పటికీ తల్లిదండ్రులుగా మీరు తప్పనిసరిగా బాధ్యత వహిస్తూ మీ బిడ్డకు సహాయం చేయాలి. యుక్తవయస్కులు తమ తల్లిదండ్రులతో సెక్స్ గురించి మాట్లాడటాన్ని అసహ్యంగా భావించవచ్చు. కానీ నిజం చెప్పాలంటే హార్మోన్ల ప్రభావం వల్ల వారి ‘లైంగికత’ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

గర్భధారణ ఎలా వస్తుంది? దాన్ని ఎలా నిరోధించొచ్చు? సేఫ్ సెక్స్ అంటే ఏమిటి? లైంగికంగా సంక్రమించే వ్యాధులు వాటి నివారణ మార్గాలు? వంటి ఆసక్తికరమైన టాపిక్స్‌ను ఎంచుకుని తరచుగా చాట్ చేయడం వల్ల వారు అసౌకర్యంగా భావించకపోవచ్చు. అంతేకాదు మనుషులు శరీరాలను విలువైన, పవిత్రమైన ఆస్తిగా పరిగణించడానికి కారణాలు చెప్పాలి. వారి భావోద్వేగ అవసరాలను ఎలా గౌరవించాలో, వారి చర్యలకు జవాబుదారీగా ఎలా బాధ్యత వహించాలో కూడా పిల్లలకు నేర్పడం అత్యంత ఆవశ్యకం. అయితే తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. మీ కంఫర్ట్ స్థాయికి మించి ఆ సమస్యలను కవర్ చేయడానికి ప్రయత్నించొద్దు. అవసరమైతే నిపుణులతో సహా ఇతర విశ్వసనీయమైన వ్యక్తులతో లేదా పెద్దలతో వాటిపై అవగాహన కల్పించాలి.

శారీరకం అవసరం కాదు!

సెక్సువల్ కన్సెంట్ (లైంగిక సమ్మతి) గురించి పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు.. సెక్స్ అనేది కేవలం శారీరక అవసరాలకే కాదని, రెండు ఆత్మల కలయిక అనే విషయాన్ని నొక్కి చెప్పాలి. ఏ బంధమైనా.. గౌరవం, నమ్మకం అనే అంశాలపైనే ఆధారపడి ఉంటుంది. ‘ప్రేమ’ ఆ బంధానికి ఇంధనంలాంటిది. కానీ చాలా సన్నిహితంగా ఉన్న జంటల మధ్య కూడా లైంగిక చర్యలో పాల్గొనడానికి సిద్ధంగా లేని సమయం రావచ్చు. అలాంటప్పుడు ఎదుటివారి పరిస్థితి గురించి ఆలోచించాలి. వారి మైండ్‌సెట్ ఏంటో గుర్తించాలి. వారికి స్వేచ్ఛను కల్పిస్తూనే, వారి నిర్ణయానికి గౌరవమివ్వాలి. బలవంతం చేయడం, మానసికంగా బ్లాక్ మెయిల్ చేయడం లేదా అలా చేయమని ఒప్పించడం పద్ధతి కాదని వివరించాలి.

అదేవిధంగా.. వారు తమ శరీరానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేంత బలంగా ఉన్నారని కూడా నొక్కి చెప్పాలి. స్నేహితులు ఏమనుకున్నా సరే లైంగిక ఎన్‌కౌంటర్‌ను తిరస్కరించే అధికారం, హక్కు వారికి ఎప్పుడూ ఉంటుంది. ఈ విషయంలో భాగస్వామి (మేల్/ఫిమేల్)లో ఇద్దరికీ ‘నో’ చెప్పే అవకాశం ఉంటుందని గ్రహించాలి. అయితే ప్రతి ఒక్కరూ లైంగిక చర్యలో పాల్గొనకూడదనుకున్నప్పుడు నేరుగా తిరస్కరించలేరు లేదా ‘నో’ అని చెప్పరు. కానీ వారు బలవంతంగా చేస్తున్నారనే విషయం అర్థం కావచ్చు. అలాంటి సమయంలో ఒత్తిడి చేయడం సరికాదు. బదులుగా వారు సిద్ధంగా ఉన్నంత వరకు వేచి ఉండాలి.

ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్!

యుక్తవయస్కులు ఫిజికల్‌ మెచ్యూరిటీ పెరగడంతో మరింత ఎక్కువ స్వాతంత్ర్యాన్ని కోరుకుంటారు. తమ నిర్ణయాలు సరైనవని, పేరెంట్స్‌కు ఏమాత్రం తెలియదనే భ్రమలో ఉంటారు. సెక్స్‌కు సిద్ధంగా ఉన్నారని, దాన్ని పొందడం వల్ల తమను మరింత పరిణతి, స్వతంత్రంగా మారుస్తుందని భావిస్తారు. ఇలాంటి తరుణంలో పేరెంట్స్ పిల్లలను దండించకుండా ప్రాక్టికల్‌గా జరిగే అంశాలను వివరించే ప్రయత్నం చేయాలి. ‘మీరు శృంగారంలో పాల్గొని, గర్భం దాల్చడం లేదా ఎస్‌టీడీ(sexually transmitted disease)ని పొందడం వంటి ఏదైనా ఊహించని సంఘటన జరిగితే.. మీరు దాన్ని ఎలా ఎదుర్కొంటారు? అది మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుంది? దీని వల్ల కలిగే పర్యావసనాలకు బాధ్యత వహించే, హ్యాండిల్ చేసే శక్తి మీకు ఉందా? స్వల్పకాలిక ప్రయోజనాలు (శారీరక ఆనందం లేదా భావోద్వేగ సంతృప్తి) అంచనా వేయడంలో టీనేజర్స్ ఎంతోమంది విఫలమయ్యారు. వారి గురించి మీకు తెలుసు కదా! అంతేకాదు సెక్స్ కాకుండా అపోజిట్ జెండర్‌తో మంచి అనుభూతి చెందడానికి, సన్నిహితంగా ఉండటానికి చాలా మార్గాలు ఉన్నాయని మీకు తెలుసా?’ వంటి విషయాలపై క్లారిటీ ఇవ్వాలి.

యువత లైంగికత గురించి సరైన వాస్తవాలను మాత్రమే కాకుండా.. సెక్స్ గురించి ఆరోగ్యకరమైన, సురక్షితమైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. తమ పిల్లలతో లైంగికత గురించి బహిరంగంగా మాట్లాడే తల్లిదండ్రులు.. పిల్లలు పెరిగే కొద్దీ వారి లైంగిక ప్రవర్తనలపై మరింత ప్రభావం చూపుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఏ విషయం చెప్పినా అది ఉపన్యాసంలా ఉండకూడదు. వారికి బోర్ కొట్టించొద్దు. హెచ్చరిస్తే వారిలో మీపై కోపం, భయం పెరుగుతుంది. వాళ్లకు నచ్చిన రీతిలోనే సందేశాన్ని చేరవేయాలి. అద్వితీయమైన సంబంధ బాంధవ్యాలకు విలువనివ్వడంలోని గొప్పతనం, అదే పేరెంట్స్ లక్ష్యమని వారు స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు.. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం, వారికి నిర్దేశించిన సరిహద్దులను పిల్లలే స్వయంగా అభినందిస్తారు.

సెక్స్ చేయకపోతే ‘లవ్’ కోల్పోతామా?

చాలా మంది యువకులు సెక్స్ చేయకపోతే తమ భాగస్వామిని కోల్పోతారనే భ్రమలో ఉండిపోతారు. మరికొందరు తమ భాగస్వాములను ప్రేమిస్తున్నామని చెప్పడానికి సెక్స్ చేయవలసి ఉంటుందని నమ్ముతారు. మరియు టీనేజర్లు సెక్స్‌తో పాటు తమ భావాలను చూపించే ఇతర మార్గాల గురించి ఆలోచించకపోవచ్చు. ఇందుకోసం భాగస్వామిని ఒత్తిడి చేయడం ఎప్పటికీ సరైంది కాదని గ్రహించాలి. ఇది అనారోగ్యకరమైన లేదా దుర్వినియోగ సంబంధానికి సంకేతమని కూడా తెలుసుకోవాలి. స్పష్టంగా చెప్పాలంటే.. నిజమైన ప్రేమతో కూడిన బంధంలో భాగస్వామిని అమితంగా గౌరవిస్తారు, ఆరాధిస్తారు. సంయమనం పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు అమితమని తెలుసుకోండి. ప్రస్తుతం సెక్స్ చేయడం కంటే భవిష్యత్తు కోసం ప్రణాళికలు చాలా ముఖ్యమైనవి
– లోగాన్ లెవ్‌కోఫ్, సెక్స్ ఎడ్యుకేటర్

మీడియాలో ‘సెక్స్ ఎడ్యుకేటెడ్’ కంటెంట్ పుష్కలంగా ఉంది. టెలివిజన్ కార్యక్రమాలు, చలనచిత్రాలు, వెబ్‌సైట్‌లు, పుస్తకాలు, మ్యాగజైన్‌లు యువతకు లైంగికత గురించి అవగాహన కల్పించడానికి ఒక ఆధారం. వాటిలో వచ్చే “కథాంశాలు” వారి గురించి కాకుండా ఇతరులకు సంబంధించినవి కాబట్టి, వాటి పర్యవసనాలు అర్థం చేసుకునే అవకాశముంది. తమ సందేహాలకు సమాధానాలు కూడా పొందవచ్చు. రొమాంటిక్ అట్రాక్షన్, LGBTQ సమస్యలు, డేటింగ్ పద్ధతులు, బ్రేకప్‌లు, క్రష్‌, లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్స్ యుక్తవయస్సులో శరీర మార్పులు వంటి ఎన్నో టాపిక్స్‌లోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

-శ్రావణ్ కుమర్ పత్తిపాక

వర్షంలో కత్రినా హాట్ నంబర్.. తట్టుకోలేమంటున్న ఫ్యాన్స్


Similar News